గీతోపనిషత్తు -352
🌹. గీతోపనిషత్తు -352 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚
🍀 33-2. కూడి యుండుట - సమ వర్తనము దుర్లభము. బ్రాహ్మణ క్షత్రియులకు అసహనము, అగ్రహము పిలవని పేరంటముగ పొటమరించు చుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. 🍀
కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33
తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.
వివరణము : జీవుల సేవ చేయుచున్నను వారి యందలి దైవమును దర్శింప లేకపోవుట వలన సేవ చేయుచున్నామను అహంకారము తెలియకయే పెరుగుచుండును. జ్ఞానబలము చేత, అధికార బలము చేత వీరు పరిసరముల యందున్న దైవమును విశ్వసింతురు. దైవము పేరనే దశాబ్దముల తరబడి కార్యములు చేయుచున్నను వీరు నిరహంకారులగుట అంత సులభము కాదు. తోటి జీవులను నిరసించుట, నిందించుట, మాటలతో బాధ పెట్టుట, తమవారి కష్టనష్టములను గుర్తింపకుండుట వీరి యందలి బలహీనత. సమాన ధర్మము వీరికి పరీక్ష వంటిది.
సమ వర్తనము దుర్లభము. అసహనము, అగ్రహము పిలవని పేరంట ముగ పొటమరించు చుండును. కనుక వీరిరువురిని గూర్చి దైవము ప్రత్యేకముగా పలికినాడేమో! గోపికలకు, గోపబాలకులకు దర్శనమైన రీతిలో బ్రాహ్మణ క్షత్రియులకు కృష్ణ దర్శనము కాలేదు. ఇది ప్రత్యక్షముగ శ్రీకృష్ణుని జీవితమున చూడవచ్చును. జ్ఞానులగు బ్రాహ్మణ క్షత్రియుల కన్న పామరులగు ఇతర భక్తులే దైవమునకు చేరువైనారు. సంఘమున అధికారము గల వారికి అహంకారమను క్రీనీడ పనిచేయును. వారు ఎప్పటి కప్పుడు అహంకారమును తొలగించు కొనుచు నుండ వలెను. ఇతరులకీ సమస్య తక్కువ. కాని వీరు కూడ సర్వాత్మకుడగు దైవము నుండి ఏర్పడిన వారే కనుక, వీరును దైవమును తప్పక చేరగలరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
16 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment