మైత్రేయ మహర్షి బోధనలు - 123
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 123 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 95. జాలి - దయ 🌻
జాలి పడుట దయ చూపుట కాదు. జాలి వేరు, దయ వేరు. జాలి పడువారు జాలిని కోరుదురు కూడ. తమపై ఎవరికిని జాలిలేదని కూడ వారికనిపించుచుండును. తానితరులపై జూపిన జాలి తనపై
నెవ్వరును చూపుట లేదని కూడ జాలి పడుదురు. దుఃఖింతురు కూడ. ఆ దుఃఖము నుండి ఇతరులపై ఆరోపణలు చేయుట ప్రారంభింతురు. తమను గూర్చి ఎవరును పట్టించు కొనుట లేదని రోషము చెందుదురు. తమలో గల జాలి తమపై ఆవరించి చైతన్యమునకు అవరోహణము కలిగించు కొనుచుందురు. వారి దుఃఖము, ద్వేషము, రోషము కారణముగ రోగగ్రస్తులు కూడ నగుదురు. దయ, జాలివంటిది కాదు.
దయ కలవాడు, ఇతరుల కష్టములను చూచి కేవలము జాలిపడక వారికేమి కావలయునో బుద్ధి నుండి గ్రహించి నిర్వర్తించును. వారి కష్టనష్టములను తన లోనికి గొనక వారికి సహాయ సహకారము లందించును. దయ గలవాడు, జాలి గలవాడి వలె దుఃఖించడు. కర్తవ్యనిర్వహణమే గావించును. జాలి హృదయ దౌర్బల్యము కలిగించును. దయ, హృదయ వికాసమును గావించును. జాలి విషయమున “జాలి పడుట" అందురు. దయ విషయమున “దయ చూపుట” అందురు. ఒకటి పడుట కాగ రెండవది చూపుట యుండును. పడుటకన్న చూపించుట మేలు కదా! హృదయము నందలి పురుషప్రజ్ఞ - దయ. స్త్రీ ప్రజ్ఞ - జాలి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
24 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment