ఈశ్వరుని చతుర్వ్యూహము Chaturvyuha of Ishwar (4 Facets of the Lord)

🌹. ఈశ్వరుని చతుర్వ్యూహము 🌹


1. వాసుదేవ వ్యూహము : నరనారాయణ రూపుడగు పురుషుని ఆశ్రయించి, ఆ పురుషునితో ఐక్యత భావము పొందిన ప్రకృతి, లేక మాయాశక్తి నిర్గుణుడైన పురుషోత్తముని సగుణునిగా చూపించుచు 'శ్రీ' అన్న పేరుతో వెలయుచుండగా, అట్టి పురుషుని రూపము వాసుదేవ వ్యూహము. నిర్గుణ నారాయణుని మాయా శక్తి ఆశ్రయించగా సగుణ నారాయణునిగా తోచును. ఆ సగుణ నారాయణుని శ్రీమన్నారాయణుడని అందురు. శ్రీ అనగా మాయావరణలోని ప్రకాశము. శ్రీ లేనిచో, నిరావరణమందు తాను తానుగా ప్రకాశించుకొను ప్రకాశ రూపము. ఈ వాసుదేవ వ్యూహములోని పురుషుడు శ్రీ యొక్క ఆశ్రయము వలన షడ్గుణైశ్వరుడగుచున్నాడు. భక్తులకు ఉపాస్యమైన వ్యూహములో నున్నాడు. వ్యూహాతీత పురుషుడు పురుషోత్తముడుగా నిర్గుణముగా, జ్ఞానుల లక్ష్యమై యున్నాడు.

2. సంకర్షణ వ్యూహము : భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, దిక్కులు, కాలము, అహంకారము, మహత్తు, మూల ప్రకృతి - ఇవన్నీ ఒకదానికంటే మరొకటి క్రమముగా పదేసి రెట్లు సూక్ష్మ తరము. పురుషుడు వీటన్నింటికంటె సూక్ష్మాతిసూక్ష్ముడై వీటియందే అణోరణియాన్ గా వ్యాపించి ప్రతిదానిలోను అంతర్యామియై యున్నాడు. జగత్కారణుడుగాను, అతీతుడుగా కూడా ఉన్నాడు. ఈ పురుషుని వ్యూహము సంకర్షణ వ్యూహము. కర్షణ అనగా ఆకర్షణ శక్తి. మూడు పాదములు అతీతమైన మోక్ష స్థానము కాగా, ఒక్క పాదమందు మాయాశక్తి వలన ఏర్పడిన వాటిలో అంతర్యామియమై, వ్యూహాత్మకముగా సంసారాగ్నిలో తపించుచున్న జీవులను తనలోనికి చక్కగా ఆకర్షింపచేసుకొని మోక్షము నందించుచున్నాడు గనుక సంకర్షుణుడు మోక్ష ప్రదాతయగుచున్నాడు.

3. ప్రద్యుమ్న వ్యూహము : ఏకకాలములో ప్రకృతి రూపము, పురుష రూపము - రెండూ తానే అయినట్టి వ్యూహములోని పురుషుడిని ప్రద్యుమ్నుడని అందురు. ఇతడు ఈ వ్యూహములో సత్వగుణముచేత సృష్టిని రక్షించుచు, పోషించుచు, తన భక్తులకు ఉపకారము చేయగల శక్తి సంపన్నుడై యుండును. పురుషుడే చేయుచున్నట్లు కనబడుచున్నను, శ్రీ శబ్దము యొక్క శ్రీ ఆశ్రయము చేతనే అన్నియు జరుగుచున్నవి గాని, పురుషుడు మాత్రము ఏమీచేయని నిర్గుణుడు అనగా పురుషోత్తముడే.

4. అనిరుద్ధ వ్యూహము : జీవుల కర్మలను నశింపజేయుచు, సకల ప్రాణుల కర్మలను నిర్వర్తింపజేయు పురుషుని వ్యూహము అనిరుద్ధ వ్యూహము. ఈ వ్యూహములోని పురుషుడు అర్చారూపమున భక్తుల పూజలను, అర్చనలను స్వీకరించుచు, భక్తులను అనుగ్రహించుచుండును. అనిరుద్ధమనగా నిరుద్ధమును లేకుండా చేయుట. అందువల్లనే భక్తులకు, భగవంతునికి మధ్య అడ్డుగానున్న వాటిని నిరోధించును. అనగా భగవదైక్యమును అనుగ్రహించును. అందువలన ఈ వ్యూహములో నిజభక్తుల యొక్క కర్మలను నివర్తింపజేయును.

ఈ నాల్గు వ్యూహములు మాయా శక్తి కారణముగా విభిన్నమై యున్నవి. వ్యూహాతీతమైన పురుషుడు త్రిగుణ రహితుడు, అచలము, పరిపూర్ణము, పరాత్పరము. ఒక్క పాద బ్రహ్మ చతుర్య్యూహములుగా నుండి భక్తులను, జ్ఞానులను అనుగ్రహించి, ఉద్ధరించి, మూడు పాదములుగానున్న పరతత్త్వమునకు చేర్చుచుండును. ఈ పరమైన దానినే పరవ్యూహము అందురు. అనగా వ్యూహాతీతము, మాయాత్పరము, నిర్గుణము, పురుషోత్తముడు.


🌹 🌹 🌹 🌹 🌹




No comments:

Post a Comment