🌹 సిద్దేశ్వరయానం - 12 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🌹సిద్దేశ్వరయానం 🌹
Part-12
🏵 కలియుగం 🏵
సిద్ధనాగుడు తన ఆప్తమిత్రునికి జరిగిన సంఘటనలన్నీ తెలియచేశాడు. కొద్దిరోజులలోనే భోగనాధుని నుండి కాశీకి రావలసినదిగా శివనాగునకు మానసిక సందేశం వచ్చింది. తన స్నేహితుడయిన సిద్ధనాగును కలుపుకొని వారణాసికి బయలుదేరాడు. ఇద్దరు మిత్రులూ కాశీకి చేరి గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ప్రణామాలు చేశారు. సిద్ధనాగుడు కూడా రావటం తనకు సంతోషంగా ఉందని ఆ యోగివర్యుడు చెప్పి "త్వరలో ఇక్కడ సిద్ధుల సమావేశం ఏర్పాటు చేయవలసి ఉన్నది. కలియుగ ప్రభావం వల్ల దెబ్బతింటున్న ధర్మాన్ని రక్షించటానికి ప్రపంచంలోని సిద్ధుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దానిని మీ రిద్దరూ నిర్వహించండి" అన్నారు. వారి మాట శిరసావహించి సిద్ధమహాసభ ఏర్పాటు చేయటం ఇతర ద్వీపాల నుండి కూడా సిద్ధులు రావటం జరిగింది. క్రౌంచద్వీపం నుండి ప్రత్యేకంగా కపిలాశ్రమయోగులు మయాసురజాతికి చెందిన కొందరు అరుణయోగులు కూడా ఆ సదస్సుకు వచ్చారు. వేదవ్యాసుని అధ్యక్షతన జరిగిన ఈ సభలో రకరకాల సూచనలు, చర్చలు జరిగినవి. కలియుగంలో జనులు అలసులు, మందబుద్ధులు, జరారోగపీడితులు, అల్పాయుష్కులు కావటం వల్ల తీవ్రమైన తపోయోగ సాధనలు చేయలేరు కనుక భక్తిమార్గాన్ని ప్రోత్సహించాలని హిమాలయ ఋషులు ఎక్కువమంది సూచించారు. వ్యాసమహర్షి దానికి ఆమోద ముద్ర వేయటంతో భక్తిని ప్రధాన సాధనంగాచేయాలని నిర్ణయం జరిగింది.
ఆతరువాత కొద్ది వందల సంవత్సరాలు గడిచిన అనంతరం దక్షిణ భారతంలోని కుర్తాళ క్షేత్రంలో అగస్త్య మహర్షి ఆశ్రమంలో మరొకసారి యోగుల సమావేశం జరిగింది. అక్కడ వివిధ కోణాలలో సాధక బాధకాలను చర్చించి ఋషిశ్రేష్ఠుడైన అగస్త్యుని అధ్యక్షతలో భోగనాధయోగి కొన్ని క్రొత్త ఆలోచనలను తీర్మానరూపంగా ప్రకటించాడు.
1) అపారశక్తి సంపన్నులయిన సిద్ధయోగుల పర్యవేక్షణలో వివిధ ద్వీపాలలో ధర్మాభిరతి ఏరకంగా ఉన్నదో పరిశీలిస్తూ అధర్మం పెచ్చుమీరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యుగధర్మాన్ని బట్టి సిద్ధశరీరాలతో ఇక ముందు సామాన్య మానవులకు కనిపించరాదు. మన శరీర ప్రమాణాలు తేజస్వంతమైన ఈ ఆకృతులు బహిరంగ పరచటానికి వీలుండదు.
2) దీనిని దృష్టిలో ఉంచుకొని కొందరు సిద్ధులు మానవుల శరీరాలలో ప్రవేశించి వారికి తెలియకుండానే వారి మనసులను ప్రభావితం చేసి తమ దివ్యశక్తుల ద్వారా ఆ శరీరముల చేత మహాకార్యములు చేయించాలి. ఆ పనిపూర్తికాగానే వారా శరీరముల నుండి ఇవతలకు వచ్చి తమ స్వస్థానములో స్వస్వరూపములతో ఉండవచ్చు. ఆ ఆవేశం పొందిన మానవుడు ఆ మహాకార్యములను తామే చేశామని అనుకొంటారు. ప్రజలూ అలానే భావిస్తారు. వారి నలానే నమ్మనివ్వండి. మనకు దైవకార్యసిద్ధి ప్రధానం గాని, కీర్తి ప్రధానం కాదు. కొన్ని వేల సంవత్సరాల వరకు ఎప్పుడెప్పుడు ఎవరు ఎవరి శరీరాలలో ప్రవేశించాలో తెలియచేయబడుతుంటుంది. దీనికి సిద్ధులు సహకరించ వలసినదిగా కోరుతున్నాము.
3) ఇక్కడ సమావేశమయిన సిద్ధయోగులలో వివిధ దేవతా సాధనలు చేసి సిద్ధత్వమును పొందిన వారున్నారు. కొందరిలో ఇచ్ఛాశక్తి, కొందరిలో జ్ఞానశక్తి, కొందరిలో క్రియాశక్తి తర తమ భేదాలను బట్టి వికసించి ఉన్నవి. వీరిలో కొందరు మానవులుగా పుట్టవలసి ఉంటుంది. మీరంతా వ్యాసమహర్షి రచించిన పురాణ వాఙ్మయాన్ని చదివినవారే. భారతకాలంలో పూర్వయుగాలలోని రాక్షసులు మానవులుగా పుట్టి అధర్మకార్యాలు చేస్తూ దైవద్రోహం చేస్తూ తమ బలప్రభావం చేత బలహీనులను బాధిస్తుంటే వారిని శిక్షించటం కోసం సాక్షాత్ నారాయణుడే దిగిరావలసి వచ్చినది. ఆయన ఇచ్ఛానుగుణంగా భువర్లోక సువర్లోకములలోని దేవతలు దేవయోనులు విద్యాధర గంధర్వాదులు అసంఖ్యాకంగా జన్మించారు. అవసరమయినప్పుడు తప్పని ప్రక్రియ ఇది. దీనికి కూడా మీరు ఆమోదం తెలుపవలసిదిగా కోరుతున్నాను. అయితే ఒక్క హామీమాత్రం వారికి ఇవ్వవలసి ఉంటుంది. మానవజన్మ ఎత్తినప్పుడు తామెవ్వరో మరచిపోవటం సహజపరిణామం అది ఎవ్వరికీ ఇష్టం ఉండదు. విధి నిర్ణయం కనుక అవి తప్పవు. జన్మ తీసుకోవలసి వచ్చిన వారికి ప్రధమశ్రేణిలో ఉన్న సిద్ధులు సహాయం చేస్తూ ఉండాలి. వారి మనస్సులను ప్రేరేపించి తపోయోగసాధనలు చేయిస్తూ పూర్వజన్మ స్మృతిని వారికి కలిగిస్తూ ధ్యానభూమికలో వారికి అప్పుడప్పుడు కన్పిస్తూ కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ దానికి కావలసిన శక్తిని సమకూరుస్తూ ఉండాలి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment