సిద్దేశ్వరయానం - 13 Siddeshwarayanam - 13

🌹 సిద్దేశ్వరయానం - 13 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🌹సిద్దేశ్వరయానం 🌹

Part-13

🏵 కలియుగం 🏵


సమావేశం ముగిసి ఎవరి దేశాలకు, ప్రదేశాలకు వారు వెళ్ళిపోయినారు. ఆ తరువాత మిగిలిన వారిలో ముగ్గురిని భోగనాధుడు పిలిపించాడు. వారు శివనాగుడు, సిద్ధనాగుడు, రాజనాగుడు. మూడవ వ్యక్తి శివనాగుని కంటె ముందు ఆయన శిష్యుడైనవాడు. వారితో ఆ మహాయోగి ఈ విధంగా చెప్పాడు. "యువకులారా ! ఇష్టదేవతా సాధనలు చేసి ఆ దేవతల అనుగ్రహాన్ని కొంతవరకు సాధించినవారు మీరు. దేవకార్యం సిద్ధించటానికి పరమేశ్వర సంకల్పానుసారం సిద్ధమండలి తలపెట్టిన ప్రణాళికలు అమలుచేయటానికి మీ వంటి వారి సహకారం చాలా అవసరం. సిద్ధఋషులవలె దీర్ఘకాలం జీవిస్తూ ఉండాలన్న మీ కోరిక నాకు తెలుసు. దేవతా సాధనల వల్ల మీకు అజరత్వం వచ్చింది కాని అమరత్వం రాలేదు. మీ రిప్పటికి దాదాపు 1500 సంవత్సరాల నుండి జీవించి యున్నారు. ఈశరీరాలు పతనమయ్యే సమయం సమీపించింది. ఈ విధి నిర్ణయాన్ని తప్పించటానికి ఇప్పటి మీ తపశ్శక్తి చాలదు. కనుక దానికి బద్దులై మీరు మరణించి మళ్ళీ జన్మలెత్తవలసి ఉన్నది. మీ ముగ్గురిలో రాజనాగుడు తపస్సులో అధికుడు. అతడు కొంతకాలం తరువాత ఈ దక్షిణాపధంలో జన్మించి నా శిష్యుడై యోగసాధనలు చేసి కుర్తాళం వచ్చి అగస్త్య మహర్షిని గూర్చి తపస్సుచేసి ఆయన అనుగ్రహం వల్ల సిద్ధుడై దీర్ఘకాలజీవియై మహావతార్బాబా అన్నపేరుతో ప్రసిద్ధిచెంది శ్రీకృష్ణుడు బోధించిన క్రియాయోగ మార్గాన్ని పునరుద్ధరించి సాధకు లెందరికో సహాయం చేసి ఆధ్యాత్మికరంగంలో పురోగమింపచేస్తాడు. ఇక మీ రిద్దరు కొన్ని జన్మలెత్తి ప్రతిజన్మలోను దేవతల భక్తిని నిలుపుకొంటూ సిద్ధులతో అనుబంధాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరించు కొంటూ ముందుకు వెడుతుంటారు.

ఇప్పటికి రెండువేల సంవత్సరాల తరువాత మరొక దేశంలో పుట్టి మన సిద్ధమండలిలోని ఒక యోగీశ్వరునకు శిష్యులవుతారు. ఆ తరువాత 1500 సంవత్సరాలు గడచిన అనంతరం బృందావనధామంలో మళ్ళీ కలుస్తారు. ఆ తరువాత 500 సంవత్సరాలకు మళ్ళీ కలుసుకోవటం జరుగుతుంది. మిగతా విషయాలు అవసరమయినంత వరకు మీకు తెలియచేయబడుతుంటవి. నేనెప్పుడూ మిమ్ము ఒక కంటకనిపెడుతూ ఉంటాను. రాజనాగుడు కూడా మీతో ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉంటాడు. ఈ పరిణామాలకు మీ మనస్సులలో కలుగుతున్న వేదనను నేను గుర్తించగలను. సర్వశక్తి సంపన్నుడయిన పరమేశ్వరుని ఇచ్ఛననుసరించి నడవవలసిన వారలమే మనమంతా కాకపోతే కొంచెం ముందు వెనుకలు, హెచ్చుతగ్గులు, ఈ భేదము, వైవిధ్యము తప్పవు". వారు గురుదేవుని ఈ మాటలు విని నిశ్శబ్దంగా ఆయన పాదములకు ప్రణమిల్లి నిర్దేశించబడిన పధంలో ప్రయాణీకులయినారు.

సిద్ధసంకల్పాన్ని అనుసరించి, గురువుల ఆజ్ఞననుసరించి ముగ్గురు యువకులూ తమ తమ జన్మపరంపరలలోకి వెళ్ళిపోయినారు. కాలాంతరమున రాజనాగుడు మహావతార్ బాబాగా పరిణామం చెందాడు. శివనాగుడు మౌనస్వామి అన్నపేరుతో కుర్తాళంలో సిద్ధేశ్వరీ పీఠాన్ని స్థాపించాడు. సిద్ధనాగుడు తీర్థయాత్రలు చేస్తూ ఉజ్జయినికి వెళ్ళి అక్కడ మహాకాళిని, భైరవుని దర్శించి శివరాత్రి ప్రాణాలు వదిలాడు. భైరవాను గ్రహం వల్ల తరువాత జన్మలో భైరవనాధుడన్న పేరుతో పుట్టి ప్రచండమైన భైరవసాధన చేసి తీవ్రమైన శక్తులు సాధించి వెయ్యేండ్లకు పైగా జీవించి మరణించాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment