సిద్దేశ్వరయానం - 20 Siddeshwarayanam - 20
🌹 సిద్దేశ్వరయానం - 20 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 భైరవనాథుడు 🏵
వాసుకి, ఐరావతుడు, ధృతరాష్ట్రుడు, తక్షకుడు మొదలైన నాగ రాజులు రాక్షసులతో సంగ్రామాలు చేసి నాగజాతిని రక్షించారు. అసురజాతులు, వారిదేశాలు ఉండగా భారతదేశంలో భువర్లోకంలోని రాక్షసులు, పూర్వం ఇక్కడ ఉన్నవారు పునర్జన్మతీసుకొన్నారు. వారిలో చాలామందిని కృష్ణదేవుడు సంహరించాడు. భారత యుద్ధంలో నాశనం చేయించాడు. అయినా వారింకా వస్తూనే ఉన్నారు. వారిలో కొందరు భయంకర తామస సాధనలు చేసి తీవ్రశక్తులు సాధించారు. హిమాలయ పర్వతప్రాంతాలలో ఉత్తర భారతంలోని కొన్ని రాజ్యలలో వారి సంచారం ఎక్కువగా ఉంది.
యువ: గురుదేవా! భూమిమీద అసురజాతులు, మ్లేచ్ఛులు, నాస్తికులు ఉన్నారు. భువర్లోకంలో రాక్షసులున్నారు. వారూ వీరూ ఒకరేనా?
వామ: దీని నేపధ్యం చాలా ఉంది. భూమి జలంనుండి బయటకు వచ్చి సృష్టి ప్రారంభైనప్పుడు ఊర్ధ్వలోకాలలోని దేవతలు, ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతి సౌందర్యానికి పరవశించి నివాసాలు ఏర్పరచుకొన్నారు. దేవికా నదీతీరం వారి ప్రథమ నివాసం. మొదట్లో రాకపోకలెక్కువగా ఉండేవి. భూలోకపు అణువులు వారి శరీరాలలో ప్రవేశించి దివ్య లోక గమనశక్తి పోయింది. అయినా ఆ దేవమానవులంటే దివ్యలోక వాసులకు ఇష్టం. తమ జాతివారు గనుక అవసరమైన సమయంలో వచ్చి సహాయం చేస్తుంటారు. అలానే భువర్లోకవాసులైన విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు భూలోకవాసులైనారు. రాక్షసులు తమ జాతివారిని మానవలోకంలోని వారిని ప్రేరేపించి ధర్మపరులైన దేవజాతి మానవులతో యుద్ధాలు చేయిస్తుంటారు. ఈ లోకమంతా తమ చేతిలో ఉండాలని అందరూ తమ జాతి బానిసలుగా ఉండాలని ప్రపంచంలోని ఐశ్వర్యము అధికారము రాజ్యములు స్త్రీలు తమ వశంలో ఉండాలని కోరే స్వార్ధపరులువారు.
తపస్సులు చేసి తీవ్రసాధనలు చేసి సైన్యములు కూర్చుకొని సర్వదేశాలను ఆక్రమించి ధర్మవినాశనం చేస్తుంటారు. దుర్మార్గులను శిక్షించటానికి అప్పుడప్పుడు మహాదేవతలు అవతరిస్తుంటారు. హిమాలయ సిద్ధాశ్రమంలోని యోగులు దివ్యలోకాలలో ఉండే దేవతల, సిద్ధుల కరుణవల్ల ధర్మరక్షణ కోసం కృషి చేస్తుంటారు. వారు మహర్షులు, యోగీశ్వరుల ప్రణాళిక ననుసరించి అవసరాన్ని బట్టి, జన్మలు తీసుకొంటారు. కొందరు యోగ్యులైన మానవులలో ప్రవేశించి ప్రేరణ నిచ్చి మహాకార్యములు చేయించి కొన్ని శక్తులు ప్రదర్శించి కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంటారు. వారు వెళ్ళిన తర్వాత ఆ మానవులు సామాన్యులవుతారు. దివ్యశక్తులుండవు. కాకుంటే ఒకప్పుడు దేవతలెన్ను కొన్నవారు గనుక ఉత్తమ సంస్కారంతో మిగిలిన జీవిత భాగం గడుపుతారు.
నీవు క్రూరశక్తులు సాధించిన మంత్ర సిద్ధులతో పోరాడవలసి ఉంటుంది. వారు ధనవంతులను రాజులను వశం చేసుకొని తమ మతాలను ప్రచారం చేసుకొని వేదమార్గీయులను తమ మతంలోకి మారుస్తారు. కాముకులై స్త్రీలను వశం చేసుకుంటారు. పతివ్రతలను పాడుచేస్తారు. అప్రతిహతమైన వారి మంత్రశక్తి ముందు ఎవరూ నిలవలేరు. దానిని ఎదుర్కోగల మహాశక్తిని నీవు సాధించాలి.
యువ : గురుదేవా ! నేనేం చేయాలో ఎలా చేయాలో ఆదేశించండి!
వామ : నాగభైరవా ! నేను పూర్వయుగంలో ఒక కన్య చేత తీవ్రసాధన చేయించిన పద్ధతి చెపుతాను. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. అతని కుమారుడు బలి. రాక్షసరాజు. అతని కథ భాగవతంలో ఉంది. ప్రసిద్ధమైనది. విరోచనుని కొక కూతురున్నది. అందరూ ఆమెను వైరోచని అనేవారు. చాలా సౌందర్యవతి. విద్యావతి. వినయశీల. ఆమె నా ఆశ్రమానికి వచ్చి పోతూ ఉండేది. ఆమె ఒకరోజు నన్ను ప్రార్ధించింది. "గురువుగారూ! మీరు మహర్షులు. మీ తపశ్శక్తి అసామాన్యమైనది. మా పూర్వుల చరిత్రలు - వారి తపస్సులు జగద్విదితములు, హిరణ్యాక్ష హిరణ్యకశిపుల దేవద్వేషము స్వార్ధము వారిని నాశనము చేసినవి. మా తాతగారు ప్రహ్లాదులవారు మహనీయులు. దేవకార్యంకోసం వైకుంఠవాసి, విష్ణువు అనుచరుడు అయిన శంకుకర్ణుడనే వ్యక్తి జన్మతీసుకొని హిరణ్యకశిపుని తన సాత్వికశక్తితో ఓడించాడని పెద్దలు చెప్పగా విన్నాను. మా తండ్రి మహావీరుడు. ఆయనను యుద్ధంలో గెలువలేక ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచిస్తే తన ప్రాణములనే దానం చేసిన మహానీయుడతడు.
నాకు అందరివలె పెండ్లి చేసుకొని పిల్లలను కని జీవితం గడపాలని లేదు. తపస్సు చేసి దివ్యత్వాన్ని సాధించాలని ఉంది. మా ముత్తాతల వలె ఘోర సాధన చేయలేను. సులభపద్ధతి అడగను. కానీ శీఘ్రంగా ఇష్టసిద్ధిని పొందే మార్గం ఉపదేశించమని ప్రార్థిస్తున్నాను. "నేను కొంత సేపు ఆలోచించి మా ఆశ్రమం ఏ కొండ క్రింద ఉన్నదో ఆ కొండమీది గుహలోకి ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళాను.
అది నా గుహ. దానిలోనికి ఎవరికీ ప్రవేశం లేదు. మొదటిసారి ఈమెకు అనుమతి ఇచ్చాను. ఆ గుహలో లోపలికి పోతే ఒక విగ్రహం భయంకరంగా ఉంది. అది ఛిన్నమస్తా విగ్రహం. ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో నరకబడిన తనతల రతిమన్మధాసనం మీద నిలబడిన దిగంబర, ముక్తకేశ, కపాల మాలాధర - అటు ఇటు చెలకత్తెలు వర్ణిని, డాకిని. కంఠంలో నుండి ఎగజిమ్మే మూడు రక్తధారలు మధ్య ధార తన శిరస్సుతో తానే పానం చేస్తున్నది. మిగతా రెండు రక్తధారలను చెలికత్తెలు త్రాగుతున్నారు. "అమ్మా! యీ దేవత ఛిన్నమస్త - వజ్రవైరోచని ఈమెను హిరణ్యాక్షుడుపాసించాడు. సాక్షాత్కారించిన ఆ దేవతను అమరత్వం ఇమ్మని ప్రార్థించాడు. అది తప్ప ఇంకేదైనా కోరుకోమన్నది దేవత. అతడు "అమ్మా! నీవు తప్ప నన్నింకెవడూ చంపగూడదు" అన్నాడు. ఆమె దానికి తథాస్తు అన్నది. మళ్ళీ “నీవు కూడా నన్ను చంపకూడదు" అన్నాడు. దానికి కూడా తథాస్తు అన్నది. వరగర్వంతో అతడు దుష్కార్యములు చేశాడు. వజ్రేశ్వరి శిరస్సు మీది కిరీటం మీద వరాహ చిహ్నం ఉంటుంది. అందువల్ల ఆమెను వజ్రవారాహి అన్నారు. వరాహముఖిగా కూడా కొందరు దర్శించారు. ఆ దేవత పురుష రూపంలో శ్వేత వరాహమూర్తియై హిరణ్యాక్షుని సంహరించింది. ఆమె యొక్క పురుష రూపం గనుక ఆమె చంపినట్లే. అయితే ఆమె స్త్రీగా చంపలేదు గనుక చంపినట్లూ కాదు. అలా అతని కథ ముగిసింది. ఆ దేవతను నేనుపాసించాను. బలులులేవు. పంచాగ్ని మధ్యంలోనో కంఠదఘ్నజలంలోనో ఉండి తపస్సు చేయటం లేదు.ఆ దేవత అనుగ్రహించింది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment