సిద్దేశ్వరయానం - 22 Siddeshwarayanam - 22


🌹 సిద్దేశ్వరయానం - 22 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 భైరవనాథుడు 🏵


నాగ భైరవుడు గుహ లోపలికి అడుగు పెట్టగానే అసభ్యదృశ్యాలు కనిపిస్తున్నవి. అరకొరగుడ్డలతో ఉన్న ఒక మధ్యవయస్కుడు అతని ఒడిలో అర్ధనగ్నస్త్రీ. ఇద్దరూ మద్యం తాగుతున్నారు. ఎదురుగా మద్యపాత్రలు, మాంసఖండములు ఉన్నవి. ఇతడు లోపలికి ప్రవేశించగానే చూచి అతడు కోపంతో ఊగిపోయాడు. “మూర్ఖుడా! బుద్ధిలేదా? కామాసక్తులమై ఒంటరిగా ఉన్న స్త్రీ పురుషుల దగ్గరకు రాకూడదని తెలియదా? వెళ్ళిపో. వెంటనే బయటకువెళ్ళు అని అరిచాడు.

యువకుడు "నమోదత్త ! నమోదత్త! అయ్యా! ఇది దత్తాత్రేయస్వామి గుహ అని విని ఆ మహాత్ముని దర్శనానికి వచ్చాను. మీరెవరో నన్ను కోప్పడుతున్నారు. తప్పైతే మన్నించండి" అని చేతులు జోడించాడు. అతడు "తప్పా! తప్పున్నరా ! ఇది ఎవరి గుహ అనేది నాకు తెలియదు. ప్రక్కనే ఉన్న గ్రామం మాది. మేం కామం తీర్చుకోవటానికి చూస్తుంటే ఈ గుహ కనిపించింది. ఆ దత్తుడెవడో మాకు తెలియదు. చెప్పానుగా ఇంక మరుక్షణం వెళ్ళిపో" అని మళ్ళీ కేకలు పెట్టాడు.

యువకునకు ఏం చేయాలో తోచలేదు. వస్తానన్న గురువుగారింకా రాలేదు. మారుమాట్లాడకుండా నిలబడ్డాడు. ఆ కోపిష్టి మనిషి "నీకు సిగ్గులేదా? మెడ బట్టి బయటకు గెంటాలా? ఏం చేస్తానో చూడు. అని ఎదురుగా ఉన్న కల్లుముంత పట్టుకొని యువకుని మోహం మీదికి విసిరేశాడు. ఆ దెబ్బకు మొహంమీద ముంతపగిలి గాయమై నెత్తురు కారటం మొదలు పెట్టింది. కల్లు శరీరమంతా పడింది. అయినా అతడు కదలలేదు. విక్రియ చెందలేదు. ఇంతలో వామదేవమహర్షి వచ్చాడు. "దత్తస్వామీ ! ఈ పిల్లవాణ్ణి పరీక్షిస్తున్నారా! అనుగ్రహించండి" అని చేతులు జోడించాడు. క్షణంలో దృశ్యం మారిపోయింది. మద్యపాత్రలు లేవు. మాంస ఖండములు లేవు. అర్ధ నగ్నకామిని లేదు. జటాజూటధారి దండకమండలు సమన్వితుడు అయిన దత్తాత్రేయస్వామి సాక్షాత్కరించాడు. “మంచి కుర్రాడినే పట్టుకొచ్చావయ్యా! అనుకున్నది. సాధించటానికి పనికి వస్తాడు" అన్నాడు.

యువకుడు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని శిరస్సు మీద చేయిపెట్టి ఆశీర్వదించాడు.. వామదేవుడు "దత్తప్రభూ ! దేవకార్యం కోసం ఇతనిని శక్తిమంతుణ్ణి చేయటానికి మీరు సంకల్పించాలి. జగన్నాథుడైన కృష్ణ భగవానుడు భౌతికశరీరాన్ని విడిచిన తర్వాత ఆయనను ఎదిరించలేని శత్రువులు కృష్ణధామాన్ని, భారతభూమిని విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీకు తెలియనిదేదీ లేదు. మీ దీవెనలతో ఈ మహాకార్యం సిద్ధించాలి. హస్తమస్తక సంయోగం చేసి ఇతనిలోకి శక్తిపాతం చేశారు. చాలా సంతోషం కలిగింది. మరొక ప్రార్ధన. వృషభానుపుత్రిక కృష్ణప్రియ రాధాదేవి ఇక్కడ నూరు సంవత్సరములు తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి ఉపరాధయై బృందావనేశ్వరి కృష్ణారాధ్య, కృష్ణపత్ని అయిన రాధాదేవి సేవలోకి వెళ్ళిందని విన్నాను. ఆమె శరీర అవశేషాల మీద మీరు సువర్ణ రాధా విగ్రహాన్ని నిర్మించారని సిద్ధాశ్రమ యోగులు చెప్పారు. రేపు భాద్రపద శుద్ధ అష్టమి - రావల్ గ్రామంలో ఆమె అవతరించిన రోజు గదా! మీరు దయతో ఆమె దర్శనం చేయించాలి. ఈ పిల్లవాడు కూడా మనతో రావటానికి అనుమతించండి!

దత్రాత్రేయులవారు అంగీకరించారు. మరునాడు ఆ దేవిని దర్శించి దత్తస్వామి దగ్గర సెలవు తీసుకొని వామదేవ ఋషి నాగభైరవునితో బయలుదేరి కైలాస పర్వత ప్రాంతంలోను, మానస సరస్సు దగ్గర ఉన్న కొందరు శతసహస్ర వర్ష మహర్షుల ఆశీస్సులిప్పించి హిమవత్ పర్వతశ్రేణులలో కొంతదూరం వెళ్ళారు. త్రోవలో ఒక కోయపల్లె కనిపించింది. కొండ క్రింద అడవి. అక్కడ ఈ గ్రామం. వామదేవ మహర్షికి ఆ ప్రదేశాలన్నీ సుపరిచితములైనవి. వీరా ఊరు చేరగానే ఆ గ్రామస్థులు భక్తితో స్వాగతం చెప్పి వసతి, భోజనాదులు ఏర్పాటు చేశారు. ఆ ఊరిలో రేణుకాదేవి ఆలయమున్నది. ఆ గుడిలో ఆ దేవి శబరకాంతగా భాసిస్తున్నది. అక్కడకు వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకొన్నారు. మహర్షి ఆ ఎల్లమ్మ తల్లిని స్తుతించాడు.

శ్లో గుంజాఫలాకల్పిత చారుహారా శీర్షిశిఖండం శిఖినోవహంతీ ధనుశ్చబాణాన్ దధతీకరాభ్యాం సా రేణుకావల్కల భృత్ విచింత్యా

మెడలో గురివెంద గింజల దండ, తల మీద నెమలి పింఛము చేతులలో విల్లంబులు ధరించిన రేణుకాదేవికి నమస్కరిస్తున్నాను.

సీ వందనంబిందిరావరుగన్నతల్లికి దండంబు ఫణిరాజ మండనకును అంజలి సోమ సూర్యానలనేత్రకు అభివందనము జగదంబికకును మొగుపు చేతులు దేవముని సిద్ధసేవ్యకు నమితంబు గిరిరాజ నందనకును జోహారు రమణీయ శోభనాకారకు జమదగ్ని గారాబు సతికి శరణు

అంటూ పారవశ్యంతో 'సురశిరశ్చరణ రేణుకా జగదధీశ్వరీ జయతి రేణుకా అని గీతాగానం చేశాడు.

నాగభైరవుడు ఆశ్చర్యంతో చూస్తూ ఆ ప్రస్తుతి పూర్తియై మహర్షి పూజ చేసిన తరువాత ఆ దేవత గురించి తానెప్పుడూ వినలేదని ఆమె మహత్వాన్ని గురించి తెలియ జేయమని అభ్యర్థించాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment