🌹 సిద్దేశ్వరయానం - 41 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 5వ శతాబ్దం నుండి 🏵
హరసిద్ధుడు భార్యను తీసుకొని తల్లిదండ్రుల యింటికి వెళ్ళాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. భైరవుని గూర్చి తపస్సు చేసి వరములు పొందిన అంశము వరకు మర్యాదా యుతంగా చెప్పాడు. వార్త అందుకొని రాజపరివారం - మంత్రి పురోహితులు వచ్చారు. ఇప్పుడిక దాపరికం లేదు. వైభవోపేతంగా రాజధానికి తీసుకు వెళ్ళారు. పెద్ద ఊరేగింపు. రాజలాంఛనాలు. స్వాగత సత్కారాలు. ఈ విషయమంతా వార్తాహరుల ద్వారా రాక్షసరాజుకు తెలిసింది. నాగరాజు తమ కుమార్తెను ఎవరో బ్రాహ్మణునకు ఇచ్చి పెండ్లి చేశాడన్న వార్త వాళ్ళు భరించలేకపోయినారు. తీవ్రమైన అవమానంగా భావించి, సైన్యమును సిద్ధంచేసి నాగభూమి మీదకు దండయాత్ర చేశారు. ఈ విషయం ముందే ఊహించిన ఐరావతుడు సరిహద్దులలో తమ సైన్యములను మోహరించి ఉంచాడు.
యుద్ధభేరి మ్రోగింది. రాక్షస సైన్యాలకు, నాగసైన్యాలకు మధ్య తీవ్ర సంగ్రామం మొదలైంది. పగలంతా సరిసమానంగా రణం మారణం జరిగినవి. అయితే ఆ రోజు రాత్రి రాక్షసులు నిశాచరులని నిరూపించుకొన్నారు. మాయా యుద్ధం చేశారు. నాగసైన్యాలమీద పాషాణవర్షం కురిసింది. పిడుగులు పడినవి. మాంసం ముద్దలు, రక్తవర్షం, నిప్పులు రణరంగం బీభత్స భయానక దృశ్యాలతో నిండిపోయింది. నాగసైన్యానికి చాలా నష్టం జరిగింది. అల్లుని దగ్గరకు ఐరావతుడు బయలుదేరాడు. మంత్రి సేనాపతులు వెంట వచ్చారు. సిద్ధభైరవుడు విషయం విని వీరవేషంతో సిద్ధంగా ఉన్నాడు. హిరణ్మయి వచ్చి వీరతిలకం దిద్దింది.
రతిరాజసుందరా ! రణరంగధీర కమల బాంధవతేజ ! కరుణాలవాల సూర్యుని సమముగా శోభిల్లగలవు కృష్ణుని సమముగా కీర్తి పెంపొందు కామాఖ్య కాళిక - కాలభైరవుడు వరముల నీయగా వర్ధిల్లగలవు.
జయవీరనాగేంద్ర శౌర్యకాసార ! జయవైరి దుస్తంత్ర చయచూరకార! జయసిద్ధఖైరవా ! జయమహావీర! జయనాగకులరక్ష! జయధర్మదీక్ష!
ప్రధాన సైన్యంతో ఐరావత చక్రవర్తి కూడా స్వయంగా బయలుదేరాడు. వాయువేగంతో యుద్ధభూమికి చేరుకొన్నారు. సార్వభౌముని రాకతో సైన్యం ఉత్సాహంతో ముందుకు దూకింది. నాగసేన అగ్రభాగానికి సిద్ధభైరవుడు చేరుకొన్నాడు. అతని కోసం సిద్ధమైయున్న రథంలో విల్లంబులు వందల కొద్ది కత్తులు, శూలములు వాటిని అందించే భటులు - రథమెక్కి ఉన్న సిద్ధభైరవుని చేతి నుండి శూలములు కత్తులు మహావేగంతో వెళ్ళి రాక్షసభటులను సంహరిస్తున్నవి. అంతటితో ఆగక రథం నుండి క్రిందకు దూకి ఖడ్గంతో శత్రువధ చేస్తున్నాడు. అతని ఖడ్గచాలన నైపుణ్యం ముందు ఎవరూ నిలువలేక పోతున్నారు. వేలమంది రాక్షసులు హతులైనారు. ఆ ఉద్ధతికి దైత్యులు భయపడి వెనక్కు తగ్గారు.
యుద్ధరంగం వెనుక ఒక యజ్ఞశాల ఉంది. అక్కడ రాక్షస మాంత్రికులు రక్తమాంసములతో హోమం చేస్తున్నారు. వారు ప్రయోగించిన మాయాశక్తి వల్ల రణరంగమంతా చీకట్లు కమ్ముకున్నది. పిశాచములు బయలుదేరి నాగసైనికులను కొరికి తింటున్నవి. సిద్ధవీరుడు వెంటనే ఒక మండే కాగడా తీసుకొని అగ్నిమంత్రంతో అభిమంత్రించి చీకటిలో విసిరాడు. మహాగ్ని బయలుదేరి చీకట్లను చీల్చి రాక్షస సైన్యాన్ని తగులబెట్టటం మొదలుపెట్టింది. మాంత్రికులు శాంబరీమంత్రంతో వర్షం కురిపించి తమ సైన్యాన్ని రక్షించుకొన్నారు. ఇలా అస్త్ర ప్రత్యస్త్రములతో పోరు జరిగింది. ఈ బ్రాహ్మణ్ణి ఏమీ చేయలేమని తెలుసుకొన్నారు. తమ స్తంభన విద్యలు పని చేయటం లేదు. ప్రయోగాలు శక్తిహీనములైనవి. చివరకు అందరూ కలిసి అగ్నికుండములో మహాకృత్యను ఆవాహనం చేశారు.
ఖట్ఫట్ జహి మహాకృత్యే ! విధూమాగ్ని సమప్రభే హన శత్రూన్ త్రిశూలేన క్రుద్ధాస్యే పిఐశోణితం
ఉగ్రకృత్య మాంత్రిక ప్రేరణతో సిద్ధ భైరవుని మీదకు వస్తున్నది. డాకిని యిచ్చిన ప్రత్యంగిరావిద్య స్ఫురించినది.
యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రహ్మాణాపనిర్ణుద్మః ప్రత్యక్కర్తారమృచ్ఛతు
అని చేతికలంకరింపబడిన సింహకంకణం తీసి కృత్య మీదకు విసిరాడు అది సింహముఖంతో వెళ్ళి కృత్యను మింగివేసి ప్రయోగించిన ప్రధాన మాంత్రికుని శిరస్సును కొరికివేసింది. మిగతా మాంత్రికులు భయభ్రాంతులైనారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment