సిద్దేశ్వరయానం - 46 Siddeshwarayanam - 46


🌹 సిద్దేశ్వరయానం - 46 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శ్రీశైలము: 1257 సం||– 🏵


యోగి కదిలి వెళ్ళాడు. యువకుడు బయటకు వచ్చాడు. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు - అభిజిల్లగ్నం.

ఆ యువకుడు సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి గుహలోకి వచ్చాడు. జపం మొదలుపెడుతున్నాడు గనుక ఆహారం తీసుకోకుండా గురుస్మరణ చేసి నమస్కరించి ప్రారంభిస్తున్నాడు. ఇంతకు తనకు మంత్రమిచ్చిన గురునామమేమిటి? ఆయన చెప్పలేదు. సిధ్ధగురు దేవాయనమః అని కండ్లుమూసుకొన్నాడు. మనస్సులో నీలాచల యోగి అని పేరు స్ఫురిస్తున్నది. ఇదివరకు లేని స్ఫురణ బయలుదేరింది. మంత్రం ఉచ్చరిస్తున్నాడు. ఎవరూ ఇతర మానవులు లేరు గనుక పైకి పలుకుతున్నాడు. కొంత సేపటికి అలసట వచ్చింది. పెదవులు మాత్రం కదిలిస్తూ మంత్రం అంటున్నాడు. కాసేపటికి అదికూడా ఆగిపోయింది. మనసులో మంత్రం తిరుగుతున్నది. వాచికము, ఉపాంశువు దాటి మానసిక జపం జరుగుతున్నది. సంధ్యా సమయం దాకా ఇలా సాధన చేసి బయటకు వచ్చి చెట్టుపండ్లు కోసుకొని ఆకలి తీర్చుకొన్నాడు. రాత్రి నిద్రవచ్చినదాక జపం, తరువాత పడుకోటం, మధ్యలో మెలకువ వచ్చినప్పుడు మళ్ళీ కూచోటం జపంచేయటం, మళ్ళీ నిద్ర వస్తే శయనం, ప్రొద్దుననే స్నానపానాదులు, పునః జపం.

ఆహారం, నిద్ర జపం. ఇవి తప్ప వేరే ఏమీ కార్యక్రమం లేదు. అటువైపు ఎవరూ మనుష్యులు రాలేదు. క్రూరజంతువులు కూడా రాలేదు. బహుశా యోగి శక్తివల్ల ఇక్కడకు ఏ జంతువూ రాలేదేమో? ఏదైతేనేం? తనకెందుకు? తన తపస్సుకు ఏ విఘ్నము లేదు. తపస్సు అనుకుంటున్నాడు గాని తనది తపస్సా? తానేమి ఉపవాసాలు చేస్తున్నాడా? పంచాగ్ని మధ్యంలోనో, కంఠ దఘ్న జలంలోనో, నిల్చున్నాడా? తనను బతికించిన యోగి అవేమీ చెప్పలేదు. జపం మాత్రం చేయమన్నాడు. తను జపం చేసినంత మాత్రాన దేవత వస్తుందా? ఆ యోగి వస్తుందన్నాడు. గనుక వస్తుంది. ఆయన మాటవల్ల వచ్చేప్పుడు తాను జపం చేయటం దేనికి? కాని ఆ ఋషి జపం చేయమన్నాడు. కనుక తనకు తెలియని ప్రయోజనమేదో ఉన్నది. చెప్పినది చేయటం తన కర్తవ్యం.

ఇలా ఆలోచిస్తూనే జపం చేస్తున్నాడు. స్నానపానాలకు ఆహారానికి లేవాలికదా? సమయం ఎలా తెలుస్తుంది? జపమాల ఉంటే కండ్లు మధ్యమధ్యలో తెరుస్తూ ఎన్ని మాలలైనవో చూసుకొంటూ చేస్తే తెలుస్తుంది. ఆ గుహలో వెదికితే జపమాల ఉన్నది. తనకోసమే యోగి అక్కడ ఉంచాడేమో? మొత్తం మీద రోజులు గడుస్తున్నవి. ఇరవై రోజులు గడిచిన తరువాత కంటిముందు ఏవో వెలుగులు కనబడుతున్నవి. ఇంకా గడుస్తున్న కొద్దీ ఎవరో తనముందు కదలుతున్నట్లు అనిపించింది. లీలగా ఎవరో స్త్రీ దగ్గరకు వస్తున్నట్లు భాసించింది. మంత్రం చైతన్యవంతమై ఏదో మార్పు వస్తున్నది.

ఇలా రకరకాల అనుభవాలతో 40 రోజులు గడిచినవి. నలభై ఒకటవరోజు ఉదయం స్నానం చేసి మళ్ళీ కొంతసేవు జపం చేశాడు. దేవత వచ్చినట్లు మధ్యమధ్యలో అనిపించటం తప్ప పూర్ణ సాక్షాత్కారం కాలేదు. అంటే మంత్రం సిద్ధించలేదా? సిద్ధి తన సాధన మీద ఆధారపడి ఉన్నదా? తానెప్పుడూ అలా అనుకోలేదు. సిద్ధగురువు చేయమంటే చేశాడు. ఆయన కృప - ఆయన సంకల్పం. తాను దీనిని గురించి అలోచించవలసిన పనిలేదు. ఆలోచించి చేసేదికూడా ఏమీ లేదు. మధ్యాహ్నం ఆహారం తీసుకున్నానని అనిపించాడు. విశ్రాంతి. గాఢంగా నిద్రపట్టింది. సంధ్యాసమయం అయింది. లేచి ముఖ ప్రక్షాళనాదులు చేసుకొని గురుని దేవతను స్మరిస్తున్నాడు. ఇంతలో ఏదో అలికిడి అయింది. ఎవరో స్త్రీ నడిచి వస్తున్నది. మధ్యవయస్కురాలు, కళగలముఖం. ఎవరైతేనేమి? తానున్న చోటికి వచ్చింది గనుక అతిథి. ఆహ్వానించి ఆసీనురాలు కావలసిందన్నాడు. అక్కడ కూచోటానికి కుర్చీలున్నవా? ఒక పెద్ద బండరాయి చూపిస్తే ఆమె కూచున్నది. ఇతడింకో రాతిమీద కూర్చున్నాడు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment