సిద్దేశ్వరయానం - 61 Siddeshwarayanam - 61


🌹 సిద్దేశ్వరయానం - 61 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


కాళీయోగి: సాధనలో ఒక్క రోజుకూడా వ్యర్థం కారాదు. ప్రతిరోజూ సాధకులకు విలువైనదే. ఈ రోజురాత్రి మొదటి ఝూము గడచిన తరువాత నీకు కాళీ మంత్రాన్ని ఉపదేశించటం జరుగుతుంది. అయితే కాళీసాధన మూడు పద్ధతులు 1. దక్షిణాచారము 2. వామాచారము 3. కౌళము. ఆ మార్గాల గురించి నీవు కొంత విని ఉండవచ్చు. వైదిక ఆచార పద్ధతిలో చేసేది దక్షిణ మార్గము. పంచ మకారాలతో చేసేది వామ మార్గము. పగలు దక్షిణా చారము, రాత్రి వామాచారము చేస్తే కౌళము. ఇవి కాక సమయాచార సిద్దాంత మార్గములు మొదలైనవి ఉన్నవి. నీ అభిరుచిని అనుసరించి సాధన పద్ధతులు అవలంబించవచ్చును.

యోగేశ్వరి: అయ్యా! నాకు ఇన్నిమార్గములు ఆచారములు తెలుసుకొన వలసిన కోరికలేదు. నాకున్నదొకటే మార్గము. అది గురుమార్గము. గురువైన మీరే నాకు సర్వస్వం. నన్ను నేను మనసా, వాచా, కర్మణా సర్వార్పణం చేసుకొంటున్నాను. నన్ను ఎలా తీర్చిదిద్దుతారో మీ ఇష్టం. మీ చేతుల లోని బంకమట్టి బొమ్మను నేను. అని ఆయన పాదములపై వ్రాలింది.

అనంతరం అయిదు సంవత్సరాల పాటు అవిచ్చిన్నంగా అమె చేత బహు విధములైన సాధనలు చేయించాడు కాళీయోగి, సాధన సమయంలో అప్పుడప్పుడు గ్రామీణులు వచ్చి ఆహారాది పదార్థాలు ఇచ్చివెళ్ళేవారు. అయితే తనకు ఆశ్చర్యము కలిగించిన కొన్ని సంఘటనలున్నవి. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక పర్వదినాలలో అద్భుత సౌందర్యవతులైన స్త్రీలు కొందరు వచ్చి రెండు మూడు రోజులుండి వెళ్ళేవారు. అంటే తనవంటి శిష్యురాండ్రు మరికొందరు కూడా కాళీ యోగికి ఉన్నారన్నమాట. వారు కూడా తీవ్రసాధనలు చేసిన వారేనా? ఏమో తెలియదు. వారిని గురించి తాను స్వామివారిని అడుగలేదు. వారు చెప్పలేదు. బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా వర్షపంచకము గడిచింది.

ఒకనాడు కాళీయోగి ఆమెను పిలిచి కాళీ సన్నిధిలో ఆమెను కూర్చోమని ఇలా అన్నాడు. "యోగేశ్వరీ! ప్రధానమైన సాధనలన్నీ నీ చేత చేయించాను. అపురూపమైన కొన్ని శక్తులు నీకు లభించాయి. వాని వల్ల ప్రపంచానికి ఉపకారం చేయగల కొంతశక్తి నీకు వచ్చింది. నేనీ శరీరాన్ని విడిచి పెట్టవలసిన సమయమాసన్నమైంది. కాళీదేవి ఈ శరీరానికి ఇచ్చిన ఆయువు పూర్తయింది. అయితే, నేను మోక్షానికి వెళ్ళటంలేదు. పరమేశ్వరి ఆజ్ఞను అనుసరించి ఎక్కడ ఎప్పుడు, ఎంతకాలం ఉండవలసివస్తే అంతకాలం ఉంటాను. నీ కర్తవ్యం విను. ఇక్కడ ఏకాకిగా నీ వుండలేవు" అని అంటుండగా యోగేశ్వరి ఆయన వియోగాన్ని ఊహించలేక దుఃఖంతో కంటివెంట అశ్రువులు జాలువారుతుండగా కాళ్ళుపట్టుకొని "స్వామీ! మీరు వెళ్ళవద్దు. మీరులేక నేను జీవించలేను. నేను కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తాను" అని పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది.

కాళీయోగి ఆమెను ఓదార్చి “యోగినీ! దేవీ భక్తులకు కన్నీళ్ళు తగవు. శోకాన్ని ఆపుకో. చెప్పేది జాగ్రత్తగా విను. చావుపుట్టుకలు సర్వప్రాణి సహజములు. పరమేశ్వరి చేతిలో అందరము ఉపకరణాలము, నీవలన లోకానికి కొంత మేలు చేకూరవలసి యున్నది కనుకనే జగన్మాత నిన్ను నాదగ్గరకు తీసుకు వచ్చింది.

అయితే నీలో పరిపూర్ణసిద్ధి వికసించటానికి అయిదుసంవత్సరాలు చాలలేదు. నాకా, ప్రస్తుతం సమయం పూర్తయింది. నేను కొద్దిసేపటిలో కాళీదేవి ముందున్న హోమకుండంలో కూర్చుండి ఇచ్ఛాపూర్వకముగా దహన మవుతాను. నా శరీర చితాభస్మాన్ని నీవుధరించు. ఎప్పుడూ నీకు నేను అండగా ఉంటాను. నా భస్మాన్ని ధరించిన క్షణం నుండి నీవు 'భైరవి' వి. బ్రాహ్మణకాంతవు గనుక 'భైరవీ-బ్రాహ్మణి' అనవచ్చు. ఆపేరే భవిష్యత్లో నిలిచిపోతుంది. నేను దహనమయిన కాసేపటికి ఒక వృద్ధబ్రాహ్మణుడు పొట్టిగా బంగారు రంగుతో ఉన్నవాడు వస్తాడు. ఆయనతో పాటు సన్నగా, పొడవుగా, నల్లగా ఉండే ఆయన కుమారుడు కూడా వస్తాడు. వాళ్ళకు ఆతిధ్య మర్యాదలు ఇచ్చి సత్కారములు చెయ్యి. ఒక నెలరోజులపాటు ఇక్కడ ఉండి ఈ కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించు. ఆ తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment