సిద్దేశ్వరయానం - 62 Siddeshwarayanam - 62


🌹 సిద్దేశ్వరయానం - 62 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


కాళీ యోగి : కాళీమందిర బాధ్యతను ఆ పెద్దాయనకు అప్పగించిన తరువాత నీవు తిరిగి బృందావనం వెళ్ళు. అక్కడ మీఅమ్మ ఇంకా జీవించి ఉన్నది. వృద్ధాప్యంలో ఉన్న ఆమె బ్రతికున్నంత కాలమూ సేవచేయి. ఆ పవిత్ర ధామంలో రాధాకృష్ణులను నిరంతరం సేవించు. అక్కడకు వెళ్ళిన తరువాత రాధామంత్రాన్ని నీవు జపించవలసి ఉంటుంది. నీవు నేను మరికొందరు గోలోకానికి చెందినవారము. రసదేవత అయిన రాధాదేవి సంకల్పమువల్లనే మన జన్మపరంపర కొనసాగుత్నుది. ఆమె యొక్క మరొక రూపమే కాళీ. అక్కడ నీ చెల్లెలు పెరిగి పెద్దదయి ఇప్పటికే కృష్ణ భక్తిని హృదయంలో నింపుకొన్నది. మధురభక్తి మార్గంలో ఆమె జీవితం తరిస్తుంది. కృష్ణుడు తనను విడిచిపోతాడేమో అన్న భయంతో తాను పూజించే కృష్ణవిగ్రహాన్ని ఎప్పుడూ కొంగుకు ముడివేసుకు ఉంచుకుంది. కృష్ణుడు తప్ప మరొక ప్రపంచం ఆ అమ్మాయికి ఉండదు.

నీ కాళీభక్తిక సాధనలు ఆ అమ్మాయికి నచ్చవు. ఈ ప్రపంచంలో ఎవరిమార్గం వారిది. అయిదేండ్ల తరువాత నీ వక్కడికి వెళ్ళినా నిన్ను ఎవరూ ఏమీ అనరు. మీ తల్లికి సేవచేసి మాతృఋణం తీర్చుకొన్న తరువాత కాశీకి వెళ్ళు. అక్కడ త్రైలింగస్వామిని దర్శనం చేసుకో. ఆ మహానుభావుడు నాకు పరమాప్తుడు. ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడ కొన్నాళ్ళు తపస్సు చేయి. క్షేత్రపాలకుడయిన కాలభైరవుడు కాళీసహితుడై అక్కడ ఉన్నాడు. వారి అనుగ్రహం నీకు లభిస్తుంది. అనంతరం కొంతకాలము తీర్ధయాత్రలు చేయి. కొందరు సాధకులకు నీవలన ఉపకారము జరుగవలసి ఉన్నది. కాళీదేవి అనుగ్రహం కోసం సాధన చేస్తున్నటువంటి యువకులు కొందరికి నీ మార్గదర్శనము, సహాయము అవసరమవుతుంది. వారెవరన్నది దివ్వ చక్షువు వికసించటంవల్ల నీవు తెలుసుకోగలుగుతావు. వారిలో చివరివాడు కలకత్తాలోని దక్షిణేశ్వర మందిర పూజారి 'గదాధరుడు' అన్న యువకుడు. అతని చేత తాంత్రిక సాధనలు చేయించు. ఆ తరువాత నన్ను మళ్ళీ కలుసుకో గలుగుతావు. ఇప్పుడు నీ వయస్సు 21వ సంవత్సరము నడుస్తున్నది. దాదాపు 45 సంవత్సరముల తరువాత నన్ను మళ్ళీ చూడగలుగుతావు”.

యోగేశ్వరి: స్వామీ! నా కప్పటికి షుమారు 70సం॥ సమీపిస్తుంటవి. వృద్ధత్వంలో ఉండే నేను మిమ్ము గుర్తుపట్టటం ఎలా? మీరు దివ్యశరీరంతో ఉంటారా లేక మానవ శరీరంలో ఉంటారా?.

యోగి: ఈ శరీరాన్ని వదలిన తరువాత పది సంవత్సరాలు ఊర్ధ్వ భూమికలలో ఉంటాను. కాళీదేవి పరివారంలో ఉండి మళ్ళీ ఆమె ఆజ్ఞవల్ల దక్షిణ దేశంలో పుట్టి ఒక ఆంధ్ర కుటుంబంలో పెరిగి పెద్దవాడనయిన తరువాత దక్షిణా పధమంతా సంచరించి మళ్ళీ ఈ కాళీ దేవి దగ్గరకు వస్తాను. అప్పటికి ఇక్కడ ఇంతకుముందు చెప్పిన వృద్ధుడు, యువకుడు కాళీదేవిని సేవిస్తూ ఉంటారు. ఆ వృద్ధుడు కూడా సామాన్యుడు కాడు. కేవల భక్తిచేత తీవ్రసాధనలు లేకుండానే దీర్ఘాయువు సాధించిన వాడు. అతని కుమారుడు మాత్రం తీవ్రసాధనలు చేస్తాడు. ఆ వివరాలు ప్రస్తుతం నీకు అక్కరలేదు. నీవు మాత్రం ఎప్పుడు బుద్ధిపుడితే అప్పుడు ఇక్కడకు వచ్చి ఎన్నాళ్ళుండాలనిపిస్తే అన్నాళ్ళు ఉండవచ్చు.

నీవు చేసిన తాంత్రిక సాధనలవల్ల ఆకాశగమన శక్తిరాలేదుకాని, అలసట లేకుండా ఎంతదూరమైన వేగంగా నడచి పోగలశక్తి వచ్చింది. అలానే ముసలితనం గురించి ప్రస్తావించావు. నిన్ను వృద్ధురాలిగా చూడటం నాకు ఇష్టములేదు ఈ శరీరములో నీవున్నంతకాలం ఇప్పుడున్నట్లుగానే ఉంటావు. ముసలి తనం నిన్ను సమీపించదు. ఇది నేను ప్రత్యేకంగా నీకిస్తున్న వరం. ఇక నా అగ్నిప్రవేశ సమయమాసన్నమయింది.

యోగేశ్వరి: మహాత్మా! బృందావనంలో నన్ను రాధామంత్రం చేయమన్నారు. నేను మిమ్ము తప్ప మరెవరినీ గురువుగా స్వీకరించలేను. దయతో నాకు రాదామంత్రాన్ని ఉపదేశించండి.

యోగి: ఇప్పుడు సమయం చాలదు. నీవు బృందావనం వెళ్ళిన తరువాత భాద్రపద శుద్ధ అష్టమినాడు రాధాజయంతి వస్తుంది. ఆ రాత్రి నన్ను స్మరించు, నిద్రించు. నేను స్వయంగా వచ్చి నీకు మంత్రోపదేశం చేస్తాను. నీకు శుభమగునుగాక!.

యోగేశ్వరి: గురుదేవా! మీ శిష్యురాలిని, దాసురాలిని, మీ రెప్పుడూ నన్ను కనిపెట్టి ఉండండి. భవిష్యత్లో నేను మిమ్ము గుర్తించ లేకపోవచ్చు. యోగీశ్వరులైన మీరే నన్నుగుర్తించి దగ్గరకు తీసుకోవాలి. నా అభ్యర్ధనను అనుగ్రహించండి.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment