🌹 సిద్దేశ్వరయానం - 67 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి - 1 🏵
శ్రీనాధుడు కంచిలో ఉండగా ఒకనాడు అవచి తిప్పయ్యశెట్టి కబురుచేశాడు. ఆ రోజుల్లో అతనిని మించిన వ్యాపారవేత్త లేడు. దేశవిదేశాలలో ఖండ ఖండాంతరాలలో ప్రసిద్ధి చెందిన వణిక్ ప్రముఖుడు. కవులను పండితులను ఎందరినో పోషించాడు. 'ధర్మద్రావిడ' అన్న బిరుదము ఆయనకుండేది. పాండ్య మహారాజు అతనితో కందుక క్రీడ చేసేవాడంటే అతనిస్థాయి ఊహించవచ్చు. కొండవీడు ప్రభువైన 'కుమారగిరిరెడ్డి' ఆందోళికా ఛత్రచామర తురంగాది రాజ చిహ్నములను బహుకరించాడు. అతనికి పెద్ద ఆస్థానమంటపం ఉండేది. దానిలో మాణిక్య సింహాసనాసీనుడై పరిచారికలు వింజామరలు వీస్తుండగా వేదపండితులాశీ ర్వదిస్తుండగా కొలువుతీరి ఒక మహారాజులాగా ప్రకాశించేవాడు.
అతనిని శ్రీనాధుడు 'త్రిపురారి యక్షరాజు' అని వర్ణించడం గమనించదగిన అంశం. యక్షరాజు అంటె 'కుబేరుడు'. శ్రీనాధకవీ! నాసంగతి నీకు తెలుసు. విశుద్ధమైన సంతానమును కన్నాను. ఎన్నో పురాణాలను విన్నాను.బహువత్సరములు సుఖముగా మన్నాను. సుకవికోటి నుతింపగా యశోధనము కొన్నాను.నా తల్లితండ్రుల ఉభయ గోత్రముల వారు శైవ, వైష్ణవ సమయదీక్షా విశేష మానసులు, నా వరకు చిన్నప్పటి నుండి మహేశ్వరాచారపరత అబ్బింది.
శ్లో॥ మహేశ్వరే వా జగతా మధీశ్వరే జనార్దనేవా జగదంత రాత్మని న వస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తి స్తరుణేందు శేఖరే
నీవు ఆగమ జ్ఞాననిధివి. తత్త్వార్ధఖనివి. బహుపురాణవేత్తవు. బుద్ధిశాలివి. విశేషించినాకు బాలసఖుడవు. నాకు అంకితంగా ఒకశైవ ప్రబంధాన్ని రచించవలసినది'అని తిప్పయ్యశెట్టి అన్నాడు.
శ్రీనాధ : మిత్రమణీ ! మీరు ఇలా అడగడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు.
తిప్పయ్య: ఆశ్చర్యంగా ఉన్నది. నీవు ఎలా ఊహించగలిగావు?
శ్రీనాధ : మన ఊరిలోకి మహనీయుడైన కాళీసిద్ధుడు ఒకరు వచ్చారు. ఆయనను దర్శించాను. హిమాలయాలలో తపస్సు చేసి సిద్ధశక్తులు సంపాదించిన మహనీయుడతడు. ఆయన కోసం కాళీదేవి ప్రాణసహితమైన విగ్రహంగా అవతరించింది. ఆ విగ్రహాన్ని గూడా చూశాను. నాకు సంబంధించిన భూతకాల, వర్తమాన, భవిష్యద్విశేషాలను ఎన్నింటినో చెప్పాడు. నాతో జన్మాంతర బంధమున్నదని, అందుచేత అవ్యాజమైన అభిమానము నాయందు చూపించాడు. ఈ రోజు ఒక శుభకార్యానికి అంకురారోపణ జరుగుతుందని తెలియచేశాడు. ఆయన చెప్పిన విధంగానే జరిగింది.
తిప్పయ్యశెట్టి: అంతటి మహానుభావుడయితే నేను కూడా తప్పకుండా దర్శనం చేసుకొంటాను. వారిని మన ఆస్థానానికి ఆహ్వానిద్దాము.
శ్రీనాధ : అలా కాదు, వారున్నచోటికి వెళ్ళిదర్శనం చేసుకోవడమే ఉచితం.
తిప్పయ్యశెట్టి: అలా అయితే ఈ రోజు సాయంకాలం నన్ను అక్కడకు తీసుకొని వెళ్ళు. ఇద్దరం కలిసి వెళదాం.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment