🌹 సిద్దేశ్వరయానం - 68 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 అపర కుబేరుడు తిప్పయ శెట్టి 🏵
తిప్పయ్య శెట్టి, శ్రీనాధ కవి ఆరోజు సాయంకాలం ఇద్దరూ కలిసి ఏకామ్రనాధుని ఆలయం దగ్గర ఒక ధర్మశాలలో విడిది చేసిన కాళీ సిద్ధుని దగ్గరకు ఇద్దరూ వెళ్ళారు. శ్రీనాథుడు ముందు లోపలికి వెళ్ళి కాళీసిద్ధునకు అవచితిప్పయ్యశెట్టి గురించి చెప్పాడు. "స్వామివారు ! ఈ కంచిలో అవచివారి కుటుంబం వ్యాపారరంగంలో సుప్రసిద్ధులు. వివేకనిరంజన రామనాధ యోగీశ్వరుని పాదసేవకుడయిన అవచిదేవయ్యశెట్టికి ముగ్గురు కుమారులు. వారు ద్వీపాంతరములతో ఎగుమతి దిగుమతులు చేసి అపార సంపదనార్జించినవారు. ఆ సంపదలకేమి గాని నిరంతర మహేశ్వరభక్తి పరాయణులు. ఎన్ని వందల వేలమంది వచ్చినా నిరంతరం పంచ భక్ష్య పరమాన్నములతో సమారాధనలు చేస్తుంటారు. దానధర్మములలో వారిని మించిన వారు లేరు. కొండవీటి ప్రభువైన కుమారగిరిరెడ్డి చేసే వసంతోత్సవాలను మొత్తం ఖర్చుపెట్టి వీరే నిర్వహిస్తుంటారు.
సీ|| పంజార కర్పూర పాదపంబులు తెచ్చె జలనోంగి బంగారు మొలక దెచ్చె సింహళంబున గంధ సింధురంబులు దెచ్చె హురుమంజిమలు తేజిహరులు దెచ్చె గోవసంశుద్ధ సంకుమద ద్రవము తెచ్చె యాంప గట్టాణి ముత్యాలు దెచ్చె భోట గస్తూరికాపుటంకములు దెచ్చె జీని చీనాంబర శ్రేణి దెచ్చె
తే॥ జగదగోపాలరాయ వేశ్యాభుజంగ పల్లవాదిత్య భూదాన పరశురామ కొమరగిరిరాజ దేవేంద్రు కూర్మిహితుడు జాణ జగజెట్టి దేవయచామిశెట్టి.
అటువంటి ఆ సోదరత్రయంలో అగ్రజుడైన తిప్పయశెట్టి శైవ ప్రబంధ మొకటి రచించి తన కంకితమీయమని తాంబూలం ఇచ్చాడు. నిన్న మీరు చెప్పింది అక్షరాలా నిజమయింది. ఆ తిప్పయశెట్టి మీ దర్శనానికి వచ్చాడు. మీ రనుమతిస్తే వారిని లోపలికి తీసుకువస్తాను” అన్నాడు. కాళీసిద్ధుడు అంగీకార సూచనగా తల ఊపాడు. తిప్పయశెట్టి లోపలకు వచ్చి విలువైన బంగారునాణెములు సుగంధ ద్రవ్యములు పాదకానుకగా సమర్పించి 'ఆశీర్వదించమ'ని ప్రార్థించాడు.
కాళీసిద్ధుడు అతనిని చూచి ఇలా పలికాడు" తిప్పయశెట్టీ ! నీ కులగురువైన రామనాధ యోగీశ్వరులు నాకు బాగా ఆప్తుడు. పిల్లలమట్టి మహాప్రధాని పెద్దన్న బుధేంద్రుని దగ్గర శైవమార్గ సంపన్నతను పొందిన యోగ్యుడవు. ఇవ్వాళ ఈ దేశంలో అందరూ నిన్ను అపరకుబేరునిగా భావిస్తున్నారు. త్రిపురాంతక దేవుని సేవించడం వల్ల మీ వంశం శుభములతో వర్థిల్లుతున్నది. శ్రీమద్దక్షిణ కాశికాపుర మహాశ్రీ కాళహస్తీశ్వర ప్రేమాత్మోద్భవ కాలభైరవ కృపావర్ధితైశ్వర్యుడవు. కాలభైరవుని కృప నీయందు బాగా ఉన్నది. నీవు పూర్వజన్మలో కాశీలో చాలాకాలము ఉన్నావు. విశ్వేశ్వరుని గుడి ప్రక్కనే ఉన్న కుబేరేశ్వరాలయం దగ్గర నీ వసతి. రోజూ ఆ కుబేరేశ్వరుని సేవించేవాడవు. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కాశీక్షేత్రపాలకు డయిన కాలభైరవ ఆలయానికి ప్రతిరోజు హారతి సమయానికి వెళ్ళేవాడవు. ఒక సిద్ధగురుడు నీకు కాలభైరవ మంత్రాన్ని ఉపదేశించాడు. నిష్ఠతో ఆ మంత్రజపం చేశావు. కాలభైరవుని అనుగ్రహము, కుబేరేశ్వరుని అనుగ్రహము నీకు లభించినవి. వాటి ఫలితంగా ఈ జన్మలో అనన్యమైన శివభక్తి కాళహస్తి లోని కాలభైరవ అనుగ్రహము, కుబేరుని కరుణ అనుగ్రహంతో నీవీ స్థితికి ఎదిగావు. ఇలా వేదధర్మరక్షకుడవై, కవిపోషకుడవై, దానధర్మములతో శివార్చనలతో జీవితాన్ని చరితార్థం చేసుకో. నిన్ను శ్రీనాధుడు 'త్రిపురారి యక్షరాజు' అన్నాడు గదా !
తిప్పయ్యశెట్టి : అవును స్వామి, ఆపద ప్రయోగం శ్రీనాధుని నోట నేను ప్రొద్దుననే విన్నాను. మీరు ఇలా చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment