సిద్దేశ్వరయానం - 72 Siddeshwarayanam - 72


🌹 సిద్దేశ్వరయానం - 72 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 1864 - సాధకయోగి 🏵


పరమాత్మస్వామి దక్షిణ భారతంలో సంచారం చేస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరుకొన్నాడు. దానికి చతురగిరి అని పేరు. ఆ కొండమీద సిద్ధులుంటారని ప్రసిద్ధి. అక్కడ మార్గమధ్యంలో ఒక ఆశ్రమం దగ్గరకు చేరగానే అక్కడ నివసించేవారు ఆహ్వానించి, ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించారు. ఆ కాలంలో బాటసారులెవరైనా ప్రయాణం చేస్తుంటే ఆపి ఆహారాదులిచ్చేవారు. దానివల్ల పుణ్యం సంపాదించుకోవచ్చునని ఆశ. అందులోను యతులు, తపస్వులు అయితే మరింత సంతృప్తి. ధూర్జటి అనే కవి తన హృదయాన్ని ఈ విధంగా తెలియజేశాడు.

శా॥ ఊరూరన్ జనులెల్ల బిచ్చమిడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానీకము వీధులన్ దొరుకదో శీతామృత స్వచ్ఛవాః

పూరం బేరుల బారదో తపసులన్ బ్రోవంగ నీ వుండవో చేరంబోవుడు లేలరాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!

ఏ ఊరు వెళ్ళినా బిచ్చం పెట్టని చోటు లేదు. ఉండటానికి గుహలున్నవి. వీధులలో వస్త్రాలు దొరకుతవి. ఇంట్లో అవసరం లేనివి, కాస్తమాసినవి, పాతవి అయిన గుడ్డలను వీధి బయట ఒక దండెం కట్టి దానిపై వేసేవారు. త్రోవన పోయేవారు ఇంట్లో వాళ్లను అడగకుండా వాటిని తీసుకెళ్లవచ్చు. అప్పటి సంప్రదాయమది. నదులలో సరస్సులలో నిర్మలమైన నీరు దొరుకుతుంది. ప్రశాంతంగా తపస్సు చేసేవారిని దేవుడు రక్షిస్తాడు. ధనవంతులను, రాజులను ఆశ్రయించ వలసిన పనిలేదు. అప్పటి వారి ఆలోచనలు, జీవనం ఇలా ఉండేవి.

అతిథిని నారాయణునిగా భావించే వారింకా ఉన్నారు. ఇతర దేశాల మతస్థుల ప్రభావం వచ్చినా గ్రామీణ జీవనం చాలా చోట్ల పూర్వ పద్ధతిలో కొనసాగుతున్నది. అలాంటి ప్రదేశంలోని వారి ప్రార్ధన మీద పరమాత్మ స్వామి తమ శిష్యులతో ఆ ఆశ్రమంలో ఆగాడు. ఆతిథ్య స్వీకారాదులు, విశ్రాంతి అయిన తర్వాత సాయంకాల వేళ ఆ ఆశ్రమాధిపతితో సంభాషణ జరిగింది.

ఆశ్రమాధిపతి : స్వామివారూ! మీరెక్కడి నుండి వస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే సామాన్యులుగా అనిపించటం లేదు. మీలో మానవాతీతమైన ఏదో దివ్యశక్తి పని చేస్తున్నట్లు అనిపిస్తున్నది.

పరమాత్మస్వామి : నేను ఆంధ్రుడను. హిమాలయాల నుండి కన్యాకుమారి దాకా దివ్యక్షేత్రాలు దర్శించి అక్కడి దేవతలను సేవిస్తున్నాను. ఇక్కడికి దగ్గరలోని కుర్తాళం సిద్ధక్షేత్రము. అగస్త్య మహర్షి నివసిస్తున్న ప్రదేశమది. అక్కడ కొద్ది రోజులుండి ధరణీపీఠంలోని కుర్తాళ నాధేశ్వరుని సేవించుకొని వస్తున్నాను. మీలోను యోగమార్గానికి చెందిన సాధక లక్షణాలు కనిపిస్తున్నవి. వేదాధ్యయనము, వేదమంత్రములు హోమములు, శౌచపద్ధతులు – వీటితో సంబంధం లేని మార్గంలో మీరు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తున్నది. పట్టుదల వల్ల గురుకృపవల్ల ధ్యానమార్గంలో ముందుకు వెళుతున్నారు. కుండలినీ యోగంలో ఒక దశకు చేరుకొన్నారు. అక్కడ ఆగింది. పురోగమించటానికి త్రోవ తెలియక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మీరున్న స్థితి ఇది.

ఆశ్రమాధిపతి : స్వామీ ! మీరు త్రికాలజ్ఞుల వలె ఉన్నారు. మిమ్ము చూస్తుంటే మీతో మాట్లాడుతుంటే నేను చాలా అదృష్టవంతుడ ననిపిస్తుంది. మీరంటే పూజ్య భావం కలుగుతున్నది. సాధనలో ముందుకు వెళ్ళటానికి సిద్ధశక్తులు సాధించటానికి దయచేసి నాకు మార్గదర్శనం చేయండి.

పరమాత్మస్వామి : నేనిక్కడ నుండి దివ్యక్షేత్రాలు దర్శిస్తూ కాశీ చేరుకొంటాను అక్కడ కొన్నాళ్ళుండి హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతం చేరి అక్కడి సిద్ధాశ్రమ యోగుల సాహచర్యంలో కొన్నాళ్ళుంటాను. అక్కడ నాతో కలసి చదువుకొన్న కౌశికుడనే యోగి ఉన్నాడు. అతనితో కలసి అచటి డాకినీ శ్మశానంలో తారా సాధన కొన్ని సంవత్సరాలు చేశాను. ఆ దేవత అనుగ్రహం నన్ను నడుపుతున్నది. నీకు అతనితో పూర్వజన్మాను బంధం ఉంది. అప్పుడతని అగ్రజుడవు. మీ తండ్రి మరణిస్తే ఇతనిని చిన్న వయస్సులో ఉన్నవానిని పెంచి ప్రేమతో పెద్ద చేశావు. వృద్ధాప్యం వచ్చి మరణించావు. తమిళనాడులో పుట్టి యిలా ఉన్నావు. సుకృతం వల్ల యోగసాధకుడివైనావు. అతడు కఠోరమైన తపస్సు చేసి విద్యున్మయమైన శరీరాన్ని పొంది దీర్ఘాయువుతో ప్రకాశిస్తున్నాడు. దివ్యజ్ఞాని కావటం వల్ల నీయందు ఇప్పటికీ భక్తి గౌరవాలతో ఉన్నాడు. అతని సాహచర్యంలో చేయగలిగినంత తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచి పెట్టి సరిగా వంద సంవత్సరాల తరువాత మళ్ళీ తెలుగుదేశంలో పుట్టగలవు. నీకు యౌవనదశ వచ్చిన తరువాత అజ్ఞానంలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నీ కిచ్చిన మాట ప్రకారం ఖండయోగ మార్గంలో నీ కపాలములోని నాడులను సంచలింప జేసి పూర్వజన్మ స్మృతి కలిగించి తపోమార్గంలో ప్రవేశపెట్టి సిద్ధయోగులతో పరిచయం కలిగిస్తాడు. నీవు పిలిచినప్పుడల్లా తన మిత్రులతో వచ్చి నీవు కోరిన పనులు తన సిద్ధశక్తులతో చేసి పెడుతుంటాడు.


( సశేషం )

No comments:

Post a Comment