సిద్దేశ్వరయానం - 74 Siddeshwarayanam - 74


🌹 సిద్దేశ్వరయానం - 74 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రత్న ప్రభ - 1 🏵


కాంచీపుర కామాక్షీదేవి ఆలయంలో క్రీ.శ.1892 శరదృతువులో దేవీనవరాత్రోత్సవాలు ప్రారంభమైనవి. వైభవోపేతంగా శాస్త్రోక్త విధానంలో పూజలు, హోమాలు మొదలైనవన్నీ జరుగుతున్నవి. కార్యక్రమాలలో భాగంగా సాయంకాలంపూట పండితుల ప్రవచనాలు ఏర్పాటు చేయబడినవి. ఒకరోజు భీషణ సుందరంగా అలంకరించిన కాళీ విగ్రహం సమావేశం జరిగేచోట ఎత్తుగా ఉంచి పూజిస్తున్నారు. రోజుకొక దేవీమూర్తి. ఆరోజు అర్చించబడుతున్న కాళీదేవి దగ్గర ఒకయోగి కూర్చుండి కాళీతత్త్వాన్ని గూర్చి అద్భుతంగా ఉపన్యాసం చెపుతున్నాడు. సదస్యులంతా పరవశించి పోతున్నారు. వారిలో రత్నప్రభ అనే అమ్మాయి ఉంది. కార్యక్రమం అయిన తర్వాత తెలిసిన పెద్దవారిని ఆ యోగిని గూర్చి అడిగింది.

ఆయన ఆంధ్రదేశంలో విజయనగరం నుండి వచ్చాడట. శ్రీపాదవారి వంశంలో ప్రభవించాడు. తల్లిదండ్రులు తీర్ధయాత్రలకు వచ్చినప్పుడు కంచిలోనే పుట్టాడని కొందరు చెపుతున్నారు. ఏదైనా కంచితో వారికి బాగా అనుబంధం ఉంది. తరచుగా అక్కడికి వస్తుంటారు. కాళీమంత్రసిద్ధుడని దివ్యశక్తులు సాధించినవాడని ప్రఖ్యాతి పొందాడు. ఆయన పేరు అక్కడ ఎవరికీ తెలియదు. పరమాత్మస్వామి అని అందరూ పిలుస్తారు.

రత్నప్రభ ఇంటికి వెళ్ళి తల్లికి ఈ విషయాలను చెప్పింది. మర్నాడు ఆమె కూడా వచ్చి వారి ప్రవచనం విన్నది. ఆయన మహానుభావుడనే విశ్వాసం కలిగింది. ఇంట్లో పని వెసులుబాటు కలిగినరోజు వస్తున్నది. కూతురు మాత్రం రోజూ వచ్చి ఆ మహాత్ముని వాక్కుల వల్ల ఎంతో ప్రభావితురాలైంది. నవరాత్రులలో ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు. అన్నింటిలో కాళీదేవిని గూర్చి ఆయన చెప్పినవి ఆ బాలిక నెంతో ఆకర్షించినవి. ఆలయం దగ్గరగా ఉన్న ఒకతోటలోని గృహంలో ఆ మహనీయుని వసతి అని, అక్కడికివెళ్ళి ప్రార్థించిన వారికి ఆయన మంత్రోపదేశం చేస్తున్నాడని విని తానుకూడా కాళీమంత్రోపదేశం పొందాలని భావించి తల్లితో చెప్పింది. తల్లి కాళీదేవి భయంకర దేవత అంటారు. ఏదైనా శాంత సుందరదేవత యొక్క మంత్రం ఉపదేశం తీసుకోరాదా అని అన్నదిగాని కూతురు పట్టుపట్టటంవల్ల కాదనలేక సరే అంది.

మరునాడు ఉదయం వారి నివాసానికి వెళ్ళి సందర్శకులంతా వెళ్ళిపోయిన తర్వాత చివరగా వెళ్లి పాదనమస్కారం చేసింది.

రత్నప్రభ : స్వామీ! నాపేరు రత్నప్రభ. ఇక్కడికి దగ్గరలో మా అమ్మ నేను ఉంటాము. మీ ప్రవచనాలు విన్న తర్వాత కాళీమంత్రసాధన చేయాలని అనిపించింది. నన్ను అనుగ్రహించి నాకు మంత్రం ఉపదేశించండి.

స్వామి : మంత్రం చెపుతాను. నీవు చేతనైనంత జపం చేస్తావు. మంచిదే. అయితే ఏం కోరి ఈ సాధనలోకి ప్రవేశిస్తున్నావు? నీ ధ్యేయ మేమిటి?

రత్న : అయ్యా! మీ మాటలలోని ఆకర్షణవల్ల కాళీదేవి అంటే ఇష్టం కలిగింది. నేను రోజూ కామాక్షీదేవి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి వెళుతుంటాను. ఇప్పుడెందుకో కాళీదేవి అంటే ఇష్టం ఏర్పడింది. ఆమెను చూడాలని, ఆమె ఒడిలో బిడ్డగా ఉండాలని అనిపిస్తున్నది.

స్వామీ : ప్రభా! ఆహారము, నిద్ర వదలి ఎన్నో యేండ్లు అడవులలో లేక మహాక్షేత్రాలలో కోటానుకోట్లు జపం చేస్తేగాని కాళీదర్శనం కాదు. మరి నీవలా చేయగలవా?

రత్న : ఏది చేసైనా అమ్మను చూడాలి. నా కెంతవరకు సాధ్యమో అర్థం కావటం లేదు. మీరు సిద్ధ పురుషులని కాళీదేవి మీతో మాట్లాడుతుందని విన్నాను. మీరు దయదలిస్తే ఈ తపస్సులు, ఈ కఠోర దీక్షలు లేకుండా దర్శనం ఇవ్వగలరు గదా!

స్వామి : ఇవ్వగలగవచ్చు. కానీ ఎందుకు ఇవ్వాలి? నా దగ్గరకు వందలమంది వస్తారు. రకరకాల కోరికలతో వారికి తగిన మంత్రమిచ్చి జపహోమాలు చేయిస్తాను. వారికి కష్టనివారణ అభీష్టసిద్ధి కలుగుతుంది. నీవు వారివలెనే సాధనచెయ్యి. తీవ్రసాధన చేస్తే కొంత అనుగ్రహం కలగవచ్చు. కొన్ని అనుభూతులు రావచ్చు.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment