సిద్దేశ్వరయానం - 106 Siddeshwarayanam - 106

🌹 సిద్దేశ్వరయానం - 106 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵యోగులు - సూక్ష్మశరీరులు - 2 🏵


రసయోగి శ్రీరాధికాప్రసాద్ మహారాజ్ (నాన్నగారు) రాధాదేవి యొక్క అనన్యభక్తుడు. ఏ ఇతర దేవతలనూ పూజించేవాడు కాదు. నా యందు ఎంతో అభిమానము ఉన్నా మా పీఠంలో అవతరించిన కాళీదేవిని చూడటానికి ఎప్పుడూ రాలేదు. ఒకరోజు ఆయన బృందావనం నుంచి వస్తూ ఉంటే కాళీదేవి కన్పించి, ఆయనతో “నాన్నా! నేను రాధాసఖినే కదా! నన్ను చూడటానికి రావా ?" అని అడిగింది. ఆశ్చర్యపోయి గుంటూరురాగానే నేను కాళీదేవిని చూడటానికి వస్తాను" అని వార్త పంపారు. కాళీ మందిరానికి వచ్చి దర్శించిన తరువాత అక్కడ ఏర్పాటు చేసిన భక్తుల సమావేశంలో ప్రసంగిస్తూ “కాళీదేవతలో కూడ వివిధమైన ఆకృతులు ఉన్నవి. రాధాదేవి యొక్క సఖీ మండలంలో ఉన్న శ్యామకాళి, కోమలప్రేమస్వరూపిణి, నా కిక్కడ దర్శన మిస్తున్నది” అన్నారు. ఆయన చెప్పిన విధంగా శ్యామకాళి సుందరదేవత, ప్రసన్న స్వరూపిణి. కలకత్తా ప్రాంతంలో ఉన్న ఒక శ్యామకాళి దేవాలయంలో చాలాకాలం సేవచేసిన భక్తురాలు జన్మ మారి ప్రస్తుతం ఒక మిత్రుడి భార్యగా ఉన్న మహిళ ఆనాటి సమావేశంలో ఉండటం గమనించాను.

చాలా గ్రహణాలకు చీరాల దగ్గర ఉన్న 'వాడరేవు' కు వెళ్ళి అక్కడ సముద్రతీరం దగ్గర కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవాడిని. నాతో పాటు చాలా మంది రావటం గ్రహణ జపం తరువాత అక్కడే హోమములు చేయటం అలవాటైంది. ఒకసారి అక్కడ ధ్యానంలో కాళీదేవి సాక్షాత్కరించి శ్రీశైలం రమ్మని ఆజ్ఞాపించింది. "అక్కడికి ఎందుకు? అని ప్రశ్నించాను” నేను. “అక్కడ ఉన్నది నేనే, వెంటనే రా" అన్నది. శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కొండమీద ఆమె ఇచ్చిన అనుభూతిని ఇలా వర్ణించాను.

చ॥ హరుడు స్వయమ్ముగా శిశువునట్టుల నల్గొని పోయి వత్సలాం తరమున నప్పగింప నను నక్కున జేర్చి పరిస్ఫురత్పయో ధరముల క్షీర ధారలను దన్పిన ప్రేమ సుధావలంబ - శ్రీ గిరి భ్రమరాంబ పాదముల కేను సదా నతులా చరించెదన్.

మల్లికార్జునుడు నన్ను శిశువుగా మార్చి భ్రమరాంబ దగ్గరకు తీసుకు వెళ్ళి ఇడుగో! వీడు మనవాడు అని అందించాడు. ఆమె వాత్సల్యంతో దగ్గరకు తీసుకొని స్తన్యపానం అనుగ్రహించింది. అంతటి దయచూసిన ఆ ప్రేమామృత నిలయమైన శ్రీశైల భ్రమరాంబ పాదములకు వినయపూర్వకంగా వినతులు చేస్తున్నాను.

శ్రీశైలం కారులో వెళ్తుండగా రోడ్డు మీద అడ్డంగా 8 అడుగులు పొడుగున్న పెద్ద నల్లత్రాచు వచ్చింది. కారు ఆపించాను. ఒకసారి తలయెత్తి అనుగ్రహ సూచకంగా చూచి నెమ్మదిగా కదలిపోయింది. అదే సమయంలో ఇదే అనుభూతి గుంటూరులో ఉన్న మా అమ్మాయి డా॥ జయంతికి కలగటం ఆశ్చర్యకరం !

కొద్ది నెలల క్రింద అయోధ్యలో సాధువుల సమ్మేళనం జరిగింది. దాదాపు వెయ్యిమంది సాధువులు, ఇరవై అయిదు వేల మంది ప్రజలు వచ్చారు. దక్షిణాపధం నుండి అక్కడు చేరినవాడను నే నొక్కడనే. 'విశ్వహిందూపరిషత్' ఏర్పాటు చేసిన సమావేశమది. సమ్మేళనానంతరం ప్రధాన కార్యకర్తలు ఆ రోజు రాత్రి ధర్మరక్షణకోసం యజ్ఞం చేయవలసిందిగా నన్ను అభ్యర్థించారు. “యాభై మంది పీఠాధిపతులు, వెయ్యి మంది సాధువులు ఇక్కడకు వచ్చారు. వా రెవ్వరినీ కోరక నన్నే ఎందుకు అడుగు తున్నారు ?” అన్నాను. “మీరు పిలిస్తే దేవతలు వస్తారని మా నమ్మకం" అన్నారు వారు. నేను చిరునవ్వుతో” వస్తారు. నిజమే ! కానీ ఆ సంగతి తెలుసుకోగల వాళ్ళెవరైనా ఉన్నారా ?" అన్నాను" ఉన్నారు. మధ్యప్రదేశ్ నుండి వచ్చిన కార్యకర్తలలో ధ్యానయోగి ఒకరున్నారు. అతడు దేవతల రాకను తెలుసుకోగలడు" అన్నారు. “సరే, సంతోషం అలానే చేద్దాము” అని ఆరోజు రాత్రి పన్నెండు గంటలకు సీతాదేవి పూజించినదని చెప్పబడే దేవకాళీ మందిరంలో అశ్వత్థ వృక్షం క్రింద నా అనుచరులతో కలసి హోమం చేయటం జరిగింది. కొంత సేపు ఆహుతులు వేసిన తరువాత ఆ ప్రదేశం అంతా సుగంధంతో నిండిపోయింది. దేవత హోమకుండంలో అవతరించడాన్ని ఆ ధ్యానయోగి గుర్తించి చెప్పాడు. అద్భుతకాంతిపుంజం మధ్య దేవత నిల్చున్నది అని అతడు చెప్పటం అక్కడి ప్రధాన వ్యక్తులకు సంతృప్తిని కలిగిగించింది. అప్పుడప్పుడు ఇటువంటి సన్నివేశాలు జరిగినవి.


( సశేషం )

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment