సిద్దేశ్వరయానం - 114 Siddeshwarayanam - 114

🌹 సిద్దేశ్వరయానం - 114 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 10 🏵


భారతదేశంలో పుట్టి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఒక తమిళుడు పది పదకొండు యాక్సిడెంట్లకు గురిఅయినాడు. నా రెండవ అమెరికా పర్యటనలో ఒక స్నేహితుడు అతనిని చూపించి ఈ ప్రమాదాల నుంచి రక్షించమని అడిగాడు. అతని ఇంటిలో హోమం చేశాను. అగ్నిగుండంలో విచిత్రమైన దృశ్యం కన్పించింది. అతను పూర్వజన్మలో ఒక రాజుయొక్క రెండవ కొడుకు. రాజ్యం కోసం తండ్రిని అన్నను ఖైదు చేశాడు. ఆ పాప ఫలితంగా ఒక పిశాచం పట్టుకొన్నది. అతనిని బాధించి, బాధించి చంపాలని ఆ పిశాచం యొక్క సంకల్పం దాని బాధ నుండి అతనిని రక్షించాను. ఇటీవలి నా మూడవ అమెరికా యాత్రకు అతడు కారకుడయినాడు. భారతదేశానికి వచ్చినప్పుడల్లా గుంటూరులోను కుర్తాళంలోను మన ఆశ్రమాలలో కొద్ది రోజులు సకుటుంబంగా ఉండి వెడుతుంటాడు

సాహిత్యరంగంలో నేను భువన విజయాది రూపక ప్రదర్శనలు నిర్వహిస్తున్న రోజులలో వారిలో పాల్గొన్న వారిలో ఇద్దరు రచయిత్రులు ఉన్నారు. అందులో ఒకామె పూర్వజన్మలో ముస్లిం జమీందారిణి. ఆమె భవనానికి కొంచెం దూరంలో ఒక హిందూ దేవాలయం ఉండేది. ఆమె రోజూ అక్కడి భజనలు, పాటలు వింటూండేది. ఒకసారి మతకలహాలు జరిగి సాయుధులైన మహమ్మదీయులు దేవాలయం మీదకు దాడిచేశారు. గుడిలో ఉన్న హిందువులు చెల్లాచెదురుగా పరిగెత్తారు. వారిలో కొందరు ఈమె భవనంలో దూరి దాక్కున్నారు. దుండగులు అక్కడకు వచ్చి దాక్కున్న వాళ్ళను బయటకన్నా పంపండి లేదా మేమే లోపలకు వచ్చి వాళ్ళను చంపుతాము అన్నారు. ఆమె అంగీకరించక వారిని కఠినంగా మందలించి వెళ్ళిపొమ్మని చెప్పింది. ఆమె తమ మతానికి చెందిన గౌరవనీయ వ్యక్తి కావటం వల్ల వారు వెనక్కు వెళ్ళిపోయినారు.

ఆమెకు రెండు పుణ్యాలు మిగిలినవి. ఒకటి రోజూ దేవాలయ సంకీర్తనలు విన్న పుణ్యం, రెండవది ఆపదలో ఉన్న వారిని రక్షించిన పుణ్యం. దీనివల్ల ఆమె ఈ జన్మలో హిందువుగా పుట్టింది. సంగీతంలో విద్వాంసురాలయింది. తెలుగులో డాక్టరేటు చేసి ప్రభుత్వ సర్వీసులో చేరి గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేసి ప్రస్తుతం ఒక సంగీత పాఠశాలను నడుపుతున్నది. చేసిన కర్మలు ఫలితాలను వివిధ రీతులుగా ఇస్తుంటవి. అలాగే మరొక రచయిత్రి పూర్వజన్మలో ఒక అమాయకురాలయిన పల్లెటూరి పిల్ల. ప్రతిరోజూ తన గ్రామం నుండి పూలు, పండ్లు తెచ్చి పట్టణంలో అమ్ముకొని వెళ్ళేది. ఆ పట్టణ పరిపాలకుడయిన ఒక మహమ్మదీయ ప్రభువు ఆమెను చూచి వాంఛించాడు. ఆమె అంగీకరించలేదు. కోపంతో ఖైదులో పెట్టించాడు. ఆ ఖైదులోనే ఆమె మరణించింది. ఆమె కారాగారంలో ఉన్నప్పుడు నే నామెకు కొంత సహాయం చేశాను. ఆమె ఈ జన్మలో రచయిత్రి అయి నా సారస్వత పరివారంలో స్థానం పొందింది.

జన్మలు మారినపుడు పురుషులు స్త్రీలు కావచ్చు, స్త్రీలు పురుషులు కావచ్చు, మతములు జాతులు మారవచ్చు. అలా మార్పులు చెందిన వాళ్ళని కూడా చాలా మందిని చూచాను. కాశీలో ఒక మహమ్మదీయుడు ఒక శతాబ్దం క్రింద నా శిష్యుడు. ఈ జన్మలో స్త్రీగా పుట్టి చదువుకొని ఉద్యోగం చేస్తూ నాకు భక్తురాలు కావటం జరిగింది. అయిదు వందల ఏండ్ల క్రిందటి ఒక బౌద్ధయోగిని తెలుగు భూమిలో పుట్టి ఒక హైస్కూలు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసి ఇప్పుడు కుర్తాళం ఆశ్రమంలో తపస్సు చేసుకొంటున్నది. వీళ్ళలో చాలా మంది కాశీ, బృందావనం మొదలైన చోట్లకు తీర్థయాత్రలకు నాతో పాటు రావటం మంత్రోపదేశం పొంది తీవ్ర జప, ధ్యాన సాధనలు చేయటం అలవాటు చేసుకొన్నారు. పూర్వజన్మలో బృందావనంలో నా దగ్గర ఉన్న ఒక యువకుడు ఈ జన్మలో కవి అయి శతావధానియై ఆశుకవితా నిపుణుడై కీర్తి పొంది కాలేజీలో నా విద్యార్థిగా ఉండి ఇటీవల నేను పీఠాధిపతినైన తరువాత నా మీద ఒక శతకమే రచించాడు. ఈ విధంగా చెప్పటం మొదలు పెడితే వీటికోసం వేరే ఒక పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment