సిద్దేశ్వరయానం - 124 Siddeshwarayanam - 124

🌹 సిద్దేశ్వరయానం - 124 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵️ దేవ రహస్యము 🏵️


హిమాలయపర్వతాలు - అచట మానస సరోవరము, కైలాసపర్వతము అక్కడ రహస్యంగా ఉన్న సిద్ధాశ్రమమునకు కొన్ని వేల యేండ్ల నుండి అనుబంధం ఉన్న ప్రదేశాలు కాశీ, కామాఖ్య, బృందావనం, కొన్ని జన్మలలో గాఢమైన సంబంధం ఉన్న ప్రాంతాలు.

అయిదువేల సంవత్సరాల క్రింద అస్సాం దగ్గర నాగభూమిలో ద్వాపరాంతంలో వచ్చిన జన్మ. ఆ జన్మలో కుర్తాళం రావటం ఆప్తుడైన మౌనస్వామితో నాలుగువేల యేండ్ల క్రింద మొదటిసారి. మళ్ళీ యిటీవల కాలంలో ఏర్పడిన సాన్నిహిత్యం. కొండలలో, అడవులలో, క్షేత్రాలలో, నదీతీరాలలో ఆశ్రమాలలో తపస్సాచరించాను. ఈ జన్మలో కూడా నేను పుట్టింది నరసింహస్వామి గుహలో వెలసిన కొండ క్రింది గ్రామమే. (ప్రకాశం జిల్లా - ఏల్చూరు). యాభై యేండ్ల క్రింద నుండి పర్వతాలు - అరణ్యాలు మహనీయులైన యోగుల కోసం అన్వేషణ. ఆ సంచారంతో ప్రాప్తించిన సిద్ధానుగ్రహం. ఇటీవల జరిగిన ఒక అనుభవం ఇక్కడ చెప్పటం జరుగుతున్నది. అయితే స్థలాలు, పేర్లు రహస్యంగా ఉంచవలసిన నియమం ఉంది గనుక కొంతవరకు మాత్రమే యివ్వబడుతున్నది.

ఒకటనాటి అర్థనిశావేళ ధ్యానసమయంలో ఒక మహా పర్వతగుహకు రావలసినదిగా సిద్ధసూచన వచ్చింది. ఆ ప్రదేశానికి చేరాలంటే సులభం కాదు. గ్రామాలు దాటి అడవులలో నుండి వెళ్ళాలి. మరునాడు బయలుదేరాలని అనుకొన్నాను. కాని ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం వచ్చింది.; కదలలేని స్థితి. ఎందుకిలా అయింది? అని. కండ్లుమూసుకొని ధ్యానం చేశాను. ఆశ్చర్యంగా భూతప్రేతములు కొన్ని క్రూరంగా చూస్తూ కనిపిస్తున్నవి. నేను సిద్ధుల గుహకు వెళ్ళకుండా చేయటమే వాటి లక్ష్యంగా తెలిసింది. అసహాయ స్థితిలో భైరవుని ప్రార్థించాను.

అవసరమునకే దేవత ఆదుకొనని సమయములో అసహాయుడనైన నాకు ఆయువు పోసిన దైవము కాశీపుర రక్షకుండు కాళీ ప్రియ నాయకుండు ప్రభువు గురువు నాకన్నియు భైరవుడరుదెంచుగాక!

భైరవుని అవతరణతో పిశాచాలు పలాయనం చిత్తగించినవి. ప్రయాణం మొదలైంది. వివిధ వాహనాలలో గమ్యస్థానానికి కొంత దూరం వరకు వెళ్ళాను. అక్కడ నుండి అరణ్యమార్గం. ఇతరులకు అనుమతి లేదు. జ్వరం, నీరసం, అతికష్టంగా కొండ ఎక్కటం మొదలు పెట్టాను. కాసేపటికి నీరసం తగ్గింది. ఎవరో పైకి తీసుకొని వెళ్తున్నట్లనిపించింది. "చేదుకో మల్లయ్య ! చదుకోవయ్య !" అని శ్రీశైలం ఎక్కలేక అలసివారు ప్రార్థించినట్లు నా ప్రార్ధన మన్నించి పైకి లాగుకొని వెళ్తున్నారు. గాలిలో తేలిపోతున్నానని అనలేను గాని ఇంచుమించు అలా ఉంది.

కుర్తాళం దగ్గర తెన్కాశిలో ఇటువంటిదే ఒక వింత. మొదటనే పెద్ద గోపురం, ప్రవేశికకు గర్భగుడికి మధ్య ఖాళీ స్థళం. సగం దూరం పోయిన దాకా కట్టుకొన్న ధోవతులు గాలికి వెనక్కు వెళ్ళినట్లుంటుంది. పెద్దగాలి యేమీ ఉండదు. సగం దూరం వెళ్ళిన తర్వాత గుడ్డలు ముందుకు వెళ్తుంటవి. మనం నాలుగడుగులు ముందుకు వస్తే భగవంతుడు పది అడుగులు ముందుకు వస్తాడంటారు. నా పరిస్థితి అలాగే అయింది. మొత్తం మీద గుహకు చేరాను. లోపల పెద్ద హోమకుండం. పక్కనే ఆఖ్యపాత్రలు, మనుషులు లేరు. కనుచూపు మేరలో ఎక్కడా నరుల అలికిడి లేదు. ఉన్నట్లుండి గాలిలో నుండి ముగ్గురు ఋషులు కమండలాలు ధరించి ప్రత్యక్షమైనారు. సాష్టాంగ నమస్కారం చేశాను. తమ కమండలువులలోని పవిత్రజలం నాపై చల్లారు. వారు మౌనంగానే ఉన్నారు. ఆ మౌనంలోనే మనోభూమికలో కొన్ని రహస్య విషయాలు తెలియజేశారు. ప్రేమదయార్ద్ర దృక్కులతో ఆశీర్వదించి అదృశ్యమై పోయినారు. అందులో ఒకరుకొన్ని వందల సంవత్సరాల క్రింద నాతో కలిసి డాకినీ శ్మశానంలో సాధన చేసిన యోగి - మైత్రీమధురుడు. ఆ పరమాప్తుడు కఠోర తపస్సు చేసి భౌతిక శరీరస్థితిని అధిగమించి దివ్య సువర్ణ కాంతిమయ దేహాన్ని సాధించాడు. నేను మానవజన్మ ఎత్తవలసి వచ్చిందే అని అతని బాధ. ఆ బాధ అతని కన్నులలో వ్యక్తీకృతమైంది. నందీశ్వరుని అనుగ్రహం వల్ల అగస్త్యుని మిత్రుడైన సుందర నాథుడు తిరుమూలర్ అనే ద్రవిడ యువకుని శరీరంలో ప్రవేశించి సువర్ణ సుందర శరీరం పొందినటులే ఇతడు కూడా పొంది కాలావధులను దాటగలిగినాడు. సిద్ధాశ్రమయోగుల సంకల్పం వల్ల భౌతిక ప్రపంచంలో దేవకార్యం కోసం పంపబడటం వల్ల నాకు చింతలేదు. అయినా నేను తనవలె కావాలని ఆమిత్రుని ఆకాంక్ష. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి నేను తీర్థయాత్రలో ఉండగా ఏకాంతంగా నా దగ్గరకు మేము ఉపాసించిన దేవతను ఆవాహనం చేసి ఆశీర్వదింప జేశాడు. అతనితో పునస్సమాగమం ఎటుదారి తీస్తుందో!

( సశేషం )

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment