కోనసీమ ప్రభల తీర్థం Konaseema Prabhala Theertham



🌹🌴 కోనసీమ ప్రభల తీర్థం : జగ్గన్నతోట ప్రభల తీర్థం విశిష్టత... చరిత్ర ఏం చెప్తోంది?,ఎన్ని ప్రభలు ఉంటాయో తెలుసా? 🌴🌹

ప్రసాద్ భరద్వాజ


🌹🌴 Konaseema Prabhala Theertham: The significance of Jagannathota Prabala Theertham... What does history tell us? Do you know how many palanquins (prabhalu) are there? 🌴🌹

Prasad Bharadwaj


సంక్రాంతి సంబరాల్లో అత్యంత ప్రధానమైనది ప్రభల తీర్థం. భోగి, మకర సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజున ఈ ప్రభల తీర్థం జరుపుకుంటారు. డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 160 ప్రాంతాలలో సంక్రాంతికి ప్రభల జాతర జరుగుతుంది.

అయితే వీటిలో జగ్గన్న తోట ప్రభల తీర్థం అత్యంత గుర్తింపు పొందింది. ఏకంగా జాతీయ స్థాయిలో ఈజగ్గన్నతోట ప్రభల తీర్థం గుర్తింపు తెచ్చుకుంది. ప్రధాని నరేంద్రమోడీ సైతం ఈ ప్రభల తీర్థం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారంటే ఈ జాతర యెుక్క విశిష్టత ఎంతటిదో అర్థమవుతుంది. రిపబ్లిక్ డే పరేడ్‌లో జగ్గన్నతోట ప్రభ ప్రదర్శించారు. తాజాగా జగ్గన్న తోట ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదాను కూటమి ప్రభుత్వం కల్పించింది. అంతేకాదు ఈ ఏడాది ప్రభల తీర్థంకు సంబంధించి అటు ప్రభుత్వం ఇటు సోషల్ మీడియా విపరీతమైన ప్రచారం కల్పించింది. దీంతో ఈసారి అనగా జనవరి 16న జరగబోయే ఈ ప్రభల తీర్థానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


🌾 ప్రభల తీర్థం చరిత్ర 🌾

కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం నిర్వహిస్తారు. ఈ ప్రభల తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున జగ్గన్న తోట ప్రభల జాతర జరుగుతుంది. ఈ ప్రభల తీర్థాన్ని 11 గ్రామాల ప్రజలు కొనసాగిస్తున్నారు. ఈ జగన్నతోట ప్రభల తీర్థం గురించి చరిత్ర ఏం చెప్తుందంట ఈ ప్రాంతంలో గుడి కానీ గోపురం కానీ ఏవీ ఉండవు. అయితే 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కలవాలి అనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. ఈ సమావేశంలో లోకకళ్యాణం గురించి ఏకాదశరుద్రులు చర్చించారని అప్పటి నుంచి ఈ కోనసీమ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని ఇక్కడ ప్రాంత ప్రజల నమ్మకం. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతుందని చరిత్ర చెప్తోంది.


🍀 ప్రభల తయారీ విధానం 🍀

ఏకాదశ రుద్ర ప్రభలు అంబాజీపేట చుట్టుపక్కల 11 గ్రామాల నుంచి తరలివస్తాయి. 11 ప్రభలు 11 స్వాములుగా కొలుస్తారు. ప్రతి గ్రామం నుండి వచ్చే ప్రభకు సోంతగా ప్రభ నిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. సంక్రాంతి 10 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభ తయారీని ప్రారంభిస్తారు. వెదురు కర్రలను అర్ధచంద్రాకారంలో తీసుకువస్తారు.వెదురు బొంగులు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగ కడతారు. ఆ తరువాత వాటి పై రంగు రంగులు వేస్తారు. దీంతో ప్రభకు ఒక రూపు వస్తుంది. రంగు రంగుల వస్త్రాలతో,పూలతో అలంకరిస్తారు. ఇలా అలంకరించిన తర్వాత ప్రభలను జగ్గన్నతోటకు తీసుకు రావాల్సి ఉంటుంది. అయితే ఇలా అలంకరించిన ఒక్కో ప్రభ టన్నుల కొద్ది బరువు ఉంటుంది. అయితే ఒక్కో ప్రభను కనీసం 30 మంది మోయాల్సి ఉంటుంది.


🔱 11 ఏకాదశ రుద్ర ప్రభలు 🔱

గంగలకుర్రు అగ్రహారం నుంచి వీరేశ్వర స్వామి

గంగలకుర్రు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి

వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాగ్రేశ్వర స్వామి.

ఇరుసుమండ నుంచి రామేశ్వర స్వామి

వక్క లంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి

పెదపూడి నుంచి మేన కేశ్వర స్వామి

ముక్కామల నుంచి రాఘ వేశ్వర స్వామి

మొసలిపల్లి నుంచి భోగేశ్వర స్వామి

నేదునూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి

పాలగుమ్మి నుంచి చెన్న మల్లేశ్వర స్వామి

పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాగ్రేశ్వర స్వామి



🌊 కౌశిక నదిని దాటుకుంటూ ప్రభు 🌊

ఈ 11 ఏకాదశ రుద్ర ప్రభలు వేర్వేరు మార్గాలలో వస్తూ ఉంటాయి. కౌశిక నది దాటుకుంటూ, పొలాల మధ్య నుండి ఈ ప్రభలు ఊరేగింపుగా వస్తాయి. ఈ ప్రభలను ఒక్కసారి ఎత్తితే మళ్లీ కిందకు దించకూడదు. కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏ మాత్రం తడవకుండా తీసుకోస్తారు. కౌశిక నది దాటించడానికి 50 మందికి పైగా శిక్షణ పొందిన వారు ఉంటారు. అలా కౌశిక నది దాటించి జగ్గన తోట తీర్థ ప్రదేశానికి తీసుకోస్తారు. తీర్థం పూర్తి అయిన తరువాత వచ్చిన దారినే తిరిగి ప్రభలను ఆయా గ్రామాలకి తీసుకెళతారు.


🌿పంట పొలాల్లో నుంచి ప్రభు 🌿

ఈ ప్రభల తీర్థంలో కౌశిక నదిని దాటిస్తూ ప్రభలను జగ్గన్నతోటకు తీసుకువచ్చే దృశ్యం అందరినీ కట్టిపడేస్తోంది. మరోవైపు పంట పొలాల మీదుగా ప్రభలు తీసుకువెళ్తారు. ప్రభలను తీసుకెళ్లే 50 మందికి పైగా భక్తులు పంటను తొక్కినప్పటికీ రైతులు ఏమాత్రం బాధపడరు. సాక్షాత్తు శివుడు తమ పొలాల నుంచి వెళ్లారని భావిస్తారు.


🌴 కోనసీమ ప్రాంత సంస్కృతికి నిదర్శనం 🌴

ఈ ప్రభల తీర్థాన్ని చూసేందుకు కోనసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. దేశవిదేశాల్లో ఉన్న కోనసీమ ప్రాంతానికి చెందిన వారు ఎక్కడ ఉన్నా ఈ ప్రభల తీర్థాన్ని కనులారా చూసేందుకు తరలివస్తుంటారు.నేటికి కొందరు ఎడ్ల బండ్లలోనే జగ్గన్న తోట తీర్థంకు వస్తుంటారు.వారికి పెద్దపెద్ద కార్లు ఉన్నప్పటికీ ఎడ్లబండలలోనే వస్తుంటారు. ఈ ప్రభల తీర్థం చూస్తే కోనసీమ ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు , భక్తి పారవశ్యం అంతా ఒకే వేదికగా సాక్షాత్కరిస్తుంది.

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment