గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) 29

🌹 *గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌)* 🌹
*29 వ భాగము*
✍ రచన : *పేర్నేటి గంగాధరరావు*

🍃 *చిత్తము ఒక మాయా చక్రము 1* 🍃 

*194. అంతఃకరణ చతుష్టయములో చిత్తము ఒకటి.ఇది జడమైనది. దేహముపై ఆసక్తి, కుటుంబముపై ఆసక్తి, ఆశల చేత ఇది స్థూలత్వమును పొందుచున్నది. సమస్త ఇంద్రియములకు నాయకుడు చిత్తము. మాయా చక్రము యొక్క మాహానాభి (బొడ్డు) యే చిత్తము. ఇది శరీరము యొక్క కేంద్ర భాగము. చిత్తము మానవుని నాభి స్థానము నుండి పనిచేయును. ఇది నిరంతరము పరిభ్రమించుచుండును. విషయాసక్తియే చిత్త వృత్తి.*

*195. జీవికి గల అంతఃకరణ వృత్తియే చిత్తము. సమస్త దుఃఖములకు, సుఖాలకు, చిత్తమే కారణము. దేహము నేను అనెడి చిత్త వృత్తి నశించవలెను. యోగులు చిత్త క్షయానికి సాధన చేస్తుంటారు. దేహము చిత్తముచే చలింపబడుచున్నది.*

*196. అంతఃకరణము, బుద్ధి, మహత్తు, అహంకారము, ప్రాణము, జీవుడు ఇవన్నియూ చిత్తము యొక్క వృత్తి రూపములు.*

*197. చిత్తము ఒక విష వృక్షము. ఇంద్రియ విషయ భోగములు దాని శాఖలు, కొమ్మలు. ధ్యానమునకు చిత్తము యొక్క నిశ్చలత్వము చాలా అవసరము. చిత్తమందు వాసనారహితము కావలెను. ఇది చిత్త వృత్తి నిరోధము వలన జరుగును.*

*198. కర్మానుసారము ఏర్పడిన దేహమె చిత్తము. చిత్తమె జీవుడు. సంసార రాహిత్యమునకు, సంసార బంధనాలకు చిత్తమె కారణము.*

*199. మనస్సు అతి శీఘ్రముగా వివిధ ప్రదేశములు సంచరించి సేకరించిన అనేక ప్రాపంచిక విషయముల సమూహమే చిత్తము. చైతన్యము పై వాసనలు ముద్రించబడితే అతి చిత్తము. చిత్తములో వాసనాక్షయమైతే అది చిత్‌, అనగా పరమాత్మ.*

*200. చిత్తము శుద్ధమైన అనగా విషయములు నశించిన, చైతన్యము నిర్మలమైన స్థితి ఏది కలదో అదే సత్యము. ఈ చిత్తమును విచారణ ద్వారా, పరిశీలన ద్వారా ప్రయత్న పూర్వకముగా శుద్ధము చేయవలెను. సత్కర్మాచరణ, సత్సంగము ద్వారా చిత్త శుద్ధి కలుగును. అపుడు కర్మలు నశించును, తద్వారా బ్రహ్మానుభూతి కలుగును.*
🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

No comments:

Post a Comment