🌹 *వివేక చూడామణి* 🌹
*30 వ భాగము*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
🍃 *కోరికలు, కర్మలు - 3* 🍃
*330. ఎపుడైతే వ్యక్తి ఏ కొంచము బ్రహ్మము నుండి విడిపోయిన, వెంటనే అతడు తాను చేసిన పొరపాటు గమనించి భయానికి లోనవుతాడు.*
*331. ఎవరైతే తాను విశ్వములోని బాహ్య వస్తు విశేషములకు అనుగుణముగా నడుచుకుంటాడో అతడు దుఃఖాలకు ఒకటి తరువాత ఇంకొకటి ఎదుర్కొంటూ, దొంగ తాను చేసిన తప్పుకు భయపడినట్లు, చిక్కుల్లో పడతాడు. ఈ విషయాలు సృతులలోనూ, అనుభవాల ద్వారా గ్రహించగలరు.*
*332. ఎవరైతే ధ్యానవిధానమునకు విధేయులై ఉంటారో వారు మాయకు అతీతులవుతారు. మరియు ఉన్నతమైన ఆత్మోన్నతిని పొందగలరు. అయితే ఎవరైతే అశాశ్వతమైన విశ్వ పదార్థములకు, కోరికలకు లోనవుతారో వారు నాశనం అవుతారు. అందుకు ఉదాహరణగా దొంగతనము చేసినవాడు భయపడుతూ ఉంటే చేయని వాడు నిర్భయముగా సంచరించగలడు.*
*333. సన్యాసులు తాము అసత్య వ్యవహారములలో పాల్గోనరాదు. అలా జరిగిన అతడు బంధనాలలో చిక్కుకొనును. అందువలన అతడు తన మనస్సును ఎల్లప్పుడు నేనే బ్రహ్మాన్నని, అంత బ్రహ్మమేనని భావిస్తూ ఎల్లప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉంటూ, పాపాలకు, దుఃఖాలకు, మాయకు వ్యతిరేఖముగా జీవిస్తాడు. ఎందువలనంటే అవన్ని అతడు ముందే అజ్ఞానములో ఉన్నప్పుడు అనుభవించాడు.*
*334. బాహ్య వస్తు సముధాయముపై ఆధారపడి జీవించిన, వాటి చెడు ఫలితాలు ఇంకా ఇంకా పెరిగిపోతుంటాయి. ఈ విషయాన్ని గ్రహించి బాహ్య వస్తువులపై వ్యామోహమును తొలగించి, స్థిరముగా వ్యక్తి బ్రహ్మమును గూర్చి ధ్యానములో నిమగ్నుడై ఉండవలెను.*
*335. ఎపుడైతే బాహ్య ప్రపంచము మూసి వేయబడుతుందో, మనస్సు ఆనందముతో నిండి ఉంటుంది. ఆ ఆనంద స్థితిలో మనస్సుకు బ్రహ్మానంద స్థితి లేక పరమాత్మ స్థితి అనుభవమవుతుంది. ఎపుడైతే ఖచ్చితముగా అట్టి అనుభవమవుతుందో అపుడు చావు పుట్టుకల గొలుసు తెగిపోతుంది. అందువలన విముక్తికి మొదటి మెట్టు బాహ్య ప్రపంచము వైపు తెరచి ఉన్న తలుపులను మూసివేయుట.*
*336. విద్యావంతడైన వ్యక్తి ఎచ్చట ఉంటే అచ్చట ఆ వ్యక్తి సత్యాసత్యముల విచక్షణా జ్ఞానముతో వేదాలను నమ్మి తన దృష్టిని అతని వైపు మళ్ళించగలుగుతాడు. అదే అత్యున్నతమైన సత్యము. సాధకుడు అట్టి స్థితిని పొందిన తరువాత చిన్న పిల్లల వలె కాక జాగ్రత్తగా అసత్యమైన విశ్వానికి దూరముగా ఉంటాడు. లేనిచో అది అతని పతనానికి కారణమవుతుంది.*
*337. శరీరానికి కట్టుబడి ఉన్న వ్యక్తికి విముక్తి లేదు. అలానే విముక్తి పొందిన వ్యక్తికి శరీరముతో ఏవిధమైన గుర్తింపు ఉండదు. నిద్రించు వ్యక్తి మెలుకవలో ఉండడు. మెలుకవలో ఉన్న వ్యక్తి నిద్రించడు. ఈ రెండు వ్యతిరేక ప్రభావము కలిగి ఉన్నవి.*
*338. ఎవడైతే తన మనస్సుతో తన ఆత్మను తెలుసుకొంటాడో అతడు స్వేచ్ఛను పొందుతాడు. అలా కాక కదులుచున్న, స్థిరముగా ఉన్న వస్తు సముదాయముపై దృష్టిని ఉంచి గమనిస్తుంటాడో, అది అతని పతనము. అందువలన అన్ని మోసాలను అధికమించి వ్యక్తి తన యొక్క ఆత్మిక స్థితిలో స్థిరపడాలి.*
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
No comments:
Post a Comment