🌹 వివేక చూడామణి 🌹
31 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
🍃 ఆత్మ స్థితిని చేరుట 🍃
339. విశ్వమంతా ఒకే ఆత్మ అని తెలుసుకొనుటయే బంధనాల నుండి విముక్తిని పొందుటకు మార్గము. విశ్వాన్ని ఆత్మతో సమానమని గుర్తించుట కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఎవడైతే ఈ వస్తు ప్రపంచాన్ని వదలివేసి ఆత్మను గుర్తిస్తాడో, అందుకు శాశ్వతమైన ఆత్మవైపు స్థిరముగా మరలాలి. అతని కంటే ఉన్నతుడు ఎవడు ఉండడు.
340. ఎవడైతే తాను శరీరముగా భావిస్తారో అతడు ఈ వస్తు ప్రపంచానికి దూరముగా ఉండుట ఎలా సాధ్యమవుతుంది. అతని మనస్సు ఎల్లపుడు ఈ బాహ్య వస్తు సముదాయముపై లగ్నమై ఉంటుంది. తత్‌ఫలితముగా అతడు వాటిని పొందుటకు అనేక కార్యములు కొనసాగిస్తుంటాడు. సాధువు ఈ విధమైన వస్తు సముదాయముపై వ్యామోహము జాగ్రత్తగా గమనిస్తూ వాటికి దూరముగా ఉంటూ అలాంటి పనులను, విధులను, వస్తువులను వదలివేసి, ఉన్నతముగా ఆత్మ యందు నిమగ్నమై ఉంటారు. అపుడే వారికి నిరంతర ఆత్మానందము చేకూరుతుంది.
341. సాధువులు ఎవరైతే తమ గురువుల బోధనలు, సృతులను వింటారో వారు నిశ్చబ్దముగా, శాంతముగా, స్థితప్రజ్ఞతలో ఉంటూ సమాధి స్థితిలో ఉండి పరిపూర్ణానంద స్థితిలో నిమగ్నమై ఉంటారు.
342. జ్ఞానులు సహితము అకస్మాత్తుగా తమ యొక్క అహంకారమును నాశనం చేయలేరు. ఒక పర్యాయము స్థిరముగా బలపడిన తరువాత అడ్డంకులన్ని పూర్తిగా తొలగిపోయి, శాంతిని పొంది, నిర్వికల్ప సమాధి స్థితిలోకి చేరగల్గుతారు. కోరికలే అనంతమైన పుట్టుక, చావులకు కారణమవుతాయి.
343. అంతర్గత శక్తి వ్యక్తమై అది ప్రస్ఫుటమైనప్పడు, అహం యొక్క భావనలు పెంపొంది దాని ప్రభావముతో వ్యక్తిని చెడు మార్గము వైపు మళ్ళించి నేనే అన్నింటికి కారణమను భావన కలిగి పతనమవుతాడు.
344. వ్యక్తమవుతున్న అంతర్గత శక్తిని జయించుట చాలా కష్టము. అట్టి శక్తిని సంమూలముగా నాశనం చేయాలి. అపుడు అది ఆత్మను ఆవరించుట మాని ఖచ్చితముగా మంచి, చెడుల వస్తు వివేకములను గ్రహించి అతన్ని చెడు మార్గము నుండి మారునట్లు చేస్తుంది. అపుడు విజయము ఏమాత్రము అనుమానము లేకుండా లభించి, వస్తు విశేషముల నుండి దృష్టి మరల్చి ఊగిసరాట లేకుండా మనస్సును అసత్యమైన వస్తు సముదాయము నుండి మరల్చుతుంది.
345. ఖచ్చితమైన మంచి, చెడుల విచక్షణ వలన నేరుగా విషయము యొక్క సత్య స్వభావమును గ్రహించగలము. అపుడే బంధాలు తొలగి మాయ వలన ఏర్పడిన భ్రమలు వీడిపోయి మరల ఏ మార్పు లేకుండా, అతడు స్వేచ్ఛను పొందుతాడు.
346. జీవ బ్రహ్మముల ఏకత్వమును తెలిసిన జ్ఞానము వలన పూర్తిగా దట్టమైన అజ్ఞానమనే అడవిని ఛేదించి మాయను గుర్తించగలుగుతాడు. ఎవరైతే రెండింటి ఏకత్వమును తెలుసుకొంటాడో అతనిలోని అజ్ఞానము సమూలముగా తొలగి మార్పులకు లోనుకాకుండా ఉంటాడు.
347. సత్యాన్ని కప్పివేసిన తెర తొలగిపోవాలంటే కేవలము సత్యాన్ని గూర్చిన పూర్తి జ్ఞానము తెలుసుకోవాలి. అపుడు అజ్ఞానము నాశనం అవుతుంది. జ్ఞానము వ్యక్తమవుతుంది. అపుడే దారి తప్పినందువలన కలిగే దుఃఖాలు తొలగిపోతాయి.
348. మనం బంధనాలను గమనించినపుడు అవి తాడు వలె చుట్టుకొని, పెనవేసి, ముడి వేయుట తెలుస్తుంది. అందువలన జ్ఞాని తప్పక గ్రహించాలి, సత్యమైన బాహ్య వస్తు స్వభావమును తాను వాటి బంధనాల నుండి ఎలా బయటపడాలో.
349, 350. ఇనుము అగ్నితో సంబంధము ఏర్పచుకున్నపుడు అది అగ్ని కణాలను విడుదల చేస్తుంది. అలానే బుద్ది సాక్షిని, వస్తువును అందులోని బ్రహ్మము యొక్క వ్యక్తీకరణను గ్రహించినపుడు, తెలుసుకొనేది, తెలుసుకొనబడేది బుద్ది యొక్క ఫలితమని గ్రహించి, అది అసత్యమని, భ్రమ అని, కల అని, అలంకారమని అదే విధముగా అవన్నీ ప్రకృతిలోని మార్పులని మరియు అహంకారము కారణముగా శరీరము మొదలుకొని అన్ని బాహ్య వస్తువులు అసత్యాలని, అవి ఎల్లప్పుడు క్షణ క్షణము మారుతుంటవని గ్రహించాలి. ఆత్మ ఒక్కటియే ఎప్పటికి మారదు.
351. మన యొక్క ఉన్నతమైన ఆత్మ ఎల్లపుడు విడదీయుటకు వీలులేని ఏకైక విజ్ఞానము. రెండవది లేనిది. బుద్ధి దర్శించే వివిధ వస్తు సముదాయాలన్ని స్థూల, సూక్ష్మమైన భావము 'నేను' అనే శాశ్వతమైన అంతర్గత ఆనందాన్ని ఇచ్చే ఉన్నతమైన ఆత్మయే.
352. జ్ఞాని సత్యా సత్యములను విభజించి సత్యాన్ని ఆత్మ అనాత్మల ఏకత్వాన్ని గ్రహించి అంతర్ దృష్టితో సత్యాన్ని గ్రహించి, తన ఆత్మను తెలుసుకొని అది ఉన్నత జ్ఞానమని తనకు ఉన్న అడ్డంకులను తొలగించుకొని నేరుగా శాంతిని పొందును.
🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*
No comments:
Post a Comment