🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 11 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. జ్ఞానాన్ని సాధించాలి అంటే రెండే మార్గాలు. యోగము, ఇంద్రియ జయము. - 2 🌻
అయితే ప్రణాళికాబద్ధమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవనం వుండాలా వద్దా అంటే తప్పక వుండాలి. యమ నియమాలు లేనటువంటి జీవితం ఎప్పటికీ కూడా సాధ్యపడదు.
గృహిణి తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోవలచినటువంటి అవసరం వుందా లేదా? చాలా అవసరం వుంది. ఆ పనిని అనురక్తి లేకుండా చేయవలసిన అవసరం వుంది. వైరాగ్య భావంతో చేస్తే ప్రతిదీ సమర్ధవంతంగా చేయగలిగేటటువంటి శక్తి లభిస్తుంది.
అంతేగాని చిందరవందరగా ఇల్లంతా అన్ని వస్తువులూ పడవేసుకుని వుండి, నేను జ్ఞానంలో వున్నానండీ, నేను వైరాగ్యంలో వున్నానండీ, నాకేం పట్టదండీ అనేటటువంటి విధానం సరియైనటువంటి జీవితం కాదనమాట.
భౌతికంలో సమర్ధవంతంగా సామాన్యమైనటువంటి జీవితాన్ని, విశేషణములు లేనటువంటి జీవితాన్ని, అహం ప్రతిపాదించేటటువంటి- అహం బలపడేటటువంటి జీవితాన్ని జీవించకుండా, వైరాగ్య భావంతో జీవించవలసినటువంటి అవసరం చాలా వున్నదనమాట సాధకులందరికీ కూడా. ఈ వైరాగ్య లక్షణాన్ని మోక్షప్రాప్తి వరకూ నిలబెట్టుకోవాలి. ఈ తరువాత అది సహజమైపోతుంది.
ఇది చాలా ముఖ్యం. జ్ఞానం లభించాలి అంటే తప్పక వైరాగ్య భావన బలవత్తరమైనటువంటిదిగా వుండాలి. అదేకాక, భక్తి విశ్వాసాలు కూడా వైరాగ్యంతో పాటు చాలా ముఖ్యమైనటువంటివి.
ఈ మూడూ కలిసి జ్ఞానానికి అధికారిత్వాన్ని ప్రసాదిస్తాయి. వినయము, విధేయత వస్తాయనమాట భక్తి విశ్వాసాల వలన. అలా ప్రతి ఒక్క మానవుడు తనని తాను ఈ రకమైనటువంటి భోగలాలసత నుంచి విరమింపచేసుకునేటటువంటి పద్ధతిగా జీవనాన్ని సాగించాలి.
సకల జీవరాశి కూడా స్త్రీపురుష సౌఖ్యాన్ని అనుభవిస్తూ వున్నాయి కదా. ఏ కొత్త సుఖమున్నది ఇందులో? అనేక జన్మలయందు తిన్న అన్నమే తినుట లేదా? పోయిన నిద్రే పోవుట లేదా? కొత్త సుఖమేమున్నది? అనేటటువంటి విజ్ఞానదృష్టి కలిగినటువంటివాడికి స్త్రీపురుష కామోపభోగమునందు రతి కలిగేటటువంటి అవకాశమున్నదా? రమించే అవకాశం వున్నదా అంటే లేదు అంటున్నాడు.
కారణమేమిటట? అనేక జన్మార్జితముగా ప్రతి జన్మలోనూ గృహస్థాశ్రమ సౌఖ్యాన్ని, ఆ ఒకరికొకరి సహచర్య సౌఖ్యాన్ని స్త్రీపురుషులు ఇరువురూ కూడా అనుభవిస్తూ వున్నారు. దానివల్ల ఏం పెద్ద ప్రయోజనమున్నదీ? సర్వ జీవులు వాటివాటి సంసార చక్రబంధమునందు నలిగి పోవుచునే వున్నవి కదా! జననమరణ కారణమగుచున్నది కదా.
కాబట్టి అట్టి అనిత్యములైనటువంటి సుఖముల కొరకు ఎవరైనా ఓ వెయ్యేళ్ళు, ఓ పదివేలేళ్ళు, ఓ లక్షేళ్ళు, ఓ కోటి సంత్సరాలు, కల్పాంతము వరకూ జీవించాలని ఎవరైనా అనుకుంటారా? అజ్ఞానం కదా. అనేటటువంటి భావనని తెలియజేస్తున్నారు.
ఇంకేమడుగుతున్నారూ? అసలు ప్రధానమైన సంశయం ఏమిటీ అంటే వివేకవంతమైనటువంటి, బుద్ధి సంఘతమైనటువంటి మానవులకు విచారణా జ్ఞానము వున్నది కదా. అట్టి విచారణా జ్ఞానం చేత అందరికీ కలిగేటటువంటి గొప్ప సంశయం ఏమిటంటే - అసలు మరణానతరం జీవితం వుందా లేదా?
కాబట్టి అటువంటి జీవితాన్ని గురించి మనకి చెప్పగలిగేటటువంటి సమర్ధవంతమైనటువంటి శక్తి ఆచార్యవరుడైనటువంటి యమధర్మరాజుకి మాత్రమే వున్నదని, ఇటువంటి సంశయం దేవతలకి కూడా వున్నప్పటికీ వారు కూడా ఆ సంశయాన్ని తీర్చుకోలేకపోతున్నారని, కాబట్టి ఆత్మ నిర్ణయమునకు సంబంధించినటువంటి విషయం ఏదైతే వుందో, ఆ జ్ఞానం ఏదైతే వుందో దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు.
అంటే ఒకసారి ఈ ఆత్మవిచారణ గనక మీ మనోబుద్ధులని గనక ఆక్రమించినట్లయితే మీరు జగత్తుకు సంబంధించినటువంటి మరే విషయములకూ ప్రాధాన్యత ఇవ్వజాలరు.
కారణమేమిటీ అంటే అన్నిటికంటే ఉత్తమమైన వివేకాన్ని, ఉత్తమమైనటువంటి విషయజ్ఞానాన్ని, ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని ఎంపిక చేసుకుని, నిర్ణయించి, సాధన ద్వారా సిద్ధింపజేసుకుని ప్రయత్నించి అట్టి బ్రహ్మానందపూర్వకమైనటువంటి స్థితిని సాధించేటటువంటి లక్ష్యం దిశగా నీ ప్రయాణం సాగుతూ వున్నప్పుడు, నీవు ఇతరములైనటువంటి, నశ్వరములైనటువంటి, హీనములైనటువంటి, నీచములైనటువంటి, నిషిద్ధములైనటువంటి, నిరసించదగినటువంటి భోగభాగ్యములయందు దృష్టి కలుగదు అనేటటువంటి స్పష్టతని అందిస్తూ వున్నారు.
నేను ఇంక ఏ వరమునూ కోరను, ఒక్క ఆత్మానుభూతికి సంబంధించినటు వంటి బోధ గురించి తప్ప. కాబట్టి ఆత్మ విషయమును గురించే బోధించమని నిర్ణయముగా అడుగుతున్నాడు నచికేతుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment