🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 2 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
మోహత్యాగము ఎవరైతే చేశారో, వారు మాత్రమే ఆత్మవిద్యను పొందగలుగుతారు. ఆత్మవిద్యను తెలుసుకుంటే మోహం పోతుందా? మోహం విడిచిన వాడికి ఆత్మవిద్య వస్తుందా?
చీకటి ఎప్పుడు పోయింది? వెలుతురూ ఎప్పుడు వచ్చింది? వెలుతురు వస్తే చీకటి పోయింది. చీకటి వస్తే వెలుతురు పోయింది. రెండింటిలో ఏది కరెక్టు? చీకటి తనంతట తానుగా పోదు. వెలుతురు వస్తేనే చీకటి పోతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి .
కాబట్టి, మోహం తనంతట తానుగా విడువదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం చేతనే, మోహం నుంచి విడువడుతావు. కాబట్టి, అట్టి ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్న శీలురై ఉండాలి. ఇది లక్ష్యము.
సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను గుర్తించవలెనన్న ఇంద్రియములను బాహ్యవృత్తులనుండి మరలించి, మనస్సును ఏకాగ్రము చేసి విచారణ ద్వారా, ధ్యానము ద్వారా ఆత్మను గుర్తించవలెను. సూక్ష్మము అంటే ఏమిటి? కనిపించనది సూక్ష్మము. కనబడేది అంతా స్థూలము, అంటే ఇంద్రియ గోచరమయ్యేది అంతా. కనబడేది అంతా అంటే అర్థం ఏమిటంటే, ఇంద్రియముల ద్వారా తెలియబడేది అంతా స్థూలమే!
కర్మేంద్రియములు అన్నీ కలిపి ఒకటే మూట. కర్మేంద్రియముల సంఘాతము ఒక మూట, జ్ఞానేంద్రియ సంఘాతము ఒక మూట. ఈ రెండూ కలిపితే ఇంద్రియ సమూహము. ఈ రెండింటి ద్వారా నీకు సంవేదనల రూపంలో తెలియబడుతున్నదంతా స్థూలమే.
మరి సూక్ష్మమనగా ఏమి? ఆహార ప్రాణ మనస్సుల యొక్క సమాహారమైన శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మము. ఇంద్రియాలకు అవతల ఉన్నటువంటి ఆత్మను గ్రహించాలి అంటే, సశక్తమైనటువంటి ఇంద్రియం బుద్ధి ఒక్కటే! మిగిలినవి ఏవీ సశక్తమైనవి కావు.
ఎవరిలో అయితే ఈ బుద్ధి వికాసం పూర్ణంగా వికసిస్తుందో, అది మాత్రమే తన బింబమైనటువంటి చైతన్యమునందు సంయమించడానికి అర్హమైనటువంటి ఇంద్రియము.
సత్వగుణ ప్రధానంగా ఉండేటటువంటి సూక్ష్మబుద్ధి ఎవరికైతే ఉందో, వారు మాత్రమే ఆత్మ విద్యను గ్రహించగలుగుతారు. ఎవరెవరికైతే ఇంద్రియోపలబ్దమైనటువంటి జగద్భావనలయందు ఆసక్తి ఉన్నదో, వారు స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉంటారు.
కాబట్టి, అటువంటి స్థూలగతమైనటువంటి జీవన చక్రాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఆత్మ విద్యను తెలుసుకోవడానికి వీలుకాదు. సూక్ష్మబుద్దే సాధ్యం కానటువంటివారికి, బుద్ధి గ్రాహ్యమతీంద్రియం - అనేటటువంటి స్థితి అసాధ్యం.
కాబట్టి మానవులు మొట్టమొదట ఏ స్థితికి ఎదగాలి? సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితికి ఎదగాలి.
స్థూలగతమైనటువంటి ఇంద్రియోపలబ్ధి చేత పొందేటటువంటి సుఖ దుఃఖ సమావిష్టమైనటువంటి జగత్ సంబంధమైనటువంటి వాటి వెనుక ఆసక్తిని, భోగ్య భావనని నీవు జయించినప్పుడు మాత్రమే, బుద్ధి అంతర్ముఖమై సూక్ష్మస్థితిని పొందుతుందన్నమాట.
కాబట్టి, సాధన ప్రతి ఒక్కరూ ఏ దిశగా చేయాలి? బుద్ధి తన బింబమైనటువంటి చైతన్యము నందు సంయమింప చేసేటటువంటి జ్ఞానపద్ధతిని ఆశ్రయించాలి. అందరూ ధ్యానం ధ్యానం అని అంటూ ఉంటారు. ఏమిటి ధ్యానం అంటే? బుద్ధిని తన మూలమైనటువంటి చైతన్యమందు సంయమింప చేయడమే ధ్యానం అంటే!
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment