కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 21

Image may contain: one or more people, text that says "2A కరోపనిషత్"
🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 21 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 9 🌻

సంసార సుఖమంటే అర్ధం ఏమిటీ అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారూ? స్త్రీ పురుష బాంధవ్యంలో వున్నటువంటి గృహస్థాశ్రమ సౌఖ్యమే సంసారమని అనుకుంటుంటారు. కాని సత్యానికది కాదు.

సమస్త మానవ సంబంధాల మధ్యలో మనస్సుతో కూడుకుని ప్రవర్తించేటటువంటి ఇంద్రియ సంబంధ వ్యవహారమంతా సంసారమే. మనసు పనిచేయడం, రజో గుణ ధర్మంతో ప్రారంభించగానే గుణ ధర్మం ప్రేరేపించబడగానే నీవు సంసారంలో పడతావు.

ఎప్పుడైతే నీవు గుణాతీతంగా వుంటావో వ్యవహారంలో సత్త్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ వాస్తవస్థితిలో నువ్వు గుణాతీతంగా సాక్షిగా నిలబడి వుంటూ ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తావో, మోహాన్ని నిరసిస్తావో, మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో, నిర్మోహత్వాన్ని సాధిస్తావో - దీనికి అందరికీ తెలిసినటువంటి సూత్రం వుంది.

“సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే”.

ఎవరైతే ఈ మోహపాశములతో బంధించబడతారో బాధించబడతారో వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొంటారు. మోహముద్గరం. ఈ భజగోవింద స్తోత్రానికే మోహముద్గరం అనిపేరు.

కాబట్టి ఎవరెవరికైతే ఆ యా సంసారలంపటం బలవత్తరంగా పనిచేస్తుందో ఆ ప్రారబ్దవశాత్తు ఏర్పడుతున్నటువంటి సంఘటనలు అభేద్యమై, అచేద్యమై నీవు స్వాధీనపరచుకోవడానికి సాత్త్వికమైనటువంటి జీవితం జీవించడానికి, గుణాతీతమైనటువంటి సాక్షిత్వంలో నిలబడి ఉండటానికి, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే సాధన. అలా అననుకూల పరిస్థితులు ఏర్పరచడమే ప్రకృతి.

నీలోపల వున్నటువంటి సూక్ష్మశరీరంలో వున్నటువంటి గుణధర్మాలననుసరించే నీ బయట వున్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తారు. వారలా ప్రవర్తించారని వాళ్ళ యెడల నువ్వే రాగద్వేషాలని పొందకూడదు. అలా పొందావనుకో నీలో ఆ గుణధర్మం ఇంకా శేషించిపోతుంది. బలపడిపోతుంది.

కాబట్టి నీ లోపలున్నటువంటి రజో గుణ ధర్మం తమోగుణ సత్త్వగుణ ధర్మాలని ఎత్తి చూపడానికే నీ చుట్టు ప్రక్కల నువ్వు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడ్డాయి. నీ చుట్టుప్రక్కల వున్న ప్రకృతి యొక్క ప్రాధమికమైనటువంటి నియమం, ప్రాధమికమైనటువంటి ధర్మం ఏమిటంటే నీలోపల వున్నటువంటి గుణమాలిన్యాన్ని ఎత్తిచూపుట. దాని పని అదే.

ఏమండీ, నేను ఫలానా ఆశ్రమానికెళ్ళి ఫలానా స్వామీజీని చూసివస్తానండి. ఫలానా తత్త్వప్రవచనం చెప్తారట, వెళ్ళొస్తానండి. కుదరదు. అక్కడికెళ్ళి ఏంచేస్తావు? ఇంట్లోనే వుండు. ఇంట్లో చేసుకోలేవా అదేదో.ఆ కృష్ణ రామ ఏదో ఇంట్లోనే చేసుకో. ఆ నామస్మరణ నీకెందుకు. అక్కడికెళ్ళి ఇప్పుడు చేసేదేముంది. నువ్వు కొత్తగా నేర్చుకునేది ఏముంది.

మమ్మల్నందరినీ విడిచిపెట్టి సన్యాసులలో కలిసిపోతావా. ఈ రకమైనటువంటి పద్ధతులతో నీ చుట్టుప్రక్కలున్న మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయంటే, ఆ రకమైన ప్రతిస్పందనని తెలియజేస్తున్నాయంటే దీనికి కారణం ఏమిటి?

నీ సూక్ష్మ శరీరంలో వున్నటువంటి రాజసిక, తామసిక ధర్మాలు వాళ్ళలో వున్న గుణధర్మాలని ప్రేరేపించి నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించవేమో అనేటటువంటి భయాన్ని వాళ్ళలో కలుగచేసి నీ కర్తవ్యతా విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంలో నీతో వాళ్ళు అలా రియాక్ట్ అవుతున్నారు.

కాబట్టి అటువంటి సాంసారిక బంధమును కలుగజేసేటటువంటి ధర్మమంతా గుణమాలిన్యంతో వుంది కాబట్టి - సంసారమంటే మూడు గుణములే. వేరే ఇంకేం లేదు. మనస్సే. ఇంతకుమించి వేరే ఇంకేమీ లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment