🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 14 🌻
106. ఎందుకంటే గణపతి స్థితుడై ఉన్న మూలాధారమందే దేహాత్మ భావన స్థితి ఉంది. ‘ఈ దేహమందు ఎందుకు ఇలా స్థితి కలిగించాడు’ అంటే; అదిలేకపోతే మనకు జీవనమేలేదు కనుక. పుట్టటానికి, కర్మచేయటానికి, కర్మఫలం అనుభవించటానికి వీటన్నిటికీ; దేహమందు ఆత్మ బుద్ధి లేకపోతే – అభినివేశం లేకపోతే – నేనే దేహమని అనుకోకపోతే – కర్మ ఎలాచేస్తాడు? అనుభవమెలా అనుభవిస్తాడు! కర్మానుభవంజరగాలి.
107. అలాగ లేకపోతే పునఃసృష్టి ఎలాగ? మళ్ళీ సంతానాన్ని ఎందుకు కంటాడు? దేహాన్ని సంరక్షించుకుంటాడా? ఆకలి దప్పికలవుతున్నప్పుడు అన్నం తిని నీళ్ళు తాగుతాడా? చలిగా ఉంటే వెచ్చటి ప్రదేశానికి వెళ్ళి పడుకుంటాడా? వేడిగా ఉంటే చల్లని నీడకు వెళతాడా? అలాంటిది జరగకపోతే, తన జాగ్రత్త తనకు తెలియకపోతే, దహించేటటువంటి అగ్నిలో ప్రవేశించి ఒళ్ళు కాల్చుకోగలడు, దేంట్లోనో మునిగి చావగలడు. దేహాత్మభావన – దేహం యొక్క సంరక్షణకు, స్థితిగతులకు మూలహేతువు.
108. ‘ఈ దేహమందు అవిద్య ఒద్దు. నేను సంసారంలో ప్రవేశించను’ అనేవాడికికూడా, విధాత విధించినటువంటి సంసారం సహజంగా జీవాత్మ యందు ఉంది. స్వస్వరూప జ్ఞానం ఒకప్పుడు ఉంది.
109. అవిద్యను ఆశ్రయించి సృష్టిలో అనేక జన్మలెత్తడం చేత, కర్మయందు జీవుడు ప్రవేశిస్తున్నాడు. అది వద్దని తరువాత నేర్చుకున్నాడు. దాన్ని ముముక్షత్వమని అంటున్నాము, అంటే మోక్షమందు కోరిక. బంధమే బాగుందని అనుకుని చాలాకాలం సుఖదుఃఖాలు అనుభవించి విసిగినప్పుడు, ఈ కర్తవ్యం అతడికి బోధపడుతుంది.
110. శైవవైష్ణవాది భేదదృష్టి ఏదయితే ఉన్నదో, అది మనిషికి సహజం. ఈ సృష్టిలో అది తొలగిపోయేందుకు మార్గం ఉంది. విష్ణువు పురాణంలో అంటాడు: “నాకు భక్తుడై రుద్రుడిని ద్వేషించినవాడు, శివభక్తుడై నన్ను ద్వేషించినవాడు నరకంలో ఉంటారు”. ఎప్పటికో అప్పటికి ద్వేషంపోవలసిందే!
111. భక్తితో విష్ణ్వారాధనచేసినవాడికి ఫలం ఉండాలి. శివారాధన చేసినవాడికి ఫలం ఉండాలి. ఉత్తరజన్మలో ఈ తత్త్వాన్ని మరొక రూపంలో తెలుసుకుంటాడు. అంటే ఆ సంప్రదాయంలో పుట్టి దానిని ఉపాసిస్తాడు. ఎప్పటికీ నాణానికి ఒకవైపే చదివి, అందులో పుట్టటంచేత ఆ సంప్రదాయం గొప్పదే అంటున్నాడు కాని, సంప్రదాయం తెలుసుకుని గొప్పదని అనడంలేదు.
112. అసంపూర్ణమైనటువంటి ఆ సగుణోపాసన సంపూర్ణత చెందటం కోసమని ఒక్కొక్కజన్మలో ఒక్కొక్క విభాగాన్ని అతడు అనుష్ఠానం చేస్తాడు. అప్పుడు సంపూర్ణం అవుతుంది. ఒకనాడు ఉత్తీర్ణత వస్తుంది. కాని సగుణభక్తి అయిఉంటే, ఈ ప్రమాదం సంభవించదు. కృష్ణభక్తిని గురించి భాగవతం అంతే చెప్పింది. పర్యవసానస్థితిలో భక్తుడు ఉండాలి. అతడు ఆ కృష్ణభక్తిలో అద్వైతస్థితిని పొందుతాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
20 Oct 2020
No comments:
Post a Comment