కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 79


🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 79 🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మను తెలుసుకొను విధము -09 🌻

నిర్వాణ సుఖమును అనుభవించి, తురీయము నందు ఆత్మనిష్ఠుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, వాడు శోకరహితుడు. ఎందుకంటే సర్వకాలములందు ఉన్నాడు. మరణభయాన్ని పోగొట్టుకుంటాడు. తానే సర్వకాలమందు నిత్యుడై యున్నాడు. పరిణామము లేకయున్నాడు. కదలకయున్నాడు - అనేటటువంటి స్థితిని ఎప్పుడైతే ఆత్మనిష్ఠ ద్వారా తెలుసుకున్నాడో ఇక అప్పుడు ఏ రకమైనటువంటి శోకము, బాధ, ప్రభావము లేకుండా పోయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి.

ఈ రకంగా ఆత్మ యొక్క లక్షణాలు అని యమధర్మరాజు నచికేతుడికి తెలియచెప్తూ ఎంతో విశేషాలతో కూడినటువంటి ఆత్మ లక్షణాలను మానవుడు తప్పక తన అంతర్ముఖము నందే, తన బుద్ధి గుహయందే, తన యందే తాను చేయవలసినటువంటి ఆంతరిక యజ్ఞం ద్వారానే, కర్మఫలాపేక్ష రహితముగా, నిష్కామ కర్మగా, ఫలాభి సంధి రహితముగా, ఫలత్యాగ పద్ధతిగా, శోకరహిత పద్ధతిగా, ఆనందానుభవ పద్ధతిగా, ఆనంద భావాభావ రహిత పద్ధతిగా

ఇలా క్రమమైనటువంటి మెట్లు మీద మెట్లుగా ఒక్కొక్క లక్షణాన్ని అందుకుంటూ ఒక్కొక్క స్థితిని అందుకుంటూ ఆ యా స్థితి భేద నిర్ణయాలను అనుభూతమొనర్చుకుంటూ, ఆయా అనుభూతులను స్థిర పరచుకుంటూ, ఒక దాని నుంచీ మరొక దానికి ‘అధిగచ్ఛతి’ - దాటుకుంటూ, అవతలికి వెళ్తూ ఈ ‘ఆత్మనిష్ఠను తప్పక మానవులందరూ పొందాలి’ అనేటటువంటి ఉత్తమ లక్ష్యాన్ని నచికేతుడికి బోధించడం అనేటటువంటి ఈ బోధా ప్రక్రియద్వారా యమధర్మరాజు మానవులందరికి అందిస్తున్నటువంటి ఆత్మోపదేశము. ఈ మొత్తాన్ని కలిపి ఒకటే అన్నారు.

ఏమని అన్నారంటే ‘ఆత్మోపదేశము’ అనేటటువంటి పద్ధతిగా ఈ ఆత్మ యొక్క లక్షణాలని, ఎలా స్థిరపరచుకోవాలి, దాని యొక్క విశేషం ఏమిటి అనేటటువంటి దానిని మనకి అవగాహన పూర్వకంగా అందిస్తూ వస్తున్నారు.

వేదాధ్యయనం చేసిన వారు, ఆత్మను గురించి ఈ విధంగా చెప్పబడినదని ఉపన్యసింతురు. అట్టి వారి ఉపన్యాసముల మూలంగా ఆత్మను పొందటకు శక్యం కాదు. కొందరు శాస్త్రములను చదివి, బాగుగా జ్ఞప్తియందుంచుకొనగలరు.

అట్టి ధారణాశక్తి వలన కూడా ఆత్మను పొందుటకు శక్యము కాదు. ఆనేక శాస్త్రములను వినుట చేత గాని చదువుట చేత గాని ఆత్మ లభ్యం కాదు. నిష్కాముడై ఆత్మను మాత్రమే వరించునో, ప్రార్థించునో అట్టి వారికి మాత్రమే ఆత్మపొంద శక్యమగును. వారి హృదయమందు ఆత్మప్రకాశించును.

తన స్వరూపము తెలియునట్లు చేయును. మరియు శాస్త్ర నిషిద్ధమైన చోరత్వ, వ్యభిచారాది పాపకర్మలను ఆచరించెడి దుశ్చరితునకు ఆత్మప్రాప్తి శక్యము కాదు. ఇంద్రియములను విషయాదుల నుండి మరలించిన వానికి, ఏకాగ్ర చిత్తము లేని వానికిని, మనస్సు అనేక విషయములందు లగ్నమైన వానికిని, ఈ ఆత్మను పొందుట సాధ్యము కాదు. ఒకవేళ ఏకాగ్రచిత్తం కలిగినప్పటికి, ఇహపర సుఖములందాసక్తి కలవానికి కూడా ఆత్మప్రాప్తి కాదు.

ఎవరు పాప కర్మలను ఆచరింపరో, ఈశ్వరార్పణ బుద్ధిచే, సత్కర్మలను ఆచరించుచు ఇంద్రియ నిగ్రహము కలిగి, చిత్తైకాగ్రతను కలిగియుందురో, అట్టి శమదమాది సాధన సంపత్తి కలవారే ఆత్మను పొందగలరు. ఇతరులకు శక్యం కాదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Oct 2020

No comments:

Post a Comment