శ్రీ శివ మహా పురాణము - 252

🌹 .  శ్రీ శివ మహా పురాణము - 252  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

58. అధ్యాయము - 13

🌻. నారదునకు శాపము - 2 🌻

ఆ తీర్థజలములను స్పృశించుటతోడనే వారి పాపములు నశించి, అంతఃకరణములు శుద్ధమాయెను. వారచట వ్రతపరాయణులై ఓం కారమును జపించుచూ గొప్ప తపస్సును చేసిరి (27). ఓ నారదా! వారు ప్రజాసృష్టికి సిద్ధపడుచుండగా ఆ సంగతి తెలిసి నీవు పూర్వములో వలెనే వారి వద్దకు వెళ్లి, ఈశ్వరుని భావమును స్మరించి, మరల వారికి ఉపదేశించితివి (28).

మహర్షీ! అమోఘజ్ఞానము గల నీవు వారికి సోదరులు వెళ్లిన మార్గమును ఉపదేశించి, నీ దారిన వెళ్లితివి. వారు కూడ సోదరుల మార్గములో పయనించి మోక్షమును పొందిరి (29). అదే సమయములో ఆ దక్ష ప్రజాపతికి అనేక ఉత్పాతములు కానవచ్చెను. నా కుమారుడు దక్షుడు ఆశ్చర్యచకితుడై మనస్సు లో చాల దుఃఖించెను (30). నారదుడు పూర్వము చేసిన విధముగనే ఇప్పుడు కూడ చేసినాడని దక్షుడు విని మిక్కిలి దుఃఖించెను. ఆతడు ఆశ్చర్యచకితుడై పుత్రశోకముచే మూర్ఛితుడయ్యెను (31).

ఈ దక్షుడు నీపై కోపించి 'వీడు దుష్టుడు' అని కూడ పలికెను. అనుగ్రహమును ఇచ్చే నీవు అపుడు అచటకు దైవవశమున వచ్చితివి (32). శోకముచే ఆవిష్టుడై యున్న దక్షునకు రోషముచే అధరము వణకెను. నిన్ను చూచినంతనే ధిక్‌, ధిక్‌ (నింద) అని పలికి నిన్ను అసహ్యించుకొనెను (33).

దక్షుడిట్లు పలికెను -

నీకు నేను ఏమి అపకారమును చేసితిని? నీవు సాధువేషములోనున్న కపటివి. పిల్లలకు భిక్షామార్గము (సన్న్యాసము) ను చూపించితివి. ఇది సాధుకృత్యము కాదు (34). వారికింకనూమూడు ఋణముల నుండి విముక్తి కలుగలేదు. వారు ఇహపరముల నుండి భ్రష్టులైరి. దయలేని మోసగాడవు నీవు. వారి శ్రేయస్సునకు విఘాతమును కలిగించితివి (35).

మూడు ఋణముల నుండి విముక్తి పొందకుండగా తల్లి దండ్రులను విడచి మోక్షమును గోరువాడై ఇంటిని వీడి సన్న్యసించు వ్యక్తి పతితుడగును (36). నీకు దయలేదు.సిగ్గు అసలే లేదు. పిల్లల బుద్ధిని చెడగొట్టి వారి యశస్సును అపహరించితివి. మూర్ఖుడవగు నీవు విష్ణు సేవకులలో కలిసి వృథాగా సంచరించుచున్నావు (37).

నీవు అనేక పర్యాయములు నాకు అమంగళమునాచరించిన అధమాధముడవు. నీవు స్థిరమగు స్థానము లేనివాడై లోకములలో తిరుగాడుచుండగలవు (38) అని దక్షుడు అపుడు సాధువులకు గూడ పూజ్యుడవగు నిన్ను శపించెను. శివమాయచే విమోహితుడగు నాతనికి ఈశ్వరుని సంకల్పము అర్థము కాలేదు (39).

ఓ మహర్షీ! నీవు వికారము లేని మనస్సుతో ఆ శాపమును స్వీకరించితివి. బ్రహ్మనిష్ఠ అనగా నిదియే. హే సాధూ!భగవానుడు కూడ ఇటులనే సహించును (40).

శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితలో రెండవదియగు సతీ ఖండలో నారదునకు శాపము అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Oct 2020

No comments:

Post a Comment