గీతోపనిషత్తు - 56






🌹.   గీతోపనిషత్తు - 56   🌹

🍀 17. సంగము - అసంగము - కర్తవ్యమునే ఆసక్తితో నిర్వర్తించుట భగవానుడు తెలిపిన సుళువు. చేయవలసినదా? చేయదలచినదా? వలసినదే అయినచో కష్ట నష్టములు, జయాపజయములు, లాభనష్టములు చూచుకొననవసరము లేదు. చేయదలచినదైనచో ద్వంద్వము లుండును. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. కర్మయోగము - 29 📚

29. ప్రకృతేర్గుణసంమూఢాః సజ్జంతే గుణకర్మసు |

తానకృత్స్నవిదో మందాన్కృత్స్నవిన్న విచాలయేత్ || 29 ||

కర్మసంగులు గుణములచే మోహము చెంది దేహేంద్రియములచే నిర్విరామముగా కర్మలు చేయుచుందురు. కామము ప్రధానముగా ఆ కర్మలు సాగుచుండును. సృష్టి తత్త్వము తెలిసిన జ్ఞానులు గుణ సంగము లేక దేహేంద్రియములచే కార్యములు నిర్వర్తింతురు. కర్తవ్యమే ప్రధానముగ వారి కార్యములు సాగును.

ఇరు తెగలవారు కర్మలు చేయుచుందురు. కాని ఫలిత మొకటి కాదు. మొదటి తెగవారు సృష్టియందు మోహము చెంది, గుణసంగులై కోరికయే ప్రధానముగ కర్మల నాచరించి అందు బద్దులగుచున్నారు. రెండవ తెగవారు కోరిక బదులుగా కర్తవ్యము నాశ్రయించి కర్మలు నిర్వర్తించుట వలన సంగదోషము లేక జీవన విభూతిని పొందుచున్నారు.

బుద్ధిమంతులు కామము, కర్తవ్యములయందు విచక్షణ

కలిగి యుండవలెను. కర్తవ్యమునకు ఫలితమాసించుట యుండదు. కర్తవ్య నిర్వహణమున కామము లేదు. కామ్యకర్మలు కర్తవ్యములు కావు.

మాట, చేతల కుపక్రమించునపుడు కర్తవ్యమా కాదా అని పరీక్ష చేసుకొని చూసినచో, కామ్యమో కర్తవ్యమో సులభముగ తెలియును. ఇట్టి పరీక్ష చేసుకొననిచో బుద్ధి భేదము కలుగును. మూఢత్వము కలుగును. మోహము కలుగును. అహంకారము కలుగును. అజ్ఞానము కలుగును. కర్మలయందు మునుగును అని భగవానుడు నాలుగైదు రకములుగ హెచ్చరించి యున్నాడు.

కర్తవ్యమునే ఆసక్తితో నిర్వర్తించుట భగవానుడు తెలిపిన సుళువు. చేయవలసినదా? చేయదలచినదా? వలసినదే అయినచో కష్ట నష్టములు, జయాపజయములు, లాభనష్టములు చూచుకొననవసరము లేదు. చేయదలచినదైనచో ద్వంద్వము లుండును.

కావున ప్రకృతి యొక్క గుణములచే సమ్మోహితులైనవారు కామ్య కర్మలే చేయుదురు. అట్లు చేయగూడదని తెలుపువాడు తెలిసినవాడు కాదు. ఎట్లు చేయవలెనో తెలుపుట ప్రధానము.

కామ్యకర్మ నుండి కర్తవ్య కర్మకు క్రమశః మళ్ళించుట జ్ఞానులు చేయవలసిన పని. సామాన్యముగ పండితులు, గ్రంథములు చేయకూడనివి తెలుపుట ఎక్కువగ జరుగును.

చేయవలసిన దానియందు రుచి కల్పించి, చేయదలచిన వాని నుండి క్రమముగ

తప్పించుట జ్ఞానులు, యోగులు చేయవలసిన పని. అంతియేగాని కర్మము సంగము కలిగించునని భయ పెట్టరాదు. కర్మము కామ్యమైనచో సంగముండును. కర్తవ్యమైనచో అనుభూతి యుండును.

శ్రీరాముని జీవితము కర్తవ్య నిర్వహణమునకు ప్రమాణము. అతడు సంగములేక కర్తవ్యమును నిర్వర్తించినాడు. (3-29)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


20 Oct 2020


No comments:

Post a Comment