✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -11 🌻
సాధన చతుష్టయ సంపత్తి అనగానే, మీకు గుర్తుకు రావలసినది ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తి. ఏమిటవి? నిత్యానిత్ర వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము. ఈ నాలుగు సాధన చతుష్టయ సంపత్తులను ఎవరైతే చక్కగా శీలించి సంపాదిస్తారో, నిరంతరాయము నిలబెట్టుకుంటారో, వారు మాత్రమే ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇతరులకు శక్యము కాదు.
కేవలము ‘ఆత్మానుభూతి మాత్రమే నా జీవిత లక్ష్యం’ అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, వారు మాత్రమే ఈ బుద్ధి గుహయందున్నటువంటి, హృదయాకాశమునందు ఉన్నటువంటి ఆత్మను పొందగలుగుతున్నారు. దీనికి ఏమని చెప్పారు మనకి నిన్నా మొన్నా? దాని యొక్క శబ్ద స్ఫురణ కలగగానే, నీకు దర్శనం కలగాలి. అటువంటి సూక్ష్మబుద్ధిని నీవు కలిగిన వాడివై యుండాలి.
‘ఆత్మా సాక్షి’ – ముఖ్యమైనటువంటి, ఆత్మకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం - ఆత్మసాక్షి. అది కర్మను అంటదు. కర్మకు సాక్షి. దానికి కర్తృత్వాభిమానము లేదు, భోక్తృత్వాభిమానము లేదు. దానికి ఏ రకమైనటువంటి పరిమితులు లేవు. సర్వవ్యాపకమైనటువంటిది.
దానికి ఇహ పరములందు సుఖ ఆసక్తి లేదు. బాగా గుర్తుపెట్టుకోవల్సిన అంశం ఏమిటంటే, జీవుడిని నిరంతరాయంగా వెంబడించేటటువంటిది ‘సుఖ అపేక్ష’. ఆ సుఖాపేక్ష చేతనే, ఆ సుఖ ఆసక్తి చేతనే మానవులందరూ కూడా జీవులుగా వ్యవహరిస్తున్నారు. ఈ జీవభావము అన్నా, సుఖాపేక్ష అన్నా రెండూ ఒక్కటే. ఏమీ భేదము లేదు. ప్రయత్నించి ఈ సుఖాపేక్షను పోగొట్టుకోవాలి. ప్రయత్నించి సర్వకర్మ ఫలత్యాగము చేయాలి.
ప్రయత్నించి నిష్కామకర్మగా జీవించాలి. ప్రయత్నించి ఇంద్రియ జయాన్ని సంపాదించాలి. ప్రయత్నించి సాధన చతుష్టయ సంపత్తి సంపాదించాలి. ప్రయత్నించి ఆంతరిక యజ్ఞాన్ని చేయాలి. ప్రయత్నించి ఆంతరికంగా చతుర్విధ శుశ్రూషలను చేయాలి. ప్రయత్నించి తన మనోబుద్ధులను తానే అధిగమించాలి.
ప్రయత్నించి తనలో ఉన్నటువంటి త్రిగుణ మాలిన్య ప్రభావము ఎలా ఉన్నది అనేది గ్రహించి, దానిని అధిగమించాలి. ప్రయత్నించి తనయందున్నటువంటి సంగత్వ దోషము ఏయే విషయములందు, ఏయే గుణములున్న తాదాత్మ్యముతో అనుభవిస్తున్నాడో గ్రహించి తప్పక ఆ రకమైనటువంటి సంగత్వదోషాన్ని పోగొట్టుకోవాలి. ఇవన్నీ సాధన సాధ్యములన్నమాట.
సాధన అంటే అర్థం ఏమిటంటే, ప్రతీ ఒక్కరూ ఏమనుకుంటారంటే, ఏదో కళ్ళు మూసుకుని కూర్చోవడము, లేకపోతే ప్రాణాయామము చేయడము, లేకపోతే యోగాసనాలు చేయడము, లేకపోతే ధ్యానము చేయడమో, లేకపోతే షోడశోపచార పూజలు చేయడమో, లేదంటే తీర్థయాత్రలు చేయడమో, లేదంటే స్తోత్ర పాఠాలు చదవడమో.... ఇలా వీటిని మాత్రమే సాధనలుగా లెక్క కడుతారన్నమాట.
ఇవన్నీ బహిరంగ సాధనలు. బాహ్యసాధనలన్నమాట. కాబట్టి, అట్టి బాహ్యసాధనలతో ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేరు. తప్పక ప్రతి ఒక్కరూ ఆంతరిక పరిణామాన్ని సాధించాలి. అట్టి ఆంతరిక పరిణామాన్ని పొందిన తరువాత మాత్రమే అది వీలౌతుంది. ఈ సత్యాన్ని గ్రహించాలి.
ఈ ప్రపంచము విధాయక, ధారకమను అని రెండు శక్తులతో కూడియున్నది. బ్రహ్మ, క్షత్రములనబడు ఈ రెండు శక్తులును, ఆ ఆత్మకు అన్నమగుచున్నది. మరియు మృత్యువు అన్నములో నంజుకొను ఊరగాయ అగుచున్నది. అట్టి వానిని ఎవడు తెలుసుకొన గలరు? సాధన సంపత్తి కలవారే కానీ, ఇతరులు తెలుసుకొన లేరు.
ఇక్కడేమి చెబుతున్నారు? ఈ ప్రపంచంలో రెండు శక్తులున్నాయి - బ్రాహ్మము, క్షాత్రము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భుజబలంతో, శారీరక బలంతో, ప్రధానంగా ఉండేటటువంటి, రాజస లక్షణంతో ఉండేటటువంటి క్షాత్ర శక్తి ఒకటి. భౌతిక శక్తితో ప్రధానంగా ఉండేటటుంవంటి బ్రాహ్మీ శక్తి. ఈ రెండు శక్తులు కూడా ఈ ఆత్మకు అన్నమగుచున్నది. అంటే ఈ రెండు శక్తులను ఆత్మ భుజించి వేస్తుంది. అన్నం అంటే అర్థం అది.
ఈ రెండు బ్రాహ్మము, క్షాత్రము. ‘ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం’ అంటారు అన్నమాట దీనిని. పరుశురామ అవతారంలో ఈ రెండు శక్తులు కూడా ఒకే అవతారములో కూడుకుని ఉన్నాయి. ఇదం బ్రాహ్మం, ఇదం క్షాత్రం. మిగిలిన అవతారములలో ఏదో ఒక శక్తి మాత్రమే ఉన్నదన్నమాట. ఈ రెండు శక్తులు లేవు. కానీ ఈ విధాయక, ధారక. విధాయక అంటే, ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు అనేటటువంటి విజ్ఞతను బోధించేటటువంటి బ్రాహ్మీశక్తి.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
22 Oct 2020
No comments:
Post a Comment