✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 56 🌻
అటువంటి ఆంతరిక సమాధిని, అంతర్యామి తత్వాన్ని, ఆ అంతఃకరణ చతుష్టయాన్ని దాట గలిగేటటువంటి, సమర్థమైనటువంటి, ఆ మనస్సుని అంతర్ముఖం వైపుకు, మనస్సుని ఆత్మయందు సంయమింప చేసేటటువంటి ఏ ప్రయత్నం ఉన్నదో, దానికే ధ్యానం అని పేరు. అంతేకానీ, ఇతరములైనటువంటి, బాహ్యములైనటువంటి, దృశ్యవిశేషములైనటువంటి దర్శనానుభూతులైనటువంటి, భావ విశేషములైనటువంటి, భావ వ్యక్తీకరణలైనటువంటి వాటిని ధ్యానమని పిలుచుట అసంబద్ధం.
ఎవరికైతే మనస్సు ఆత్మయందు సంయమింప చేయబడి, వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేనటువంటి వారుంటారో, వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారు. విధిని చక్కగా ఎరిగినటువంటి వారు.
వ్యవహార శీలమైనటువంటి మనస్సు కలిగినటువంటివారు అందరూ తప్పక వారి వారి ఇంద్రియాసక్తులను అనుసరించి, గుణబలాన్ని అనుసరించి, వాసనాబలాన్ని అనుసరించి, సంస్కార బలాన్ని అనుసరించి, ఆ యా ఇంద్రియ రీతులయందు మగ్నత చెందక తప్పదు.
అవి భ్రాంతి రూపమైనటువంటి, అద్దము నందు బొమ్మ ప్రతిబింబం, ఏరకమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో, అటువంటి ప్రతిబింబ సుఖాన్ని, ఈ ఇంద్రియ వ్యాపారముల యందు సుఖదుఃఖముల రూపంలో, తనకున్న స్మృతిజ్ఞాన రూపమే, ఇక్కడ ప్రతిబింబ రూపముగా కనబడుతున్నదనే సత్యాన్ని ఎఱుగక, పిల్లవాడు అద్దాన్ని ముందు పెట్టుకుని ఆడినట్లుగా, తన ప్రతి బింబమును తానే చూచుకుని ఆనందపడినట్లుగా, తన యొక్క ప్రతిబింబ.... బింబ సుఖముయొక్క ప్రతిబింబం అయినటువంటి, ఇంద్రియ వ్యవహారముల యందు ఏర్పడుతున్నటువంటి, తత్కాల రూప పరిమిత, అశాశ్వత సుఖదుఃఖములను అనుభవించుచు, వాటినే సత్యమని భావించేటటువంటి, భ్రాంతికి లోనౌతున్నాడు - అనేటటువంటి విషయాన్ని సుస్పష్టముగా మళ్ళా ఇప్పుడు తెలియజెప్తున్నారు.
అద్దమును ప్రపంచము వైపు త్రిప్పినప్పుడు, ప్రపంచమును చూపును. తన వైపుకు త్రిప్పుకుని, తన ముఖమును చూపించునటుల, మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడు ప్రపంచమును, అంతర్ముఖమైనప్పుడు ప్రత్యగాత్మను చూపించును. గట్టి ప్రయత్నము చేత, ఇంద్రియములను, మనస్సును అంతర్ముఖముగా ఉండునట్లు చేయవలెను. అట్టి వారికే మోక్షము.
మోక్షాధికారులు ఎవరో సుస్పష్టముగా చెబుతున్నారు. ఎవరైతే మనస్సును, అంతరాత్మ వైపు, అంతర్యామి వైపు, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం వైపు, స్వస్థానం వైపు, హృదయాకాశం వైపు, ఎవరైతే తిప్పుతారో, బుద్ధి గుహయందు ఉంచుతారో, వారికి మాత్రమే మోక్షము సాధ్యమౌతుంది. మిగిలిన వారు మోక్షము, మోక్షము అని పలవరించుటే తప్ప, వారికి ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ప్రపంచాన్ని చూడాలి అంటే, ప్రపంచం వైపుకి తిరగాలి. అంతర్యామిని చూడాలి అంటే అంతర్యామి వైపు తిరగాలి.
మనస్సు అనే అద్దాన్ని ప్రపంచం వైపు తిప్పినప్పుడు అదే ప్రపంచం అందులో ప్రతిబింబిస్తుంది. అదే మనస్సుని అంతర్యామి వైపు గనుక త్రిప్పినట్లయితే, తన ఉనికిని తానే కోల్పోయి ఆ ఆత్మతత్వాన్ని గ్రహిస్తుంది. ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మానుభూతి యందు తానే లేనటువంటి స్థితిలో లయమైపోతుంది.
ఆ అంతఃకరణమంతా లేనటువంటి, లయమైనటువంటి స్థితిలో, తానే పరిణామ రహితమైనటువంటి ఏ ఆత్మగా ఉన్నాడో, అంతర్యామిగా ఉన్నాడో, “సర్వభూతస్తమాత్మానం, సర్వభూతానిచాత్మని, వీక్షతే యోగయుక్తాత్మ, సర్వత్ర సమదర్శినః” - అటువంటి సమదర్శనాన్ని చక్కగా సాధిస్తాడు. అనేకత్వం అనేటటువంటి దృష్టి లేకుండా, ఏకత్వానుభూతి యందు స్థిరముగా ఉంటాడు.
ఈ రకంగా తనయందు స్వస్థితుడైనటువంటి, తన స్వస్థానమునందు స్వస్థితుడయ్యేటటువంటి మోక్షము, ఆ మార్గములో ఈ ఆత్మనిష్ఠ చాలా ముఖ్యమైనటువంటిది.
అటువంటి ఆత్మనిష్ఠను సాధించడానికి సాధకులందరూ తప్పక అంతర్ ధ్యాన మగ్నులై, అంతర్ముఖంలో స్థిరంగా ఉండేటటువంటి పద్ధతిని ఆశ్రయించాలి.
అజ్ఞానులు బహిర్గతములైన కామ్యవిషయములనే కోరుచున్నారు. అట్టివారు జన్మ, జరామరణ రోగాదులతో కూడి, మృత్యపాశమునకు గురియగుచున్నారు.
కానీ వివేకవంతులు అశాశ్వతమైన భోగములను కోరక, శాశ్వతమైన మోక్షమునే కోరుదురు. మోక్షము ‘న కర్మణా వర్థతేనో కనీయాన్’ అను శృతిని అనుసరించు, కర్మల చేత పెరుగుట కానీ, తరుగుట కానీ లేదు. ఇది ధృవమైనది, శాశ్వతమైనది. వివేకులు ఈ విధముగా తెలిసి దాని కురేషణ, ధనేషణ, పుత్రేషణలను ఈ ఈషణాత్రయములను త్యజించి, మోక్షాభిలాషులు అగుచున్నారు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Dec 2020
No comments:
Post a Comment