శ్రీ శివ మహా పురాణము - 291


🌹 .  శ్రీ శివ మహా పురాణము - 291 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

70. అధ్యాయము - 25

🌻. సతీ వియోగము - 3 🌻


మీరిద్దరు ఈనాడే నా యందు దయను చూపినారు. ఇది మాహాభాగ్యము . మీరిద్దరు ఎవనిపై దయను చూపెదరో. అట్టి పురుషుడు ధన్యుడు, శ్రేష్ఠుడు(38). రఘురాముడు శివపత్నియగు సతితో నిట్లు పలికి,అనేక పర్యాయములు ప్రణమిల్లి ఆమె ఆజ్ఞచే ఆ వనమును సంచరించెను. (39).

జితేంద్రియుడగు రాముని ఈ వాక్యములను విని, సతీదేవి చాల సంతసించి, అతని శివభక్తిని తన హృదయములో చాల మెచ్చుకొనెను(40). తాను చేసిన పనిని గుర్తునకు తెచ్చుకొని , ఆమె మనస్సులో అతిశయించిన దుఃఖమును పొందెను. ఆమె దుఃఖముతో పాలిపోయిన ముఖముగలదై నిరుత్సాహముగా శివుని వద్దకు తిరిగి వచ్చెను(41).

ఆ దేవి మార్గమునందు నడుస్తూ అనేక పర్యాయములు లిట్లు చింతిల్లెను. శివుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి, నేను రాముని విషయంలో చెడు ఆలోచనను చేసితిని.(42).శంకరుని వద్దకు వెళ్లి నేను, ఏమి సమాధానమును చెప్పగలను? అపుడామె ఇట్లు పరిపరివిధముల చింతిల్లి పశ్చాత్తాపమును పొందెను. (43).

ఆమె శోకముతో నిండిన హృదయమున గలదై కాంతిని గోల్పోయి విషాదభరితమైన ముఖముతో సంభుని సమీపమునకు వెళ్లి నమస్కరించెను(44). శివుడు దుఃఖతరాలగు ఆమెను చూచి క్షేమమేనా ?అని ప్రశ్నించెను రాముని ఏ విధముగా పరీక్షించితివి ?అని ఆయన ప్రీతితో పలికెను(45).

శివుని మాటను విని ఆమె తలవంచుకొని ఏమియూ మాటలాడకుండెను. శోకముతో నిండిన హృదయము గల సతి ఆయనకు దగ్గరగా నిలబడియుండెను(46) అపుడు మహాయోగి, నానాలీలా దక్షుడు అగు మహేశ్వరుడు ధ్యానమార్గములో దక్షపుత్రి యొక్క ఆచరణను తెలుసుకొనెను(47).

మర్యాదను రక్షించే ఆ రుద్రుడు విష్ణువు ప్రార్థించగా తాను పూర్వము చేసిన ప్రతిజ్ఞను గుర్తుకు తెచ్చుకొనెను. (48). ఆ ప్రభువునకు విషాదముకలిగెను. ధర్మమును పలికి, ఆచరించి, ధర్మమునూ సదా రక్షించే శివుడు తన మనస్సులో నిట్లనుకొనెను(49).

శివుడిట్లు పలికెను-

నేను దాక్షాయణి యందు పూర్వమునందు వలె ప్రేమను కలిగియున్నచో, లోకలీలను అనుసరించే నా యొక్క శుద్ధమగు మహా శపథము నశించును(50).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వేద ధర్మమును నిష్ఠతో పాలించు శివుడు ఇట్లు పరిపరివిదముల తలపోసి, హృదయములో సతిని త్యజించి శపథము నష్టము కాకుండునట్లు చేసెను(51).

అపుడా పరమేశ్వరుడు ఆ సతీదేవిని మనస్సులో త్యజించి తన కైలాసమునకు వెళ్లెను. ఆశ్చర్యము !ఆ ప్రభువు దుఃఖమును పొందెను. (52). మార్గమునందు వెళ్లుచున్న ఆ మహేశ్వరుని ఉద్దేశించి, సర్వులు విశేషించి సతీదేవి వింటూ ఉండగా , ఆకాశవాణి ఇట్లు పలికెను(53).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2020


No comments:

Post a Comment