భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 179


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 179 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మార్కండేయ మహర్షి - 5 🌻


34. శాశ్వతులైన పిత్రుదేవతలకు ప్రతీవాళ్ళూ శ్రాద్ధాధిక కర్మలు చేయుట మనేటటువంటిది మన సంప్రదాయం. పితృసర్గంలో ప్రథమ పితృసర్గం ఇది. ఇదికాక అనేకమంది పితరులు సప్తలోకాల్లోనూ నిలిచి ఉన్నారు.

35. భూలోకంలో ఉండేటటువంటివాళ్ళు భువర్లోకవాసుల్ని ఆరాధిస్తారు. సువర్లోకంలో ఉండేవాళ్ళు మరీచాదులు. దానితరువాత మహర్లోకం ఉందిపైన.

36. సువర్లోక వాసులు కల్పాదివాసులైన మహర్లోకవాసులను; మహర్లోకవాసులు సనకాదులను – అంటే జనలోకవాసులను; జనలోకవాసులు విరాగులైన తపోలోకవాసులను, వారు ఆపైనున్న సత్యలోకవాసులను పూజిస్తారు.

37. కిందివాళ్ళు పైవాళ్ళను ఆరాధనచేయటమే పితరుల ఆరాధన. భ్రమక్షాత్ర వైశ్యులందరికీకూడా సమంగానే పూజించతగినవాళ్ళు వీరు. వసువులు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, అశ్వినులు, మరుత్తులు – వీళ్ళందరికీ సమానంగా ఆరాధ్యదేవతలే వాళ్ళు.

38. రుద్రులకు వేరే పితృదేవతలంటూ లేరు కాబట్టి ఈ దేవతలనే వాళ్ళు కూడా ఆరాధించవలసి వస్తున్నది అన్నాడు మార్కండేయుడు.

39. త్రివర్ణములైన బ్రహ్మక్షత్ర వైశ్యులనుష్టించు మతవ్యవహారాలలో ఆయా మత విధివిధానంగా పురాణోక్తంగా, మత్రోక్తంగా పితృదేవతలను ఆరాధిస్తారు. శ్రాద్ధ కర్మలకు కాలము, యోగ్యాయోగ్యులెవరో అవన్నీకూడా మార్కండేయమహర్షి తెలియచెప్పాడు.

40. ఆ కర్మలన్నీ చేస్తు, పురుషోత్తముడిని ఎవరైతే భక్తితో కొలుస్తారో అతడికి ఐహికము, ఆముష్మికము లభిస్తాయి. అంటే పైలోక వాసుల్ని ఆరాధించటంవలన పైలోకానికి ఇతడు వెళ్ళగల స్థితి ఏర్పడుతుంది. విష్ణుభక్తిచేత పాపక్షయమవుతుంది. ఒకవేళ మోక్షం కోరకపోతే, ఉత్తమ లోకాలకు వెళతారు.

41. శ్రాద్ధాదిక్రియల విషయంలో ధర్మశాస్త్రంలో ఒక విశేషం ఉంది. సధారణంగా ఒకడు ఏ తిథినాడు చచ్చిపోతాడో ఆ తిథినాడే అతడికి ప్రతియేటా శ్రాద్ధం పెడుతుంటారు. అలా పెట్టి తీరాలంటారు. కాని శాస్త్రంలో వాక్యాలేలా ఉన్నాయంటే – కొన్ని ఉగ్రమైన నక్షత్రములు, అధోముఖ నక్షత్రములు ఉంటాయి.

42. ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం – ఆ తిథినక్షత్రములు ఉగ్రతలలో ఉన్నప్పుడు – ఆనాడే తిథి ఏర్పడినాకూడా, తిథిని ఆనాడు పెట్టవద్దు అని; సౌమ్యమయిన నక్షత్రంచూచి తరువాత పెట్టమని ఉంది.

43. అలాంటి వ్యవస్థ ఎప్పుదైతే ఉందో – తిథి, నక్ష్త్రం చూడకుండా ఉగ్రమైన నక్షత్ర, తిథులలో శ్రాద్ధకర్మచేస్తే ఆ ఇంట్లో మృత్యువు సంభవిస్తుంది అని అంటారు. శ్రాద్ధాది క్రియలు శుభకర్మలు కావని మనందరికీ తెలుసు. శుభకర్మ కానప్పుడు శుభాశుభములు రెండింటికీ కూడా సౌమ్యమయిన కాలాన్నే ఎన్నుకోమని రెండింటికి చెప్తారు.

44. శుభకర్మకు ఎప్పుడూ కూడా, ప్రత్యేకంగా ఉత్తమలోకాలకు వెళ్ళినవాళ్ళనుగురించి కర్మలు చేసేటప్పుడు, సరిఅయిన, ఉగ్రత లేనటువంటి నక్షత్రాలను చూచి చెయ్యాలి. లేకపోతే మృత్యువు సంభవిస్తుంది అని వ్రాసారు పూర్వీకులు గ్రంథాల్లో. ఆ ఉగ్రత్వంవల్ల ఎవళ్ళనో తీసుకెళుతారు వాళ్ళు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2020

No comments:

Post a Comment