✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 15
🍀. 13. తటస్థత - దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు. దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి. భగవదారాధన లన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట. 🍀
15. నాదత్తే కస్యచి త్పాపం నచైవ సుకృతం విభుః |
అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః || 15
దైవము జీవుల పుణ్యమును గాని, పాపమును గాని స్వీకరింపడు. అతడు జ్ఞానముచే తెలియబడువాడు. అట్టి జ్ఞానమజ్ఞానముచే కప్పబడి యుండుట వలన జీవులు మోహము చెందుచున్నారు.
దైవ తత్త్వము తటస్థముగ నుండును. పాపములు చేసిన వారిని దైవము శిక్షించ నవసరము లేదు. వారి పాపములే వారిని శిక్షించును. అట్లే పుణ్యము చేసినవారిని దైవమను గ్రహించుటయు లేదు. వారి పుణ్యములే వారికి సుఖశాంతుల నిచ్చుచున్నవి.
ఒకరియందాగ్రహము, ఒకరియందనుగ్రహము దైవము చూపడు. దైవము కేవలము తెలుసుకొన దగిన వాడే! తెలుసు కొనినవాడు దైవమువలె తటస్థ స్థితి యందుండును.
ఉదాహరణకు ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వి తటస్థమగు స్వభావము గలవారే వానిని వినియోగించుకొను జీవులు సుఖమును, దుఃఖమును కూడ పొందవచ్చును. అట్లే సూర్యకాంతి కూడను. వినియోగ జ్ఞానము గలవారికి సృష్టి సుఖమీయ గలదు.
అట్టి జ్ఞానము లేనివారికి దుఃఖము కలుగవచ్చును. ఇందు భగవత్ ప్రమేయ మేమియు లేదు. 'రామ, రామ, రామ' యనుచు అగ్ని శిఖపై వేలుంచిన కాలక తప్పదు. రాముని స్మరణ వలన జ్ఞానము కలిగినచో అగ్ని శిఖపై వ్రేలుంచరాదని తెలుయుట సరియగు పద్ధతి.
ఏ జీవునికైనను అతడు చేయు కర్మయే అతనికి ఫలముల నిచ్చుచుండును. అందరును బాగుండవలెనని చేయు పనులు సుఖమీయగలవు. ఇతరులకు దుఃఖము కలిగించు పనులు కాలచక్రమున దుఃఖము నీయగలవు. ఇందు భగవంతుని ప్రమేయ మేమియును లేదు.
భగవదారాధనలన్నియు పవిత్రము చెందుటకు, జ్ఞానము పొందుటకే అని తెలియవలెను. జ్ఞానము పొందుట యనగ ధర్మ స్వరూపము నెరిగి ఆచరించుట.
సృష్టి నిర్మాణము చేయునపుడే దైవము సృష్టియందు ధర్మము నేర్పరచెను. ధర్మము నాచరించు వారు రక్షింపబడుట, ఆచరింపనివారు దుఃఖము చెందుట సృష్టి యందు జరుగుచునుండును.
సనక సనందనాదులు, త్రిమూర్తులు, సప్తఋషులు, మనువులు, ప్రజాపతులు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, గ్రహగోళాదులు, పంచభూతములు, మానవులు, జంతువులు, వృక్షములు ఎవరెవరి ధర్మము వారికున్నది.
ధర్మము ఎవరు నిర్వర్తింపకున్నను వారికి కేశము తప్పదు. దైవము ద్వంద్వాతీతమైన సృష్టి కతీతము. సృష్టి యందతడు ధర్మముగనే వసించి యున్నాడు. అందువలన ప్రత్యేకముగ అనుగ్రహించుట, ఆగ్రహించుట యుండక సాక్షీభూతుడై యుండును.
సన్న్యాస మనగ కూడ యిదియే స్థితి. సన్న్యాసి అయిన వానికి యితరుల పాపపుణ్యములతో సంబంధము లేదు. అతడందరి యందును ఒకే విధముగ సముడై ప్రవర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 Jan 2021
No comments:
Post a Comment