శ్రీ శివ మహా పురాణము - 330


🌹 . శ్రీ శివ మహా పురాణము - 330 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

83. అధ్యాయము - 38

🌻. క్షువదధీచుల వివాదము - 2 🌻


అపుడు యోగియగు శుక్రుడు వేగముగా వచ్చి, క్షువునిచే చీల్చివేయబడిన దధీచుని దేహమును మరల సంధించెను(19) శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసనను లోకములో ప్రవర్తిల్లజేసినవాడు అగు శుక్రుడు దధీచుని దేహమును పూర్వమునందుండిన తీరున సంధించి ఇట్లు పలికెను(20)

శుక్రుడిట్లు పలికెను

వత్సా! దధీచా! సర్వేశ్వరుడగు శివప్రభుని పూజించి వేదోక్తము, సర్వశ్రేష్టమునగు మహా మృత్యుంజయ మంత్రమును నీకు చెప్పెదను(21). త్య్రంబకం యజామహే ముల్లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్ని చంద్ర సూర్య మండలములను సృష్ఠించినవాడు, సత్త్వరజస్తమోగుణములపై పూర్ణి అధిపత్యము గలవాడు(22)

శ్లేష్మవాత పిత్తములనే మూడు శరీరతత్వములను, అహవనీయ గార్హపత్య దక్షిణాగ్నులను మూడు అగ్నులను పాలించువాడు, పృథివి జలము అగ్ని అను మూడు బాహువుల వంటి మూడు మూర్త భూతములతో సర్వమును వ్యాపించి యున్నవాడు స్వర్గాది లోకస్వరూపుడు, సర్వత్ర సుఖదుఃఖమోహాత్మకమగు జగత్తునందు వ్యాపించి యున్నవాడు (23)

త్రిమూర్తి స్వరూరపుడగు శివుని పూజించెదము సుగంధిమ్‌, మహాదేవుడు సర్వభూతములలో సర్వప్రాణములలో, సత్త్వరజస్తమోగుణములలో సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించియున్నాడు(24)

ఆ దేవ దేవుడు పుష్పములలో సుంగంధము వలె ఇంద్రియములో ఇతర దేవతలతో శివగణములలో వ్యాపించియున్నాడు (25) పుష్టి వర్దనమ్‌. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! గొప్పవ్రతము గలవాడా!మహత్తు మొదలుకొని పరమాణు గత విశేషము వరకు వివిధ కార్యరూపములలో నున్న ప్రకృతి యొక్క పుష్టి (బలము) పురుషుడగు శివుని నుండి లభించినది(26).

మహర్షీ!విష్ణువునకు, బ్రహ్మకు, మునీశ్వరులకు, ఇంద్రునకు, దేవతలకు పుష్టిని ఇచ్చుటచేతనే శివుడు పుష్ఠి వర్దనుడగుచున్నాడు(27) ఓ ప్రజాపతీ! అమృతస్వరూపుడగు ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్టానముచే గాన తపస్సుచేగాని, వేదాధ్యమునుచే గాని, యోగముచే గాని, ధ్యానముచే గాని ఆరాధించవలెను(28)

సత్యముచే గాని,లేదా ఇతర ఆరాధనా పద్ధతో గాని పూజింపబడిన శివ ప్రభుడు, పుచ్చకాయను తీగనుండి వలె, భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము లను భంధము నుండి విముక్తిని కలింగించును(29) నా అభిప్రాయములో ఈ మృసంజీవనీ మంత్రము సర్వశ్రేఫ్టమైనది. నీవు ప్రీతితో శివుని స్మరిస్తూ నియమముతో దీనిని జపించుము(30)

జపము అయిన తరువాత హోమమును చేయుము. రాత్రింబగళ్ళు నీరు త్రాగినప్పుడు ఆ నీటిని ఈ మంత్రముతో అభిమంత్రించి త్రాగుము. దీనిని శివసన్నిధిలో ధ్యానము చేయువానికి ఎక్కడైననూ మృత్యుభయము ఉండదు(31) న్యాసాదికమునంతనూ చేసి, భక్తవత్సలుడు మంగళరుడు నగు శివుని యథావిధిగా పూజించి ఈ మంత్రమును జపించి దుఃఖమునుండి విముక్తిని పొందుము(32)

ఈ మంత్రమునకు ధ్యానము చెప్పెదను. ఇట్లు ధ్యానించి మంత్రమును జపించు జ్ఞాని శంభుని అనుగ్రహముచే శీఘ్రముగా మంత్రసిద్ధిని పొందును(33)

పద్మముల వంటి రెండు చేతుల యందున్న రెండు కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సు పై అభిషేకించుకొను చున్నట్టియు, రెండు చేతులతో తన తొడపై రెండు కుంభములను ధరించినట్టియు, అక్షమాలను మృగమును చేతియందు కలిగి ఉన్నట్టియు, పద్మమునందాసీనుడై ఉన్నట్టియు, శిరస్సు పై నున్న చంద్రునినుండి జాలువారిన అమృతముతో తడిసిన దేహము కల్గినట్టియు, పార్వతీ దేవితో కూడి ఉన్నట్టియు మూడు కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను(34)

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 Jan 2021

No comments:

Post a Comment