కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 169
🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 169 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము - 99 🌻
భగవద్గీతలో కూడా ఈ మాయ ఎలా ఉన్నది అంటే, దుమ్ము పట్టినటువంటి అద్దం ఎలా ఉందో, శిశువు చుట్టూ మావి ఎలా ఉందో....’ధూమేన వ్రియతే వహ్నిః యథా దీపో మలేనచ’ అనేటటువంటి పద్ధతిగా...
పొగచేత నిప్పు, మావి చేత శిశువు... దుమ్ము ధూళి చేత అద్దము కప్పబడినప్పడు వాటి యొక్క వాస్తవికమైనటువంటి స్థితిని, నువ్వు ఎట్లా గుర్తించ లేవో, అట్లా త్రిగుణ మాలిన్యము అనేటటువంటి జీవభావము గనుక ఆవరించి ఉన్నట్లయితే, శరీర తాదాత్మ్యత భావన గనుక నిన్ను ఆవరించి ఉన్నట్లయితే, కర్తృత్వ, భోక్తృత్వ అభిమానములు గనుక ఆవరించి ఉన్నట్లయితే,
శరీర త్రయము, దేహత్రయము, గుణత్రయము, అవస్థాత్రయము... వంటి త్రిపుటులకు సంబంధించిన మాలిన్యము అంతా ఆవరించి ఉన్నట్లయితే, నీవు యథార్థమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందలేవు. పొందాలి అంటే ఈ మాలిన్యాన్నీ తొలగించుకోవాలి. కాబట్టి, ధ్యానము అంటే అర్థం ఏమిటంటే? ఈ త్రిగుణ మాలిన్యమును తొలిగించుకోవడమే, ఈ శుద్ధ అంతఃకరణాన్ని పొందగలగడమే ధ్యానము అంటే.
కాబట్టి, ‘ధ్యాన సాధన’ చేసేవారందరూ తప్పక గుర్తించవలసిన అంశం ఏమిటంటే, వారు వారివారి మనోఫలకం మీద ఏ రకమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికి, ఏ రకమైనటువంటి దృశ్యములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి భావములు ఏర్పడినప్పటికి, ఏ రకమైనటువంటి తాదాత్మ్యత స్థితులు ఏర్పడినప్పటికి, వాటికి ఔననక, కాదనక ఉపేక్షించి ఉండి, సాక్షీ భావం వహించి, ఉదాసీన వైఖరిని అవలంబించి, ఊరక చూస్తూ ఉండాలి. ఇట్లు చూస్తూ ఉండగలిగేటటువంటి సమర్థత చేత, ప్రతి దినము తన మనోమాలిన్యాన్ని తానే శుద్ధి చేసుకోగలిగేటటువంటి సమర్థత సంపాదిస్తారు.
ముఖ్యముగా చతుస్సంధ్యలలో మిమ్మల్ని చెయ్యమన్నటువంటి సాధన వలన, ఏ సంధ్యకి ఆ సంధ్యే ఆ మధ్యకాలంలో ఏర్పడేటటువంటి మనోమాలిన్యా్న్ని, ఆ ధ్యానకాలంలోనే తొలిగించి వేసేటటువంటి సత్కర్మ, సత్ క్రతువు చేస్తూ ఉంటాము. ఈ ఆంతరిక యజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి. ఇట్లా ఎవరైతే చతుస్సంధ్యలలో చేసి, జాగ్రత్ స్వప్న సుషుప్త్యావస్థలలో ఆయా అవస్థల ప్రభావం చేత ఏర్పడినటువంటి విషయ తాదాత్మ్యత మాలిన్యాన్ని,
ఎవరైతే తొలగించుకుంటూ ఉంటారో, ఏ రోజుకారోజే ప్రారబ్ద కర్మ విశేష ఫలాన్ని, ఆగామి కర్మగా మారకుండా అనుభవిస్తూ ఉంటారో, అనంతమైనటువంటి సంచిత కర్మరాశిని దగ్ధం చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాగ్నిని సముపార్జిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే హృద్ గుహలో ఈ పరమాత్మని అనగా ప్రత్యగాత్మ రూప పరమాత్మని సాక్షాత్కారింప చేసుకుంటారు.
కాబట్టి, మౌళికమైనటువంటి, ప్రధానమైనటువంటి సాధనని తప్పక ప్రతి ఒక్కరూ ఆచరించాలి.
ఆచరణ శీలురైనటువంటి వారుమాత్రమే, మనన శీలురైన వాళ్ళు మాత్రమే, శ్రవణ, మనన, నిధి ధ్యాస పరులు మాత్రమే, నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే, నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుచున్న ఐదైదులు ఇరవైఐదు ఇంద్రియములు, పిండాండ పంచీకరణలో ఉన్నటువంటి వాటిని సాధన దృష్ట్యా... ఏ ఏ ఇంద్రియ స్థానంలో త్రిగుణ మాలిన్యము ఏర్పడుతుందో, గుర్తించి, గ్రహించి, ఆయా త్రిగుణ మాలిన్యమునకు అతీతముగా వ్యవహరించేటటువంటి నైపుణ్యాన్ని నువ్వు బుద్ధి సూక్ష్మత ద్వారా సాధించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సాధన.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment