దేవాపి మహర్షి బోధనలు - 9


🌹. దేవాపి మహర్షి బోధనలు - 9 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 4. అశ్వవిద్య - 1 🌻

ప్రాచీన వేద సంప్రదాయము ఒక మతముగా పరిణమింపక ముందున్న శాస్త్ర కక్ష్యలను పరిశీలించుట అత్యవసరము. అనేక దేవతలు జంతువుల రూపములలో వారి విజ్ఞానము సంకేతింపబడి యున్నది.

అశ్వము, మేషము, విహంగము, చక్రము, పద్మము, సర్పము, హంస ఇత్యాది సంకేతములు వున్నవి. అందు అశ్వమును గూర్చి కొంత పరిశీలింతము.

“అశ్నుతే గమనేన ఇతి అశ్వం” అనగా గమనమున వ్యాపించున దని దీని భావము. కిరణము, అగ్ని ఈ విధమగు వ్యాపనము, గమనము కలిగియున్నవి.

ఇతర జీవుల గమనము నందున్నప్పుడు వ్యాపన ముండదు. వ్యాపనము నందున్నప్పుడు గమనముండదు. గమనము, వ్యాపనము రెండూ కలిగియుండుట దైవీ లక్షణము. చైతన్య మట్టిది. గుఱ్ఱము సంకేతముగ ఈ విద్యను అశ్వవిద్యగ వేద ఋషులు బోధించిరి.

“శ్వ” అనగా రేపు, నిన్న. “అశ్వ” అనగా రేపు నిన్న కానిది. అనగా నేడు. భవిష్యత్తు, భూతములుగాక ఉన్న కాలమును అశ్వమని ఋషులు చమత్కరించిరి. అనగా ప్రస్తుతము, వర్తమానము, నిత్యనూతనమగు ప్రాణశక్తి అని అర్థము. జ్ఞానము అని కూడా అర్థము.

అనుభవవైకమగు ప్రాణశక్తి అని అర్థము. వేద వాజ్మయమున అశ్వము అనగా తేజోమయము, విజ్ఞానమయము, కామగమనము, నిత్యగమనము, కాలస్వరూపము గల ఒక దేవత.

పంచభూతములు శరీరముగ సృష్టి అగుట, శరీరము పంచభూతములుగ లయమగుట అను సంచయ లయ శక్తులకు మూలకారణమై అంగములయందు నిహితమైన ప్రాణాగ్నిని అశ్వత్థము అని చెప్పుదురు. అశ్వరూపమున అగ్ని అంగములయందు వుండుటచే అశ్వత్థము అనిరి.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Jan 2021

No comments:

Post a Comment