సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము
నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖
🌻 186. 'నిరపాయా' 🌻
సర్వమును శ్రీమాత ఆధీనమున యుండుటవలన ఆమె ఎట్టి అపాయమును ఎరుగదు. అపాయము ఎవరికి యుండును? తన స్వాధీనము కానిది ఒకటి యున్నప్పుడే కదా! తనకు స్వాధీనము కానిది తనకు ఎదురు తిరుగవచ్చును. జ్ఞానము, అజ్ఞానమూ కూడ ఆమె స్వాధీనముననే యున్నవి. అట్టి శ్రీమాతకు ఆపాయ మెట్లుండును?
జ్ఞానులు అప్పుడప్పుడు అహంకరించుటచే, సృష్టియందు అపాయము వాటిల్లును. వానిని ఇంద్రుడు, త్రిమూర్తులు ఆదిగాగల దేవతలు నివారింతురు. వారి వశముకానిచో శ్రీమాత నివారించును. ఇట్లే అజ్ఞానులు అహంకరించి లోకములండు అనిశ్చిత నేర్పరచినప్పుడు కూడ శ్రీమాత అట్టి అపాయములను పరిష్కరించును. సృష్టియందు ఏ అపాయమునైననూ నిర్వర్తించు సమర్ధురాలు శ్రీమాత.
అపాయములు రెండు విధములుగా కలుగవచ్చును. బయట నుండి, లోపలినుండి అపాయము లేర్పడుచుండును. బయట జనించినను, లోపల జయించనివారు అపాయములకు గురియగుదురు. అట్టివారే హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు. వారు తమ లోపల జయించకపోవుటవలన అపాయమునకు గురి అయిరి.
అహంకారము, చిత్తము, ఇంద్రియానీకములను జయించిన యోగులు ఎట్టి అపాయమునకు గురికారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, గౌతముడు, సనక సనందనాదులు, నారదుడు అట్టివారు. లోపల జయించిననూ బయటినుండి అపాయములు రావచ్చును. శ్రీరాముని జీవితము దానికి తార్కాణము. అట్లే యుధిష్ఠిరుని జీవితము కూడ. లోపల జయించుటచేత, వారు అపాయములకు గురియైననూ, ఆ అపాయములు పరిష్కరింపబడినవి.
భక్తులకు ఈ నామమిచ్చు సందేశ మొకటున్నది. అంతరంగ విజయము నిజమగు విజయమని, బహిరంగ విజయము నిజమగు విజయము కాదని, అంతరంగ విజయము ద్వారా నిరపాయ స్థితిని పొందవచ్చని, శ్రీమాత ఆరాధనము అంతరంగ విజయమునకే ఉద్దేశింప బడవలెనని సందేశము, "అంతర్ముఖ సమారాధ్యా" అని రాబోవు నామమున ఈ విషయము ప్రస్తావనకు రాగలదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 186 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Nirapāyā निरपाया (186)🌻
She is without destruction, the prime quality of the Brahman. Apāyā means destruction, death, annihilation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
21 Jan 2021
No comments:
Post a Comment