🌹. ఆది అంతం లేనిదే అస్తిత్వం 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
📚. ప్రసాద్ భరద్వాజ
అది అనేక రూపాలనుంచి మరెన్నో రూపాలుగా పరిణమించింది. అయినా అది ‘ఆది’నుంచి- ఒకవేళ ‘ఆది’ అనేది నిజంగా ఉన్నట్లైతే, అంతవరకు అది ‘అంతం’కాదు. ఎందుకంటే, ఆద్యంతాలపై నాకు నమ్మకం లేదు.
ఆద్యంతాలు లేనిదే అస్తిత్వం. దానితోపాటు మీరుకూడా ఎప్పుడూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే, రూపాలు-ఈ జన్మలో కూడా- వేరుకావచ్చు. మీరు తల్లిగర్భంలోకి ప్రవేశించినప్పుడు ప్రశ్నార్థకంలో ఉన్న చిన్న చుక్కకన్నా పెద్దగా లేరు. ఆ ఫొటోను మీకు చూపించినా అది మీరే అని మీరు గుర్తించలేరు. నిజానికి, అంతకుముందు కూడా అంతే.
ఇద్దరు వ్యక్తులు గతాన్ని గుర్తుకు తెచ్చుకునే వాదనలో పడ్డారు. వారిలో ఒకడు ‘‘మూడేళ్ళ వయసులో ఏంచేశానో నాకు గుర్తుంది’’ అన్నాడు. ‘‘ఓస్! అంతేనా. నేను పుట్టక ముందే మా నాన్న, అమ్మ హనీమూన్‌కు వెళ్ళడం నాకు తెలుసు. మేము వెళ్ళేటప్పుడు నేను మా నాన్నలో ఉన్నాను, తిరిగి వచ్చేటప్పుడు నేను మా అమ్మలో ఉన్నాను’’ అన్నాడు మరొకడు.
మీరు మీ నాన్నలో ఉన్నప్పటి ఫోటోను పెద్దది చేసి చూపించినా మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేరు. కానీ, అది మీ రూపమే. ఇప్పుడు మీలో ఉన్నది కూడా దాని మూలమే.
ప్రతిరోజూ, ప్రతి క్షణం మీరు మారిపోతున్నారు. మీరు పుట్టిన వెంటనే తీసిన ఫొటోను చూపించినా మిమ్మల్నిమీరు గుర్తించలేరు. పైగా, ‘‘నేను ఇలా ఉన్నానా?’’అంటూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, అంతా మారిపోయింది. మీరు పెద్దవారయ్యారు. మీ చిన్నతనం, యవ్వనాలు వెళ్ళిపోయాయి. మృత్యువు ఆసన్నమవుతోంది. అయితే, అది ఒక రూపంలో వస్తుందే కానీ, ఒక సారాంశంగా రాదు.
కాబట్టి, మీ జీవిత గమనంలో నిరంతరాయంగా మార్పు చెందుతున్నది కేవలం రూపం మాత్రమే. ప్రతి క్షణం మీ రూపం మారిపోతోంది. మరణం కేవలం జీవానికి సంబంధించి తొందరగా జరిగే ఒక కీలకమైన కాస్త పెద్ద మార్పు మాత్రమే.
మీరు పసితనం నుంచి యవ్వనంలోకి, యవ్వనం నుంచి వార్థక్యంలోకి ఏ రోజు ఎప్పుడు ప్రవేశించారో మీరు గుర్తించలేరు.
ఎందుకంటే, అది చాలా నిదానంగా క్రమక్రమంగా జరిగే మార్పు. కాబట్టి, ఒక శరీరంనుంచి మరొక శరీరంలోకి, ఒక రూపంనుంచి మరొక రూపంలోకి ఒక్కసారిగా ఎగిరి దూకడమే మరణమంటే. కానీ, మీకు అదే ముగింపు కాదు.
ఎందుకంటే, ఎప్పుడూ ఇక్కడే ఉన్న మీరు ఎప్పుడూ మరణించలేదు, తిరిగి జన్మించలేదు. నిరంతరాయంగా ప్రవహించే జీవన వాహినిలో అనేక రూపాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ వాస్తవం మీ అనుభవంలోకి రానంతవరకు మృత్యుభయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కేవలం ధ్యానం మాత్రమే దానికి పరిష్కారం చూపగలదు.
ఎందుకంటే, అలా నిర్ణయించడంతో మీరు ఇంతకాలం చాలా చక్కగా పెంచి పోషించుకున్న మీ అహం, మీ గతాలు ముక్కలైపోవడంతో మీరు కూడా చెదిరిపోతారు. అక్కడ ఎవరో ఉంటారు. కానీ, ఆ వ్యక్తి మీరు కాదు. అలా మీలో తెగిపోయనదేదో గతంలో ఏమాత్రం కలుషితం కాకుండా, చాలా తాజాగా ఉదయిస్తుంది.
నేను ఎంత చెప్పినా, ధర్మగ్రంథాలు ఎంతగా ఘోషించినా పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. ఎందుకంటే, ఇంకా ఏదో సందేహం మీలో మిగలవచ్చు. ఎవరికి తెలుసు? అందరూ తమని తాము మోసగించుకుంటూ ఎన్నో అబద్ధాలు చెప్పవచ్చు లేదా ఇతర గ్రంథాలు, బోధనల ద్వారా వారే మోసపోయి ఉండవచ్చు. కాబట్టి, సందేహమున్నట్లుగానే, భయమూ ఉంటుంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
30 Jan 2021
No comments:
Post a Comment