గీతోపనిషత్తు -150
🌹. గీతోపనిషత్తు -150 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 3
🍀 3. శాంతి - శమము - శాంతి లభించ వలెనన్నచో మానవుడు నిష్కామ కర్మమును జ్ఞానముతో జోడించి నిర్వర్తింపవలెను. యోగమార్గమున ఆరోహణము గావించిన యోగికి శమము కారణమని చెప్పబడుచున్నది. యజ్ఞార్థ కర్మయే దైవము నిర్దేశించిన కర్మ. దైవయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని, యింద్రియ సంయమ యజ్ఞమని, శబ్దయజ్ఞమని, మనోయజ్ఞమని, ద్రవ్య
యజ్ఞమని, తపో యజ్ఞమని, యోగయజ్ఞమని, స్వాధ్యాయ యజ్ఞమని, జ్ఞానయజ్ఞమని, ప్రాణాయామ యజ్ఞమని, అన్న యజ్ఞమని పండ్రెండు యజ్ఞములు నిర్వర్తించుట ద్వారా జీవుడు ప్రజ్ఞయందు ఆరోహణము చెందగలడని తెలిపినాడు. 🍀
ఆరురుక్షో ర్మునే ర్యోగం కర్మకారణ ముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణ ముచ్యతే || 3
ప్రజారోహణము చేయదలచిన మననశీలురకు నిష్కామ కర్మ సాధనమని చెప్పబడుచున్నది. యోగమార్గమున ఆరోహణము గావించిన యోగికి శమము కారణమని చెప్పబడుచున్నది.
ప్రజలందరును శాంతిని, శమమును కోరుచుందురు. దానికై ఉద్యమములు చేపడుదురు. శాంతి, శాంతి యని నినాదములు చేయుదురు.
శాంతి లభించవలెనన్నచో మానవుడు నిష్కామ కర్మమును జ్ఞానముతో జోడించి నిర్వర్తింపవలెను. కర్మజ్ఞానముల సూత్రములను ముందు అధ్యాయము లందు వివరింపబడుట జరిగినది.
యజ్ఞార్థ కర్మయే దైవము నిర్దేశించిన కర్మ. ఫలముల నాశింపక, కర్తవ్యమును నిర్వర్తించుచు ఫలితముల కొరకై కర్మములు వక్రీకరించక, ఏర్పడిన సత్పలములందు రమించక, యితరుల శ్రేయస్సు నాశించుచు తత్ఫలమైన కర్మలు నిర్వర్తించుచు జీవించుట కర్మయోగమను అధ్యాయమున తెలుప బడినది.
జ్ఞానయోగమను అధ్యాయమున నిష్కామ కర్మను నిర్వర్తించుచు పండ్రెండు రకములగు యజ్ఞములను భగవానుడు బోధించినాడు. ఈ యజ్ఞములన్నియు బుద్ధి, మనస్సు, యింద్రియ
ములు, శరీరము, సంపద పరహితమున కెట్లు వినియోగింపవలెనో తెలిపినాడు.
దైవయజ్ఞమని, బ్రహ్మయజ్ఞమని, యింద్రియ సంయమ యజ్ఞమని, శబ్దయజ్ఞమని, మనోయజ్ఞమని, ద్రవ్య యజ్ఞమని, తపో యజ్ఞమని, యోగయజ్ఞమని, స్వాధ్యాయ యజ్ఞమని, జ్ఞానయజ్ఞమని, ప్రాణాయామ యజ్ఞమని, అన్న యజ్ఞమని పండ్రెండు యజ్ఞములు నిర్వర్తించుట ద్వారా జీవుడు ప్రజ్ఞయందు ఆరోహణము చెందగలడని తెలిపినాడు.
జ్ఞానముతో కూడిన నిష్కామ కర్మయజ్ఞమే సాంఖ్యమని తెలిపినాడు. ఇట్లు నిర్వర్తించుట పరిపూర్ణమగు యోగము. అట్టి వానికే శమము సాధ్యమగును. శమము సాధ్యపడిననే గాని ధ్యానము కుదరదు.
ధ్యాన యోగమునకు సోపానక్రమముల కర్మయోగ సూత్రములు, జ్ఞానయోగ సూత్రములు తప్పనిసరియని తెలియ వలెను. వీని నిర్వహణముననే శమము లభించునుగాని, కేవలము శమము కోరుట వలన శమము కలుగదు. శాంతి, శమము ధ్యానమునకు ప్రాథమికమగు అర్హత కలిగించును.
శాంతి శమముల కొరకు ధ్యానములు చేయుట కన్న, నిష్కామ కర్మము, పరహితములను జీవితమున నిర్వర్తించుట నిజమగు తెలివి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
15 Feb 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment