గీతోపనిషత్తు -172
🌹. గీతోపనిషత్తు -172 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 15
🍀 15. పరమ శాంతి - నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచు నుండును. పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయము నందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును. నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. 🍀
యుంజన్నేవం సదా 2 త్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థా మధిగచ్ఛతి || 15
నియతమగు మనస్సు కలిగి, ఎల్లపుడును ఆత్మతో కూడి యుండి, నా యందు స్థితిగొని, ప్రవృత్తి కతీతమగు శాంతిని యోగి పొందుచునుండును. భగవానుడు యోగి లక్షణము నొకదానిని ఇచ్చట ఆవిష్కరించు చున్నాడు. ఈ లక్షణము యోగసాధకునకు లక్ష్యమై యుండ వలెను. నియత మానసుడనగ నియమింపబడిన మనస్సు గలవాడు.
పరి పరి విధముల పోక నిర్దేశించిన విషయమునందు మనస్సు స్థిరముగ నున్నపుడు అట్టి మనస్సును స్థిరమగు మనస్సు లేక చిత్తము అందురు. అట్టి స్థిరమగు చిత్తము పొందుటకు ఎన్నియో నియమములు పూర్వమున దైవము పేర్కొని యున్నాడు. భక్తి, శ్రద్ధ, దీక్ష గలవారు ఆ నియమములను పాటింతురు.
స్థిరమగు మనస్సు లేక ధ్యానమున కుపక్రమించుట పిల్లతనము. మనోప్రజ్ఞ స్థిరముగ నున్నపుడు ఆ ప్రజ్ఞను నేను అను వెలుగుపై లగ్నము చేయుటకు సాధ్యపడును. అట్లు లగ్నము చేసినపుడే సాలోక్యము సిద్ధించును.
సాలోక్యమనగ సారించి చూచుట. చూచు విషయములు తప్ప, ఇతర విషయములు భాసింపవు. అపుడు తాను, చూడబడు చున్నవి మాత్రమే యుండును. దానిని చూచుటయే యుండును. ఇతరములు గోచరములు కావు. అట్లు నిరంతరముగ చూచుట వలన చూడబడు విషయము వైపునకు చూచువాడాకర్షింపబడును. ఇట్లాకర్షింపబడుట వలన చూచు విషయమునకు సామీప్యమున చేరును. క్రమముగ సాయుజ్యము లభించును.
అనగ చూడబడు విషయముతో జత కట్టును. అట్లు నేనను ఆత్మ వెలుగుతో మనోప్రజ్ఞ జతకట్టుట ఈ శ్లోకమున తెలుపబడు చున్నది. “యుంజన్నేవం సదా ఆత్మానం" అని శ్లోకము ఆరంభమగుచున్నది.
నియతమగు మనస్సు నేనను వెలుగుతో ఎల్లప్పుడును జతకట్టి యుండుట ధ్యాన ప్రక్రియ. అట్లు జతకట్టి యుండుట వలన ప్రవృత్తి భావము లుండవు. అనగ ప్రాపంచిక విషయము లేవియు స్ఫురించవు.
తాను, తన వెలుగు మాత్రమే యుండును. అది సాధకునకు చక్కని శాంతినిచ్చును. ఇతర భావము లన్నియు నిర్వాణము చెందుట వలన పరమశాంతి పొందును. దీని రుచి తెలిసినవాడు నేనను వెలుగున స్థిరపడుటకు ఉత్సహించును. ఇతరము లేవియు అంతకన్న విలువైన విషయము లనిపించవు. ప్రవృత్తి నధిగమించి, నివృత్తి యందు స్థిరపడి దేశకాలములను బట్టి నిమిత్తమాత్రుడై కార్యములను నిర్వర్తించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
18 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment