రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 10
🌻. కుజ గ్రహోత్పత్తి - 2 🌻
అపుడా శిశువు పరమేశ్వరుని యెదుట ఏడ్చెను. లోకాచార పరాయణుడగు శివుని యెదుట ఆ శిశువు ఇతర శిశువుల వలె ఏడ్చెను(16). అపుడా భూదేవి శంకరునకు భయపడి మంచి బుద్ధితో ఆలోచించి సుందర స్త్రీ రూపమును ధరించి అచట సాక్షాత్కరించెను(17).
ఆ భూదేవి ఆ శ్రేష్ఠ బాలకుని వెంటనే లేవదేసి ఒడిలో కూర్చుండ బెట్టుకొని, తన ఉపరితముపై లభించు పాలను స్తన్యరూపములో అ బాలునకు ప్రేమతో త్రాగించెను (18). సతీదేవి లేకుండుటచే ఆమె బాలుని తన కుమారునిగా భావించి, అ బాలుని ముఖమును ప్రేమతో ముద్దాడెను. అమె తల్లియగుట పరమేశ్వరునకు అనందమును కలింగించెను (19). కృతార్థుడు, జగత్కర్త, అంతర్యామి, పాపహరుడు అగు శంభుడు భూదేవిని గుర్తు పట్టి, ఆమె యొక్క ఆ ప్రవృత్తిని గాంచి చిరునవ్వుతో నిట్లనెను (20). ఓ భూదేవీ ! నీవు ధన్యురాలవు. మహాతేజశ్శాలియగు నా యొక్క చెమట నీపై పడగా పుట్టిన ఈ నా శ్రేష్ఠుడగు పుత్రుని ప్రేమతో పెంచుము(21).
ఓ భూదేవీ! ఈ ప్రీతికరుడగు బాలుడు నా శ్రమజలమునుండి పుట్టిన వాడే అయినా, నిత్యము మూడు విధముల (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక) తాపములు లేని ఈబాలుడు నీ పేరుతో ప్రసిద్ధిని గాంచుగలడు(22). ఈ నీ కుమారుడు భూమిని దానము చేయు గుణవంతుడు కాగలడు. నాకు కూడా ఈతడు సుఖమును కలిగంచగలడు. ఈ బాలుని ప్రేమతో స్వీకరించుము (23). విరహ దుఃఖమునుండి కొద్ది ముక్తిని పొందిన మనస్సు గల ఆ రుద్రుడు లోకాచారమును ప్రవర్తిల్ల జేయుచూ ఇట్లు పలికి మిన్నకుండెను. సత్పురుషులకు ప్రీతి పాత్రుడగు శంభుడు వికారములు లేని వాడుగదా! (24). ఆ భూదేవి కూడా వెను వెంటనే శివుని ఆనతిని పొంది కుమారుని దోడ్కొని తన స్థానమునకు వెళ్లి బ్రహ్మానందమును పొందెను (25).
ఆ బాలుడు భౌముడు(కుజుడు) అని పేరు గాంచి శీఘ్రముగా పెరిగి యువకుడయ్యెను. ఆతడు కాశీనగరములో చిరకాలము శంకర ప్రభుని సేవించెను (26). ఆ కుజుడు విశ్వేశ్వరుని అనుగ్రహమచే గ్రహత్వమును పొంది, శుక్రలోకము కంటె శ్రేష్ఠమగు దివ్యలోకమును శీఘ్రమే పొందెను (27). సతీ వియోగముతో నున్న శంభుని చరితమును నీకీ తీరున వర్ణించితిని. ఓ మహర్షీ! శంభుని తపశ్చరణమును గూర్చి చెప్పెదను. శ్రధ్ధతో వినుము(28).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో భౌముని పుట్టుక అను పదవ అధ్యాయము ముగిసినది (10).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
18 Mar 2021
No comments:
Post a Comment