🌹. గీతోపనిషత్తు -177 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 19
🍀 19. యతచిత్తము - గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యందనాసక్తి, సంకల్ప సన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము నేర్వవలెను. 🍀
యథా దీపో నివాతస్థా నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః|| 19
గాలి తగులని దీపమెట్లు నిశ్చలముగ నుండునో అట్టి స్థిర చిత్తముతో 'నేను' అను వెలుగును భ్రూమధ్యమున యోగి దర్శించు చుండును. నివాతస్థ దీపమనగ గాలి సోకని దీపము. గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము.
చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యథాలాపముగ ఏమియు చేయరాదు. చేయుపని ఏదైనను దానియందే పూర్ణచిత్తము నియోగించవలెను.
దంత ధావనము, స్నానము, వస్త్రధారణము, భోజనము వంటి కార్యములు యథాలాపముగ చేయక మనసు పెట్టి నిర్వర్తించవలెను. శ్రద్ధగ చేయవలెను. అక్షరాభ్యాస సమయము నుండి ఈ అభ్యాసము ప్రారంభించిన వారికి యతచిత్త మేర్పడుట సులభము. దైనందిన కార్యములందు యథాలాపముగ నుండువారు ధ్యానము నేర్చుటకు చాల శ్రమపడవలసి వచ్చును.
ప్రస్తుతమున మనస్సు నిలుపుట, ఇతర ఆలోచనలు రాకుండుట జరుగవలెను. విను చున్నపుడు పూర్తిగ వినవలెను. చూచుచున్నపుడు పూర్తిగ చూడవలెను. అనగ మనస్సు పెట్టవలెను. అట్లే తినుచున్నపుడు, తిరుగు చున్నపుడు కూడ. ప్రస్తుతమున మనస్సు నిలచుట ప్రధానము. ఉదాహరణకు ఒక పాట వినుచున్నపుడు పాటను పూర్తిగ వినువారు అరుదు. ఆ నిమిషములోనే అనేకానేక భావములు కలిగి పాట వినుట జరుగదు.
యతచిత్తము గూర్చి భగవానుడు చాలమార్లు పలికినాడు. అట్టి యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యం దనాసక్తి, సంకల్పసన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము ఇత్యాది వెన్నియో గీతయందు తెలుపబడినవి. ఇవి ఏవియును పాటింపక, సరాసరి ధ్యానమందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకమే అని తెలియవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
29 Mar 2021
No comments:
Post a Comment