🌹 . శ్రీ శివ మహా పురాణము - 377🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 12
🌻. శివహిమాచల సంవాదము - 2 🌻
హిమవంతుడిట్లనెను-
ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)
ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20).
హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22).
బ్రహ్మ ఇట్లు పలికెను-
హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).
మహేశ్వరుడిట్లు పలికెను-
హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).
బ్రహ్మ ఇట్లు పలికెను-
శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25).
హిమవంతుడిట్లు పలికెను-
ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).
బ్రహ్మ ఇట్లు పలికెను-
అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).
శంభుడిట్లు పలికెను-
ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).
ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).
శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
29 Mar 2021
No comments:
Post a Comment