దేవాపి మహర్షి బోధనలు - 54


🌹. దేవాపి మహర్షి బోధనలు - 54 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 36. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 10 🌻


మహర్షి జ్వాలాకూలుని బోధనలను ఆరంభదశలో యథా తథముగా పదములను, వాక్యములను వ్రాయుచుండెడి దానను. ఆయన ఎక్కడి నుండి తమ బోధనలను ప్రసారము చేయుచుండిరో నాకు తెలిసెడిది కాదు. ఆయన వాగ్ధ్వని మాత్రము స్పష్టముగా నాలోన వినిపించెడిది. ఈ విధముగా నా మెదడును శ్రమతో తీర్చిదిద్దిన నా గురుదేవులు దేవాపి మహర్షికి సదా నేను కృతజ్ఞురాలిని.

నా పిన్నతనమునుండి నన్ను రకరకములుగా తీర్చిదిద్ది సాంప్రదాయపు ఊబిలో నున్న నా మనోతత్వము నుద్ధరించి, నా మెదడును చైతన్యవంతము గావించి, దానికి దూరశ్రవణము చేయగల అర్హత నేర్పరచినారు. పదుల సంవత్సరముల వినయ పూర్వక శిక్షణము కారణముగా నే నీనాడు దూరశ్రవణము చేయుచూ మహత్తరమైన జ్ఞానమును విని, వ్రాయగలుగుట నేర్చితిని.

జ్ఞానమాత బ్లావెట్ స్కీ యిట్లే ముందు తరమున 'తెర తొలగింపు', 'గుప్తవిద్య' అను యుద్రంథములను ప్రపంచమున కందించినది. అదే కోవలో నేను కూడ పయనించు చుంటినని తెలిసి కృతజ్ఞతా పూర్వకముగా, భక్తి, వినయము, శ్రద్ధలతో వ్రాతపని చేయుచుంటిని. వ్రాతపని బాగుగా ముందుకు సాగిన సమయమున నా మనస్సు మహర్షి జ్వాలాకూలుని మనస్సుతో పూర్తిగా అనుసంధానమైనది. అది కారణముగా పదములు, వాక్యములు అందుకొను స్థితినుండి భావము నందుకొని భాషను ఏర్పరచు స్థితికి ఎదిగితిని.

అటుపైన బీజప్రాయమైన భావములను జ్వాలాకూలులందించు చుండగా పేరాలుగా వ్రాయుట వరకూ ఎదిగితిని. ఇందు నా కృషి, నా గురువనుగ్రహము రెండునూ సమపాళ్ళలో ప్రాముఖ్యము కలిగియున్నవని కూడా తెలిసినది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2021

No comments:

Post a Comment