కావాల్సింది సృజనాత్మకత


🌹. కావాల్సింది సృజనాత్మకత 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ


క్రొత్తవాటి కోసం పాతవి కచ్చితంగా అంతరించాలి. దయచేసి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఆ పాతవి మీలో ఉన్నవే కానీ, లేనివి కాదు. అంటే, నేను చెప్పేది మీ లోపల ఉన్న కుళ్ళిన పాత భావాలు అంతరించాలని మాత్రమే.

కానీ, మీలో లేని వాటి గురించి, పాత సామాజిక నిర్మాణం గురించి నేను మాట్లాడట్లేదు. పాత భావాలతో నిండిన మీ మానసిక స్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. నూతన భావాలతో కూడుకున్న మానసిక స్థితి మీలో కలిగేందుకు ఆ పాత మానసిక స్థితి అంతరించాలి.

అలా ఒక్క మనిషి మారినా, అతని ఉనికి అనేకమంది తమ జీవితాలను ఊహించలేనంత, నమ్మలేనంత అపురూపంగా మార్చుకునేందుకు ప్రేరేపిస్తుంది. అప్పుడు అనేకమంది అలా మారడం ప్రారంభిస్తారు.

కాబట్టి, పేరాశల నుంచి, పురాతన ఆదర్శవాదాల నుంచి బయటపడి, నిశ్శబ్దంగా, ధ్యాన పూర్వకంగా, ప్రేమాస్పదునిగా మారి, ఆనందంగా నాట్యం చేస్తూ జరిగే దానిని గమినించండి. త్వరలో అనేకమంది, ఆ తరువాత ఇంకా చాలామంది మీతో కలిసి నాట్యం చేస్తారు. ఇదే నేను మీకు బోధించే తిరుగుబాటు.

నేను రాజకీయాలకు పూర్తిగా వ్యతిరేకిని, కాబట్టి, వాటిపై నాకు ఎలాంటి ఆసక్తిలేదు. అవును, కొత్త వాటికోసం పాతవి నశించాలి. అది మీలో జరగాలి. అప్పుడే అక్కడ కొత్తవి పుట్టుకొస్తాయి. కొత్తవి ఎప్పుడూ అంటువ్యాధి లాంటివే. అందుకే అవి త్వరగా ఇతరులకు వ్యాపిస్తాయి.

ఆనందం ఒక అంటువ్యాధి. మీరు నవ్వడం ప్రారంభిస్తే మీతో పాటు ఇతరులు కూడా నవ్వడం ప్రారంభిస్తారు. అలాగే ఏడుపు కూడా. మనం విడిగా లేము. అందరం కలిసే ఉన్నాం. కాబట్టి, ఎవరి హృదయం ఉప్పొంగినా అది ఇతరుల హృదయాలను- ఒక్కొక్క సారి సుదూర తీరాలలో ఉన్న హృదయాలను కూడా- తాకుతుంది.

ఏదో విధంగా మార్మికమైన మార్గంలో నా నవ్వు, నా ప్రేమ మిమ్మల్ని చేరింది, నా ఉనికి మీ ఉనికిని తాకింది. అందుకే అనేక ప్రయాసలుపడి చాలా దూరాలనుంచి కూడా మీరు ఇక్కడకొచ్చారు. ప్రతి దానికి వ్యతిరేకంగా పోరాడమని నేను మీకు బోధించట్లేదు. అలా చేస్తే మీరొక అభివృద్ధి నిరోధకునిగా మారతారు.

ఎందుకంటే, మీ చర్యకు ప్రతి చర్య అదే. అప్పుడు మీకు వ్యతిరేకమైన దాని ఉచ్చులో మీరు చిక్కుకుంటారు. అది మిమ్మల్ని శాసిస్తుంది- బహుశా ప్రతికూల మార్గంలో కావచ్చు. అయినా అది మిమ్మల్ని శాసిస్తుంది.

నేను దేనికీ, ఎవరికీ వ్యతిరేకిని కాను. మీరు పూర్తి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటానే కానీ, ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ పొందాలని నేను కోరుకోను. తేడాను గమనించండి.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


10 Mar 2021

No comments:

Post a Comment