ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు.
🌹. ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్,
📚. ప్రసాద్ భరద్వాజ
స్వేచ్ఛ మీ జీవితంలో ఒక సృజనాత్మక శక్తిగా మారాలి. అంతే కానీ, అది మీ జీవితానికి ప్రతికూలంగా ఉండకూడదు. ఇప్పుడు మీరు జైలులో లేరని, అంతా పోగొట్టుకుని ఆకాశం కింద స్వేచ్ఛగా నిలబడ్డారని తెలుసుకున్నారు.
బందీ ఎప్పుడూ బందీగా ఉండాలనే కోరుకుంటాడు. బహుశా ఈ సత్యాన్ని ఇంతకు ముందెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. ఎందుకంటే, వాడికి ఎలాంటి బాధ్యత ఉండదు. ఏదీ సృష్టించే పని ఉండదు. వాడికి కావలసినవన్నీ ఇతరులే సమకూరుస్తూ ఉంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షల మంది జనాలు కులానికో, మతానికో, వర్ణానికో, తెగకో, దేశానికో, సంప్రదాయానికో బందీలుగా ఉండాలనే కోరుకుంటారు.
ఎందుకంటే, ఎలాంటి బాధ్యత స్వీకరించకుండానే వారికి కావలసినవన్నీ ఇతరుల ద్వారా జరిగిపోతూ ఉంటాయి. అందుకే వారు జీవితాంతం ఆ బందిఖానాలను భరిస్తూనే ఉంటారు. కాబట్టి, స్వేచ్ఛకు సంబంధించినంత వరకు ‘‘స్వేచ్ఛ, బాధ్యతలు కలిసే ప్రయాణిస్తాయి’ ’అనే మౌలిక విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. బాధ్యత వద్దనుకుంటే మీకు స్వేచ్ఛ దక్కదు. అవి రెండు కలిస్తే వస్తాయి, కలిసే పోతాయి.
మీరు బాధ్యతను వదిలించు కోవాలనుకుంటే ఏదో విధంగా మీరు బానిసత్వాన్ని అంగీకరించ వలసిందే. తరువాత వచ్చే బృహత్తర బాధ్యత గురించి ఏమాత్రం ఆలోచించకుండా స్వేచ్ఛ గురించి ఇప్పటి వరకు మీరు కలలు కన్నారు. ఇప్పుడు మీకు స్వేచ్ఛ దక్కింది. కానీ, మీరు ఇంతవరకు మీ బాధ్యతను నిర్వర్తించలేదు. అందుకే బాధ మిమ్మల్ని వెంటాడుతోంది. దానిని మీరు నాశనం చెయ్యగలరు.
బానిసత్వం నుంచి మీరు బయట పడగలిగితే కచ్చితంగా మీరు సృజనాత్మకులవుతారు. మీ జైళ్ళను మీరు ధ్వంసం చెయ్యగలిగితే కచ్చితంగా మీరు ఎంతో కొంత అందమైన దానిని సృష్టించగలుగుతారు. ఏదో విధంగా మీరు సృజనాత్మకులు కాకపోతే మీ జీవితం శూన్యంగానే మిగిలిపోతుంది. అప్పుడు మీకు బాధ తప్పదు. ఇది నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న సత్యం.
ఆనందించే వారు మాత్రమే సృజనాత్మకులవుతారు. అది మరింత చైతన్యమో మరింత సత్యానుభవమో, మరింత ఆనందమో సృష్టించడం కావచ్చు లేదా బాహ్య, అంతర్గత ప్రపంచాల సృజనాత్మకత కావచ్చు. ఏదేమైనా స్వేచ్ఛ ఒక బాధ్యతగా, సానుకూలంగా మారాలి.
మీకు దక్కిన స్వేచ్ఛ ఇంకా ప్రతికూలంగానే ఉంది. మీరు బందిఖానా నుంచి బయటపడడం మంచిదే. కానీ, అది చాలదు. ఇప్పుడు మీ కూడు, గుడ్డ మీరే సంపాదించు కోవాలి. ఇంతవరకు, జైలు అధికారులే వాటిని మీకు సమకూర్చారు. అనేక మంది చర్చిలు, సినగాగులు, దేవాలయాలకు సంబంధించిన వారే. దాదాపు అందరూ ఏదో ఒక మతం, దేశం, కుటుంబం, సంఘం, రాజకీయ పక్షం, రోటరీ లేదా లయన్స్‌క్లబ్‌లలో సభ్యులే. అలా తమని తాము బంధించు కునేందుకు ఎవరికివారే సంకెళ్ళు వెతుక్కుంటారు.
ఎందుకంటే, మీకు ఎలాంటి బాధ్యత ఉండదు. అయినా మీకు పూర్తిరక్షణ ఉంటుంది. అందుకే అలాంటి జైళ్ళలో మీకు హాయిగానే ఉంటుంది. అదే స్వేచ్ఛ విషయంలో అయితే మీరు ఏ పని చేసినా, చెయ్యక పోయినా ప్రతి విషయంలోనూ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అందరూ స్వేచ్ఛ గురించి మాట్లాడేవారే. కానీ, నిజానికి, అదంటే అందరికీ భయమే. అందుకే అందరూ సుఖమైన జైలులో హాయిగా ఉండేందుకే సిద్ధపడతారు.
నా అనుభవం మేరకు చాలా కొద్ది మంది మాత్రమే నిజంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఎందుకంటే, స్వేచ్ఛ వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా లేమన్న సత్యం వారికి చాలా స్పష్టంగా తెలుసు. మీకున్న స్వేచ్ఛతో మీరు ఏదో ఒకటి చెయ్యడమే దానికి ప్రత్యామ్నాయం.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment