శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 254 / Sri Lalitha Chaitanya Vijnanam - 254


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 254 / Sri Lalitha Chaitanya Vijnanam - 254 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀



🌻 254. 'ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా'🌻

చింతనము, చింతన గమ్యము, చింతించు జీవుడు, అను మూడు రూపములుగ ఉండునది శ్రీదేవి అని అర్థము. చింతన గమ్యము శుద్ధ చైతన్యము. అందుండి చింతించు జీవుడు జన్మించును. అతని గమ్యము పుట్టిన చోటికి చేరుటయే. దీనినే స్వస్థానమున కేగుట అందురు. సత్య స్వరూపుడగు జీవుడు మేల్కాంచుట శ్రీదేవి కారణముగ జరుగును. మేల్కాంచిన జీవుడు చింతన మారంభించును.

చింతనము త్రివిధములుగ అవతరణము చెందును. అవియే ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు. వాని ననుసరించు జీవుడు, మనస్సు, పంచేంద్రియముల ద్వారా పంచతత్త్వములతో కూడిన సృష్టియందు ప్రవేశించును. ఇట్లు త్రిగుణములను, పంచతత్త్వములను ఆధారము చేసికొని జీవుడు బహిరంగము జేరును. ఇట్టి జీవుడు మరల అంతరంగుడై స్వస్థానము చేరుటకు ధ్యానము అవసరము.

తాను పుట్టిన చోటికి చేరుటకే ఈ ధ్యానము. తాను పుట్టిన చోటును గూర్చి చింతన చేయుటయే అన్ని ధ్యానముల పర్యవసానము. ఈ ధ్యానమునే గాయత్రీ ధ్యాన మనిరి. తానెచ్చట పుట్టినాడు తన ఉత్పత్తికి మూలమేమి? తానున్నా డన్న భావము కలుగుటకు మూలమేమి? తన భావములకు తాను మూలము. తనకు మూలము? తన మూలమును ధ్యేయముగ ధ్యానము చేయుట నిజమగు గాయత్రీ ధ్యానము.

ఇది నిత్య చింతన మైనపుడు, నిరంతర చింతనమైనపుడు ధ్యాసగ మారును. ఇట్టి ధ్యాసయే ధ్యానము. ధ్యానము చేయుట యందు ధ్యాస కలుగుట స్వస్థానము చేరుటకు ప్రధానము. సాధన యందు ఇది తుది మెట్టు. ప్రకృతులు (త్రిగుణములు, పంచేంద్రియములు) ద్వారా బహిరంగము చేరిన జీవుడు త్రిగుణములయందు తన్ను తాను బంధించుకొనును.

ఇచ్ఛా పూర్ణమే కార్యక్రమముగ లక్షల జన్మలు సాగిపోవు చుండును. ఇచ్ఛా పూర్ణ కార్యక్రమములో భాగముగ ఇంద్రియాసక్తి, విషయాసక్తి తామర తంపరలుగ పెరిగి అందు జీవుని అగమ్యుని చేయును. గతిలేని జీవుడు చేయునది లేక మూలకారణము కొఱకు వెదకును. గతి లేకయే కదా, గజేంద్రుడు మూలకారణమును గూర్చి ప్రార్థన చేసెను.

ధ్యానించుటకు కూడ వలసిన ప్రేరణ శ్రీదేవి అనుగ్రహమే. అనుగ్రహము లేనివారు దైవమును గూర్చి ధ్యానము చేయలేరు. ప్రార్థనలు చేయలేరు. ప్రారబ్దము విఘ్నములు కలిగించు చుండగ ప్రార్థన లెట్లు జరుగగలవు? ధ్యానమునకు అనుగ్రహము శ్రీదేవి. ధ్యానము, ధ్యేయము శ్రీదేవి అని వివరింపబడినది. ధ్యానించు జీవుడు కూడ శ్రీదేవి నుండి ఏర్పడిన వాడే. జీవుడు స్వయముగ చైతన్య స్వరూపుడు. స్వయంప్రకాశకుడు.

అష్ట ప్రకృతుల లోనికి సంసరణము చెందినపుడు తనను గూర్చిన ఎఱుక కోల్పోవును. నిజమున కతడు కూడ సముద్రము నందు అలవలె శ్రీదేవి అంశ. అల సముద్రమే కదా! అట్లే మహాచైతన్యమగు శ్రీదేవి నుండి ఉద్భవించినవాడే జీవుడు. శ్రీదేవి సత్, చిత్ రూపిణి. జీవుడు కూడ సత్ చిత్ రూపుడే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 254 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Dhyāna-dhātṛ-dhyeya-rūpā ध्यान-धातृ-ध्येय-रूपा (254) 🌻

She is the form of a triad – the meditation, the meditator and the object of meditation. This triad leads to another triad – the knower, the known and the knowledge. Higher level of spiritual knowledge can be attained only through dhyāna or meditation. Meditation is only a process of powerful concentration. Reading books and listening to sermons are not knowledge.

Knowledge is attained through internal quest and exploration. The store house of knowledge is not extraneous, but within. The store house is nothing but the Supreme Self. Please refer nāma 251 also.

Patañjali Yoga Sūtra (III.2) explains this further. “Unbroken flow of that concentration in that object is called dhyāna.”

Kashmiri Saivism has unique advaita philosophy known as trika, a triad formed out of Śiva, Śaktī and nara or soul.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Apr 2021

No comments:

Post a Comment