దేవాపి మహర్షి బోధనలు - 70


🌹. దేవాపి మహర్షి బోధనలు - 70 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 51. ముక్కుసూటి మార్గము 🌻


అతి చిన్న జీవియందు, అతి పెద్ద దైవమునందు నిన్ను నీవు దర్శించుట ఆత్మ దర్శనామార్గము. ఇట్లు దర్శించు సాధకుడు దేనిని అశ్రద్ధ చేయడు. మానవ మేధస్సు గొప్ప విషయములందు ఆసక్తి కలిగియుండుటచే ఆత్మ దర్శనమునకు అర్హత కలిగియుండదు. అట్టి అర్హత కలుగవలె నన్నచో ఆడంబరములకు తల ఒగ్గని మనస్సేర్పడ వలెను.

ఆత్మతత్త్వ మన్నిటను నిండి యున్నది గనుక అన్నిటి యందు దానిని దర్శించుట క్షేమమగు మార్గము. ఇట్లు దర్శించువానికి భ్రమ, భ్రాంతి కలుగును. క్రమముగ అతడు సత్యదర్శనుడు కాగలడు. పెద్దపెద్ద ఘనకార్యములను నిర్వహించువారు చిన్న విషయము లందు అశ్రద్ధవలన తలక్రిందులగుట, పతనము చెందుట లక్షల సార్లు జరిగినది.

పర్వత శిఖరము నధిరోహించినవాడు ఇంటి గడప దాటుచు జారిపడి ఎముకలను విరుగగొట్టు కొనిన సందర్భములు గలవు. ఆత్మ ఒకే శ్రద్ధతో సమస్తమును ఆవరించి యున్నది. ఆత్మకు పెద్ద-చిన్న లేదు. అంతయు తానే. ఆత్మదర్శనాభిలాషికి గూడ అట్టి గుణము అలవడవలెను.

“సమస్తము నేనే. నేను కానిదేదియు లేదు. అందరియందు నన్నే దర్శింతును. ప్రేమింతును. ఆదరింతును. స్ఫూర్తితో ప్రతిస్పందింతును” అని ప్రతి ఉదయము భావన చేసి, ఆ భావనను ఆచరణమున పెట్టుటకు ప్రయత్నించుట సూటియగు సాధన. ఇట్టి సాధనా మార్గమున మరపు కలిగినను మరల మరల ప్రయత్నించుటయే ఉపాయము. ప్రతి సాయంత్రము నీ ఆత్మదర్శనా సాధన ఎట్లు సాగినదో పర్యాలోచనము చేయుము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2021

No comments:

Post a Comment