గీతోపనిషత్తు -196
🌹. గీతోపనిషత్తు -196 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚
శ్లోకము 37
🍀 36. మనో నిగ్రహము - శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను. క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును. 🍀
అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37
అర్జునుడు మరియొక సందేహమును వెలిబుచ్చెను. శ్రద్ధ యున్నను మనోనిగ్రహము లేనివాడు, చంచలమగు మనస్సు కలవాడు యోగసిద్ధిని పొందనపుడు అత డే గతి పొందును? ఈ ప్రశ్న చాల సమంజసమగు ప్రశ్న. శ్రద్ధ యున్నను మనో నిగ్రహము లేకపోవుట సర్వసామాన్యముగ శిష్టుల ఎడ గోచ రించును. మనో చాంచల్యము వలన యోగము కుదరదు.
యత చిత్తుడు కానిదే యోగాభ్యాసమును గూర్చి భావించుట నిరర్ధకము గదా! కావున శ్రద్ధ కలవాడు మొట్టమొదటగ కర్మఫలములను విసర్జించుట నేర్వవలెను. కర్తవ్య కర్మనే నిర్వర్తించుట నేర్వవలెను. ఇష్టాయిష్టములను ఆధారముగ చేసుకొని జీవించుటగాక కర్తవ్యమునే అనుసరించుట నేర్వవలెను.
క్రమముగ స్వంత సంకల్పము లను విసర్జించి అందివచ్చు కర్తవ్యములను మాత్రము నిర్వర్తించుచు జీవించవలెను. శీతోష్ణ సుఖదుఃఖములు, మానావమానములు వైరాగ్య దృష్టితో గ్రహించవలెను. సమ భావమును అందరియందు నిర్వర్తించుట నేర్వవలెను. శ్రద్ధ ఆధారముగ ఈ విషయములను నేర్చినచో మనో నిగ్రహ మేర్పడును.
అర్జునుడు సహజముగ శ్రద్ధా వంతుడు అగుటచే శ్రద్ధ ఆధారముగ యోగమును నిర్వర్తించుట వీలుపడు నేమోనని, చంచలమైన మనస్సు కలిగినను యోగ మభ్యసించవచ్చునేమోనని కొంత తడవు భావించి, చలిత మానసు లకు యోగాభ్యాసము కుదరదని నిశ్చయించుకొని పై విధముగ ప్రశ్నించెను.
శ్రద్ధ ప్రధానమగు విషయము. శ్రద్ధను ముందు తెలిపిన ప్రాథమిక విషయములపై నిలుపవలెను. అపుడు స్థిరమగు మనస్సు లేక యతచిత్తము ఏర్పడును. యతచిత్త మేర్పడినవాడు యతి. ఈ శ్లోకమున అయతి గూర్చి అర్జునుడు పలుకుచున్నాడు.
అయతీకి మనస్సు చలించు చుండును. యతి మనస్సు చలింపదు. యతియైనవాడికే యోగాభ్యాసము సిద్ధించును. కానివాడు ముందు యతచిత్తము నేర్పరచుకొనవలెను. కేవలము శ్రద్ధ కలిగి చరిత మనస్కులగు వారు యోగసిద్ధిని పొందలేరు గదా! అట్టివారు ఏ గతి పొందుదురని అర్జునుని ప్రశ్న.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
08 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment